దీర్ఘకాలం యవ్వనంతో ఉండటం సాధ్యమేనా?
నా వయసు 54 ఏళ్లు. ప్రత్యేకమైన వ్యాధులు, బాధలు లేవు. వయసు పెరుగుతుండటం వల్ల కనిపించే లక్షణాలు లేకుండా, దీర్ఘకాలం పాటు ఫిట్‌నెస్‌తో ఉండటానికి ఆయుర్వేదంలో మార్గాలు ఉన్నాయా? దయచేసి వివరించండి.
- పేరి శ్రీరామశర్మ, బొబ్బిలి
ఆయుర్వేదం వయసును బట్టి మానవుడి జీవన దశలను నాలుగుగా విభజించింది. అవి... ‘శైశవ, కౌమార, యౌవన, వార్థక్యాలు’. ఒక్కొక్క దశలో దానికి అనుగుణమైన జవసత్వాలుంటాయి. మానసిక పరిపక్వత కూడా అదేవిధంగా ఉంటుంది. శరీరంపై వలీ పలితాలు (వలి అంటే చర్మం ముడతలు పడడం, పలితం అంటే కేశం తెల్లబడడం) కనిపించకపోతే మనసుకు ముసలితనం అన్న భావనే కలగదు. వయసుకు అనుగుణమైన ఆరోగ్యాన్ని అందిస్తూ ఎప్పుడూ రోగాల బారిన పడకుండా ఉండాలన్నదే ఆయుర్వేద ఆశయం. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, బలంగా ఉంటూ మానసిక దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదం ‘ఆహార, విహార, ఔషధాల’ను నిశితంగా విశదీకరించింది.
జరా అంటే ముసలితనం. జరామరణాలను శాశ్వతంగా జయించలేము. కానీ ‘అవి వచ్చేస్తున్నాయి, సమీపిస్తున్నాయి’ అనే భయాన్ని పోగొట్టేందుకు ఆయుర్వేద సూత్రాలు, ఓషధులు ఉపకరిస్తాయి. ఆయుర్వేద అష్టాంగాలలో ‘రసాయనతంత్రం, వాజీకరణ తంత్రం’ అనే రెండు శాఖలు దీనికి సంబంధించినవే. మరణం వచ్చే వరకు యౌవనంలో ఉండే ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విషయం భగవాన్ ధన్వంతరీ ప్రార్థనశ్లోకంలో గమనించవచ్చు. నమామి ధన్వంతరిమాదిదేవం... లోకే ‘జరారుర్భయ మృత్యునాశం ... ధాతారమీశం వివిధౌషధీనాం...’’
రసాయనాలు: ఆధునిక పరిభాషలో కెమికల్స్‌ను రసాయనిక పదార్థాలంటారు. కెమిస్ట్రీని రసాయనశాస్త్రం అంటారు. కానీ ఈ సందర్భానికి ఆ అర్థం వర్తించదు. ఈ పదం ఆయుర్వేదశాస్త్రపు ప్రత్యేక సాంకేతిక పదం. శరీరంలోని సప్తధాతువులలో మొదటిది ‘రస’ధాతువు. రసధాతువు పరిపుష్టంగా ఉంటే మిగిలిన ఆరు ధాతువులు (రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రం) కూడా దృఢంగా ఉంటాయి. దీనికి సంకేతంగా ‘రసాయన’ అనే పదం ఉద్భవించింది.
ఆయుర్వేదంలో కొన్ని వందల ఓషధులు, ఖనిజాలు రసాయన గుణాలు కలిగి ఉన్నాయి. అవి సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి: దీర్ఘాయుష్షు, జ్ఞాపకశక్తి, బుద్ధికుశలత, ఆరోగ్యం, యౌవనం (తరుణం వయః), తేజస్సు, శరీరకాంతి, చక్కటి కంఠస్వరం, దేహేంద్రియాలకు బలం, ప్రణతి (మానసిక ఉల్లాసం), కాంతి వర్థిల్లుతాయి.
చరకసంహితాః సూత్రస్థానం: ‘‘...లభతేనా రసాయనాత్ లాభోపాయోహి శస్తానాం రసాదీనాం రసాయనం’’ వాజీకరణ ఔషధ ప్రయోజనం. ఇది కేవలం శృంగార సామర్థ్యవర్ధకమే కాదు. దేహపుష్టి, బలం (రోగనిరోధక శక్తి) కూడా వాజీకరణ ఔషధాల వల్ల పెంపొందుతాయి. (చరకుడు : ‘‘... యశః శ్రీయం బలం పుష్టిం వాజీకరణ మేవతత్’’ కాబట్టి కొన్ని ముఖ్యమైన రసాయన వాజీకరణ ద్రవ్యాలను వైద్యసలహా మేరకు అనునిత్యం సేవిస్తే ‘వయఃస్థాపకం’’గా పనిచేస్తాయని, అదే యౌవనానికి ప్రత్యామ్నాయమని, దీర్ఘాయుః కారకమని ఆయుర్వేదం ఉటంకించింది. చరకాచార్యులు ఓ పది ద్రవ్యాలను ప్రత్యేకించి ‘వయఃస్థాపకాలుగా పేర్కొన్నారు.
‘‘అమృతా అభయాధాత్రీ యుక్తా శ్వేతాజీవంతీ, అతిసారా, మండూక పర్ణీ, స్థిరా, పునర్నవా... ఇతి దశేమాని వయః స్థాపనాని భవంతి’’ తెలుగులో అవి... ‘‘తిప్పతీగె, కరక్కాయ, ఉసిరికాయ, సన్నరాస్నము, చల్లగుమ్ముడు, మనుబాల, పిల్లిపీచర, మండూకపర్ణి, బ్రాహ్మీ, గలిజేరు‘‘. వీటిలో దేనినైనా కషాయరూపంలో సేవించవచ్చు.
బజారులో లభించేవి, నిత్యం వాడుకోదగినవి, దుష్ఫలితాలు లేని రసాయనాలు
గుడూచీసత్వం (తిప్పసత్తు): 2 గ్రాములు రెండుపూటలా తేనెతో.
త్రిఫలాచూర్ణం: 3 గ్రాములు ప్రతి రాత్రి తేనెతో
శిలాజిత్ క్యాప్సూల్స్: రోజుకి రెండు కూష్మాండలేహ్యం / చ్యవనప్రాశలేహ్యం / అగస్త్యహరీతకీ రసాయనం ఒక చెంచా, రెండుపూటలా చప్పరించి పాలు తాగాలి.
శతావరీ కల్ప: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా
గృహవైద్యం: రోజుకు 5 తులసి, 2 మారేడు దళాలు నమిలి తినండి.
ఆహారం: ఉప్పు, పులుపు, కారం చాలా తక్కువగా ఉండే సాత్విక శాకాహారం తీసుకోవాలి. మిత, సమీకృతాహారం దృష్టిలో ఉంచుకోవాలి. ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు వెన్న, ఆవు పెరుగు నిత్యం తీసుకోగల రసాయనాలు.
విహారం: తగినంత నిద్ర, వ్యాయామం, ధ్యానం అవసరం. మానసికంగా శాంతం, ఉత్సాహం, సంతోషం అవసరం. శోక చింతా భయద్వేషాలు ఆయుఃక్షీణానికీ, వ్యాధులకు దారితీస్తాయి. ఒత్తిడిని అధిగమించడం కూడా అవసరమని తెలుసుకోవాలి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్,
హుమాయూన్‌నగర్, హైదరాబాద్