పెట్టే మనసు... పెంచే నేర్పు
‘‘అమ్మ నాకు ఎదుటి వారికి ఇచ్చే గుణాన్ని నేర్పించింది. అదే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. ఆమె క్షణం విశ్రాంతి తీసుకోకుండా శ్రమించేది. ఎందరు వచ్చినా ఓర్పుగా వండి పెట్టేది. సమాజం నుంచి గౌరవాలు పొందడమే కాదు, అదే సమాజానికి నీకు చేతనైనంత తిరిగి ఇవ్వాలి అనేది నేను ఆమె నుంచే నేర్చుకున్నాను’’ అంటూ తన తల్లి గురించి ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మన్నం గోపీచంద్. ‘‘పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతలను మరింతగా పెంచింది. ఇప్పటి నుంచి నెలకు 50 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్‌లు చేస్తాను’’ అంటున్నారు ఈ డాక్టర్.
‘‘మా అమ్మ వెంకట సుబ్బమ్మ. ఇప్పుడు తనకి ఎనభై ఏళ్లు దాటాయి. మాది ఒంగోలుకు ఐదు కిలోమీటర్ల దూరాన లింగంగుంట. వ్యవసాయ కుటుంబం. మా అమ్మ ఎప్పుడూ పని చేస్తూ, చేయిస్తూ ఉండేది. మమ్మల్ని తనతోపాటు పొలం తీసుకెళ్లి గేదెలకు గడ్డి కోయించేది. నాన్న ఒంగోలులో మెడికల్ షాపు నడిపేటప్పుడు రోజూ మధ్యాహ్నం మా ఇంట్లో పదిహేను మంది భోజనం చేసేవారు.
మా గ్రామం నుంచి వైద్యం కోసం వచ్చిన వాళ్లు, ఇతర పనుల మీద పట్టణానికి వచ్చినవాళ్లు ఉండేవాళ్లు. మా అయిదుగురు తోబుట్టువులతోపాటు బంధువుల పిల్లలు కూడా మా ఇంట్లో ఉండి చదువుకునేవాళ్లు. అందరినీ ఆమె ఒకేలా చూసేది. ప్రేమగా భోజనం పెట్టేది. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడేది కాదు. ఎప్పటి పనులు అప్పుడు అయిపోవాలి. లేదంటే ఒప్పుకునేది కాదు. మమ్మల్ని నాన్న ఒక్క దెబ్బ కూడా వేయలేదు కానీ అమ్మ చేతిలో మాత్రం దెబ్బలు పడేవి.
అమ్మ కళ్లలో సంతోషం!
అమ్మ తన కర్తవ్యాన్ని ఒక యజ్ఞంలా నిర్వర్తించేది. ఎవరి నుంచి ఏమీ ఆశించేది కాదు. పిల్లల మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి కాదు. నేను ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నప్పుడు ఆమె కళ్లలో పట్టలేనంత సంతోషం కనిపించింది. ఇప్పటికీ తన కోసం ఏమీ కోరుకోదు. ఇతరుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మా ఊరి దేవాలయాలు, పూజారుల కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటుంది.
మా ఊళ్లో పూజారుల కుటుంబాల్లో ఏకాకిగా మిగిలిపోయిన వాళ్లు పన్నెండు మంది వరకు ఉన్నారు. వాళ్లకు ఏటా దుస్తులు, ఏడాదికి సరిపడే ధాన్యం, పప్పులు పంపించాలని కోరింది. అమ్మ కోరిక తీర్చడానికి నేను చేస్తున్నవి ఏవైనా ఉన్నాయంటే ఇలాంటివే. తనకోసం ఆభరణాలు తెచ్చినా వాటి పట్ల ఆసక్తి కనబరచదు. అంతటి నిరాడంబర జీవి.
మనుమరాలికీ అమ్మే!
మా అమ్మ నాకే కాదు మా అమ్మాయికీ అమ్మే. చేయి పట్టుకుని నడిపించడం, మాటలు నేర్పించడం... పూర్తిగా మా అమ్మ చేతిలోనే పెరిగింది. మమ్మల్ని పెంచేటప్పుడు ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉండేది. మా అమ్మాయిని పెంచేటప్పటికి పనుల నుంచి వెసులుబాటు వచ్చేసింది. తాను నమ్మిన విలువలను మా అమ్మాయికి నేర్పించింది. నికితలో కనిపించే ఫిలసాఫికల్ వే మా అమ్మ వేసిన బాట అనే చెప్పాలి.
ఫ్యాషనబుల్ లైఫ్‌స్టయిల్ మీద వ్యామోహం పెంచుకోకుండా బాధ్యతగా వ్యవహరించేటట్లు తీర్చిదిద్దింది. అమ్మ మా కోసం విదేశాలకు రాలేదు కానీ మనుమరాలి కోసం ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఆమె మమ్మల్ని పెంచినట్లే కుటుంబ విలువలు నేర్పిస్తూ మేం పెంచగలమో లేదో నని పాపను మా అమ్మ చేతుల్లోనే పెట్టాం. నికితకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ యానిమేషన్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన రావడానికి స్ఫూర్తి మా అమ్మే.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి