పరీక్షలో ఫెయిలవుతున్నారా?
స్వప్న లిపి
చదువులు పూర్తి చేసి చాలాకాలమైనా సరే... ఒక కల మాత్రం ఎప్పుడూ వస్తుంటుంది.పరీక్షలో ఫెయిలయినట్లు!
‘‘ఈ వయసులో చదువు ఏమిటి? పరీక్షలో ఫెయిల్ కావడం ఏమిటి?’’ అని ఆశ్చర్యపోతాం. గమనించాల్సిన విషయం ఏమిటంటే, పరీక్ష అంటే కేవలం చదువులకు సంబంధించినది మాత్రమే కాదు. ‘‘ఈ జీవితం అనేది అత్యంత కష్టమైన పరీక్ష’’ అంటుంటారు పెద్దలు. జీవితంలో ప్రతి దశా ఒక పరీక్షే.
ప్రేమ, పెళ్లి, కుటుంబం... ఎన్నో విభాగాలలో ఎన్నో సమస్యలు. కొన్నిట్లో పాస్ అవుతాం. కొన్నిట్లో ఫెయిలవుతాం. ప్రేమ విషయమే తీసుకుందాం... ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ వారి ప్రేమ విజయవంతం కాలేదు. అబ్బాయికి వేరొకరితో పెళ్లి అయింది. మంచి అమ్మాయి, మంచి ఉద్యోగం... ఎలాంటి కష్టమూ లేదు. సుఖానికి వచ్చిన లోటేమీ లేదు.
అయినా సరే... తనకు తెలియకుండానే ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్... దాని తాలూకు బాధ మనసులో ఏ మూలో సుడులు తిరుగుతుంటుంది. చివరికి అది కల రూపంలో వస్తుంది.
మరొకటి ఏమిటంటే-జీవితంలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. సవాలుకు ఎదురు నిలిచి గెలుపు బాట పట్టే వాళ్లు కొందరుంటారు. సవాలుకు భయపడి యుద్ధరంగం నుంచి పారిపోయే వారు కొందరుంటారు. అలాంటి వారిలో కలిగే పశ్చాత్తాపం, బాధ... పరీక్ష ఫెయిలయినట్లుగా కల రూపంలో వస్తుంది.