family features
-
చారెడు ఉప్పు... చిటికెడు పసుపు
దోసెపిండి పులిసినట్టుగా అనిపించినప్పుడు కొద్దిగా గోధుమపిండిని కలిపితే... పులిసిన వాసన తగ్గడంతో పాటు దోసెలు రుచిగా వస్తాయి. బంగాళదుంపలు ఉడికించే నీటిలో చిటికెడు ఉప్పు వేస్తే... తొక్క తేలికగా ఊడి వస్తుంది. చీమల బెడద ఎక్కువగా ఉంటే... అవి తిరుగుతున్న చోట కాస్త బేబీ పౌడర్‌ను చల్లాలి. ఇంగువ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే... అది ఉంచిన డబ్బాలో ఒక ఎండు మిరపకాయ వేయాలి. నీటిలో చిటికెడు పసుపు కలిపి గదిలో చల్లితే దోమల బెడద తగ్గుతుంది. దోసెల పిండి రుబ్బేటప్పుడు కాసింత లేత సొరకాయ గుజ్జు కూడా కలిపి రుబ్బితే... దోసెలు మృదువుగా రావడమే కాక ప్రత్యేక రుచి వస్తుంది. కాకరకాయ చేదుగా ఉంటుందని పిల్లలు తినడం లేదా? అయితే కాకరకాయ కూర వండేటప్పుడు అందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు... కొత్త రుచి వస్తుంది. టొమాటోలు త్వరగా ఉడకాలంటే... వాటిని ఉడికించేటప్పుడు చిటికెడు ఉప్పు, కొద్దిగా చక్కెర వేయాలి. -
మెరుగులు మెరుపులు
అరటిపండు తొక్కల లోపల ఉండే తెల్లని గుజ్జును తీసుకోవాలి. ప్రతిరోజూ బ్రష్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జుతో పళ్లు తోముకోవాలి. పది నుంచి ఇరవై రోజుల పాటు ఇలా చేస్తే... రంగు మారిన దంతాలు మళ్లీ తళతళలాడతాయి. బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమంతో పళ్లు తోముకుంటే గార వదిలిపోతుంది. దంతాలు మెరుస్తాయి. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకుని రోజూ తోముకుంటే... దంతాలు శుభ్రంగా ఉంటాయి. దంత, చిగుళ్ల సమస్యలు కూడా దరి చేరవు. స్ట్రాబెర్రీలను మెత్తని పేస్ట్‌లా చేసి, అందులో కాసింత బేకింగ్ సోడాని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి వేలితో కానీ, బ్రష్‌తో కానీ దంతాలను రుద్దుకుంటే పసుపురంగు పోతుంది. కలబంద గుజ్జు... అదేనండీ అలోవెరా జెల్ పళ్లకు పూయాలి. పది నిమిషాలు అలాగే వదిలేసి, ఆ తర్వాత గోరువెచ్చని నీటిని పుక్కిలించాలి. ఆపైన మామూలుగా బ్రష్ చేసుకోవాలి. వారానికోసారైనా ఈ చిట్కాని పాటిస్తే దంతాలు సురక్షితంగా ఉంటాయి. -
జాకట్టు
ఒకప్పుడు చీరకి బ్లౌజ్ మ్యాచ్ చేసేవారు. ఇప్పుడు... ట్రెండ్ మారింది. ఒక బ్లౌజ్ డిజైన్ చేయించి నాలుగు చీరలు మ్యాచ్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్లో చీరకంటే బ్లౌజే ఖరీదు. అలాంటి కొన్ని ట్రెండీ.. న్యూ స్టైల్.. ఫ్యాషనబుల్.. హాపెనింగ్.. జా‘కట్టు’ల గురించి మీ కోసం... టు టోన్ శారీస్‌కి బార్డర్ స్లీవ్స్: ఖాదీ, ఉప్పాడ, కంచి పట్టు చీరలు ప్రస్తుత ట్రెండ్‌లో ముందున్నాయి. వీటిలో ప్లెయిన్‌గా ఉండే టు టోన్ శారీస్ మరింత ప్రాచుర్యంలో ఉన్నాయి. పెద్ద పెద్ద బార్డర్ చీరలను అతివలు బాగా ఇష్టపడుతున్నారు. వీటికి బ్లౌజ్ గ్రాండ్‌గా ఉండేలా డిజైన్ చేయించుకుంటున్నారు. లాంగ్ స్లీవ్స్, దాని మీద పెద్ద బుటా వర్క్ ప్రత్యేక ఆకర్షణను తెస్తున్నాయి. బార్డర్ స్లీవ్స్‌పై ఇంపైన డిజైన్: పట్టు చీర బార్డర్ని స్లీవ్స్‌కి వేయించుకొని, బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ స్లీవ్స్ మీద డిజైన్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు. కాంట్రాస్ట్ కలర్స్: చీరలకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వాడటం అనేది ఈ మధ్య మళ్ళీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. లాంగ్ స్లీవ్స్‌కి హెవీ వర్క్‌ని ఇష్టపడుతున్నారు. పెళ్ళిళ్లలాంటి వేడుకల్లో ఇలాంటివి బాగా ధరిస్తున్నారు. బంగారు, గంధపు రంగు చీరలు ఉంటే బ్రైట్ రెడ్, గ్రీన్ కలర్ పట్టు జాకట్టులకు జర్దోసి, నక్షీ, స్వరోస్కితో వర్క్‌లను ఇష్టపడుతున్నారు. ఫ్రెంచ్నాట్ స్టైల్: పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్‌ను ఎంచుకొని శారీలోని ఏదైనా ఒక కలర్ థ్రెడ్‌తో బ్లౌజ్మీద వర్క్ చేయడం దీని ప్రత్యేకత. షార్ట్ స్లీవ్స్ హెవీ డిజైన్: సింపుల్‌గా కావాలనుకునేవారు షార్ట్ స్లీవ్స్‌కి వెళుతున్నారు. అయితే, వీటి మీద మళ్ళీ. ఆలోవర్ బుటా, స్లీవ్స్ అడుగుతున్నారు. నెటెడ్ లాంగ్ స్లీవ్స్: ఇంకొందరు బ్రొకెడ్ బాడీపార్ట్ అడిగినా దానికి నెటెడ్ లాంగ్ స్లీవ్స్ కావాలంటున్నారు. బోట్‌నెక్ హవా: ఈ మధ్య కాలంలో బోట్నెక్స్దే హవా అంతా! వీటిలో చాలా రకాల స్టైల్స్ వచ్చాయి. కలంకారీ, బ్యాక్ ఓపెన్ బాగా నడుస్తుంది. పట్టు మాత్రమే కాకుండా డిజైనర్, హ్యాండ్లూమ్ శారీస్‌కి ఈ నెక్ డిజైన్ మంచి ఎంపిక. కాలర్‌నెక్ డిజైన్స్‌ను ముప్పై ఏళ్లు పైబడిన వారు బాగా వాడుతున్నారు. అయితే, ఆభరణాలు వేసుకోవాలనుకునేవారు మాత్రం హాఫ్ కాలర్ని ఇష్టపడుతున్నారు. దీంట్లో షర్ట్ కాలర్, హాఫ్ కాలర్, చైనీస్ కాలర్.. అంటూ చాలా రకాలున్నాయి. పాతకాలం నాటి లుక్‌ని ఇష్టపడేవారు కాలర్ లేని హైనెక్ లైన్‌ని కోరుకుంటున్నారు. దీనికీ ముప్పై ఏళ్ల వయసు పై బడినవారు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఖాదీ, భాగల్పూరి, ఇకత్, పోచంపల్లి వంటి శారీస్‌కి హుందాతనాన్ని పెంచే లుక్‌ని ఇస్తుంది. ఇరవై ఏళ్ల పైబడినవారు షోల్డర్‌లెస్ స్టైల్‌ని ఇష్టపడుతున్నారు. పట్టు చీరలకు లాంగ్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్ ఎంచుకుంటున్నారు. బోట్నెక్స్, హై నెక్స్ని నలభై ఏళ్ల పైబడినవారి ఎంపిక అవుతుంది. జాకెట్ మెటీరియల్స్‌లో పట్టు, రా సిల్క్, నెటెడ్, ప్రింటెడ్, ఫ్లోరల్ డిజైన్స్ ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్నాయి. - వర్ష మహేందర్, బ్లౌజ్ డిజైనర్, జస్ బ్లౌజ్, హైదరాబాద్ -
దీర్ఘకాలం యవ్వనంతో ఉండటం సాధ్యమేనా?
నా వయసు 54 ఏళ్లు. ప్రత్యేకమైన వ్యాధులు, బాధలు లేవు. వయసు పెరుగుతుండటం వల్ల కనిపించే లక్షణాలు లేకుండా, దీర్ఘకాలం పాటు ఫిట్నెస్తో ఉండటానికి ఆయుర్వేదంలో మార్గాలు ఉన్నాయా? దయచేసి వివరించండి. - పేరి శ్రీరామశర్మ, బొబ్బిలి ఆయుర్వేదం వయసును బట్టి మానవుడి జీవన దశలను నాలుగుగా విభజించింది. అవి... ‘శైశవ, కౌమార, యౌవన, వార్థక్యాలు’. ఒక్కొక్క దశలో దానికి అనుగుణమైన జవసత్వాలుంటాయి. మానసిక పరిపక్వత కూడా అదేవిధంగా ఉంటుంది. శరీరంపై వలీ పలితాలు (వలి అంటే చర్మం ముడతలు పడడం, పలితం అంటే కేశం తెల్లబడడం) కనిపించకపోతే మనసుకు ముసలితనం అన్న భావనే కలగదు. వయసుకు అనుగుణమైన ఆరోగ్యాన్ని అందిస్తూ ఎప్పుడూ రోగాల బారిన పడకుండా ఉండాలన్నదే ఆయుర్వేద ఆశయం. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, బలంగా ఉంటూ మానసిక దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదం ‘ఆహార, విహార, ఔషధాల’ను నిశితంగా విశదీకరించింది. జరా అంటే ముసలితనం. జరామరణాలను శాశ్వతంగా జయించలేము. కానీ ‘అవి వచ్చేస్తున్నాయి, సమీపిస్తున్నాయి’ అనే భయాన్ని పోగొట్టేందుకు ఆయుర్వేద సూత్రాలు, ఓషధులు ఉపకరిస్తాయి. ఆయుర్వేద అష్టాంగాలలో ‘రసాయనతంత్రం, వాజీకరణ తంత్రం’ అనే రెండు శాఖలు దీనికి సంబంధించినవే. మరణం వచ్చే వరకు యౌవనంలో ఉండే ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విషయం భగవాన్ ధన్వంతరీ ప్రార్థనశ్లోకంలో గమనించవచ్చు. నమామి ధన్వంతరిమాదిదేవం... లోకే ‘జరారుర్భయ మృత్యునాశం ... ధాతారమీశం వివిధౌషధీనాం...’’ రసాయనాలు: ఆధునిక పరిభాషలో కెమికల్స్‌ను రసాయనిక పదార్థాలంటారు. కెమిస్ట్రీని రసాయనశాస్త్రం అంటారు. కానీ ఈ సందర్భానికి ఆ అర్థం వర్తించదు. ఈ పదం ఆయుర్వేదశాస్త్రపు ప్రత్యేక సాంకేతిక పదం. శరీరంలోని సప్తధాతువులలో మొదటిది ‘రస’ధాతువు. రసధాతువు పరిపుష్టంగా ఉంటే మిగిలిన ఆరు ధాతువులు (రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రం) కూడా దృఢంగా ఉంటాయి. దీనికి సంకేతంగా ‘రసాయన’ అనే పదం ఉద్భవించింది. ఆయుర్వేదంలో కొన్ని వందల ఓషధులు, ఖనిజాలు రసాయన గుణాలు కలిగి ఉన్నాయి. అవి సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి: దీర్ఘాయుష్షు, జ్ఞాపకశక్తి, బుద్ధికుశలత, ఆరోగ్యం, యౌవనం (తరుణం వయః), తేజస్సు, శరీరకాంతి, చక్కటి కంఠస్వరం, దేహేంద్రియాలకు బలం, ప్రణతి (మానసిక ఉల్లాసం), కాంతి వర్థిల్లుతాయి. చరకసంహితాః సూత్రస్థానం: ‘‘...లభతేనా రసాయనాత్ లాభోపాయోహి శస్తానాం రసాదీనాం రసాయనం’’ వాజీకరణ ఔషధ ప్రయోజనం. ఇది కేవలం శృంగార సామర్థ్యవర్ధకమే కాదు. దేహపుష్టి, బలం (రోగనిరోధక శక్తి) కూడా వాజీకరణ ఔషధాల వల్ల పెంపొందుతాయి. (చరకుడు : ‘‘... యశః శ్రీయం బలం పుష్టిం వాజీకరణ మేవతత్’’ కాబట్టి కొన్ని ముఖ్యమైన రసాయన వాజీకరణ ద్రవ్యాలను వైద్యసలహా మేరకు అనునిత్యం సేవిస్తే ‘వయఃస్థాపకం’’గా పనిచేస్తాయని, అదే యౌవనానికి ప్రత్యామ్నాయమని, దీర్ఘాయుః కారకమని ఆయుర్వేదం ఉటంకించింది. చరకాచార్యులు ఓ పది ద్రవ్యాలను ప్రత్యేకించి ‘వయఃస్థాపకాలుగా పేర్కొన్నారు. ‘‘అమృతా అభయాధాత్రీ యుక్తా శ్వేతాజీవంతీ, అతిసారా, మండూక పర్ణీ, స్థిరా, పునర్నవా... ఇతి దశేమాని వయః స్థాపనాని భవంతి’’ తెలుగులో అవి... ‘‘తిప్పతీగె, కరక్కాయ, ఉసిరికాయ, సన్నరాస్నము, చల్లగుమ్ముడు, మనుబాల, పిల్లిపీచర, మండూకపర్ణి, బ్రాహ్మీ, గలిజేరు‘‘. వీటిలో దేనినైనా కషాయరూపంలో సేవించవచ్చు. బజారులో లభించేవి, నిత్యం వాడుకోదగినవి, దుష్ఫలితాలు లేని రసాయనాలు గుడూచీసత్వం (తిప్పసత్తు): 2 గ్రాములు రెండుపూటలా తేనెతో. త్రిఫలాచూర్ణం: 3 గ్రాములు ప్రతి రాత్రి తేనెతో శిలాజిత్ క్యాప్సూల్స్: రోజుకి రెండు కూష్మాండలేహ్యం / చ్యవనప్రాశలేహ్యం / అగస్త్యహరీతకీ రసాయనం ఒక చెంచా, రెండుపూటలా చప్పరించి పాలు తాగాలి. శతావరీ కల్ప: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా గృహవైద్యం: రోజుకు 5 తులసి, 2 మారేడు దళాలు నమిలి తినండి. ఆహారం: ఉప్పు, పులుపు, కారం చాలా తక్కువగా ఉండే సాత్విక శాకాహారం తీసుకోవాలి. మిత, సమీకృతాహారం దృష్టిలో ఉంచుకోవాలి. ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు వెన్న, ఆవు పెరుగు నిత్యం తీసుకోగల రసాయనాలు. విహారం: తగినంత నిద్ర, వ్యాయామం, ధ్యానం అవసరం. మానసికంగా శాంతం, ఉత్సాహం, సంతోషం అవసరం. శోక చింతా భయద్వేషాలు ఆయుఃక్షీణానికీ, వ్యాధులకు దారితీస్తాయి. ఒత్తిడిని అధిగమించడం కూడా అవసరమని తెలుసుకోవాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
పెట్టే మనసు... పెంచే నేర్పు
‘‘అమ్మ నాకు ఎదుటి వారికి ఇచ్చే గుణాన్ని నేర్పించింది. అదే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. ఆమె క్షణం విశ్రాంతి తీసుకోకుండా శ్రమించేది. ఎందరు వచ్చినా ఓర్పుగా వండి పెట్టేది. సమాజం నుంచి గౌరవాలు పొందడమే కాదు, అదే సమాజానికి నీకు చేతనైనంత తిరిగి ఇవ్వాలి అనేది నేను ఆమె నుంచే నేర్చుకున్నాను’’ అంటూ తన తల్లి గురించి ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మన్నం గోపీచంద్. ‘‘పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతలను మరింతగా పెంచింది. ఇప్పటి నుంచి నెలకు 50 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తాను’’ అంటున్నారు ఈ డాక్టర్. ‘‘మా అమ్మ వెంకట సుబ్బమ్మ. ఇప్పుడు తనకి ఎనభై ఏళ్లు దాటాయి. మాది ఒంగోలుకు ఐదు కిలోమీటర్ల దూరాన లింగంగుంట. వ్యవసాయ కుటుంబం. మా అమ్మ ఎప్పుడూ పని చేస్తూ, చేయిస్తూ ఉండేది. మమ్మల్ని తనతోపాటు పొలం తీసుకెళ్లి గేదెలకు గడ్డి కోయించేది. నాన్న ఒంగోలులో మెడికల్ షాపు నడిపేటప్పుడు రోజూ మధ్యాహ్నం మా ఇంట్లో పదిహేను మంది భోజనం చేసేవారు. మా గ్రామం నుంచి వైద్యం కోసం వచ్చిన వాళ్లు, ఇతర పనుల మీద పట్టణానికి వచ్చినవాళ్లు ఉండేవాళ్లు. మా అయిదుగురు తోబుట్టువులతోపాటు బంధువుల పిల్లలు కూడా మా ఇంట్లో ఉండి చదువుకునేవాళ్లు. అందరినీ ఆమె ఒకేలా చూసేది. ప్రేమగా భోజనం పెట్టేది. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడేది కాదు. ఎప్పటి పనులు అప్పుడు అయిపోవాలి. లేదంటే ఒప్పుకునేది కాదు. మమ్మల్ని నాన్న ఒక్క దెబ్బ కూడా వేయలేదు కానీ అమ్మ చేతిలో మాత్రం దెబ్బలు పడేవి. అమ్మ కళ్లలో సంతోషం! అమ్మ తన కర్తవ్యాన్ని ఒక యజ్ఞంలా నిర్వర్తించేది. ఎవరి నుంచి ఏమీ ఆశించేది కాదు. పిల్లల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. నేను ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నప్పుడు ఆమె కళ్లలో పట్టలేనంత సంతోషం కనిపించింది. ఇప్పటికీ తన కోసం ఏమీ కోరుకోదు. ఇతరుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మా ఊరి దేవాలయాలు, పూజారుల కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటుంది. మా ఊళ్లో పూజారుల కుటుంబాల్లో ఏకాకిగా మిగిలిపోయిన వాళ్లు పన్నెండు మంది వరకు ఉన్నారు. వాళ్లకు ఏటా దుస్తులు, ఏడాదికి సరిపడే ధాన్యం, పప్పులు పంపించాలని కోరింది. అమ్మ కోరిక తీర్చడానికి నేను చేస్తున్నవి ఏవైనా ఉన్నాయంటే ఇలాంటివే. తనకోసం ఆభరణాలు తెచ్చినా వాటి పట్ల ఆసక్తి కనబరచదు. అంతటి నిరాడంబర జీవి. మనుమరాలికీ అమ్మే! మా అమ్మ నాకే కాదు మా అమ్మాయికీ అమ్మే. చేయి పట్టుకుని నడిపించడం, మాటలు నేర్పించడం... పూర్తిగా మా అమ్మ చేతిలోనే పెరిగింది. మమ్మల్ని పెంచేటప్పుడు ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉండేది. మా అమ్మాయిని పెంచేటప్పటికి పనుల నుంచి వెసులుబాటు వచ్చేసింది. తాను నమ్మిన విలువలను మా అమ్మాయికి నేర్పించింది. నికితలో కనిపించే ఫిలసాఫికల్ వే మా అమ్మ వేసిన బాట అనే చెప్పాలి. ఫ్యాషనబుల్ లైఫ్‌స్టయిల్ మీద వ్యామోహం పెంచుకోకుండా బాధ్యతగా వ్యవహరించేటట్లు తీర్చిదిద్దింది. అమ్మ మా కోసం విదేశాలకు రాలేదు కానీ మనుమరాలి కోసం ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఆమె మమ్మల్ని పెంచినట్లే కుటుంబ విలువలు నేర్పిస్తూ మేం పెంచగలమో లేదో నని పాపను మా అమ్మ చేతుల్లోనే పెట్టాం. నికితకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ యానిమేషన్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన రావడానికి స్ఫూర్తి మా అమ్మే. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి