నిద్రలేచిన వెంటనే నడవలేకపోతున్నాను | family health counciling | Sakshi
Sakshi News home page

నిద్రలేచిన వెంటనే నడవలేకపోతున్నాను

Published Fri, Apr 20 2018 1:16 AM | Last Updated on Fri, Apr 20 2018 1:16 AM

family health counciling - Sakshi

ఆర్థోపెడిక్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 57 ఏళ్లు. మూడు వారాల నుంచి నేను ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటోంది. కీళ్లనొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటి? తగిన సలహా ఇవ్వండి.  – డి. అనసూయమ్మ, సామర్లకోట 
మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీళ్లలోని కార్టిలేజ్‌ అనే మృదులాస్థి అరుగుదలకు గురికావడం, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై అరుగుదల ప్రభావం పడటాన్ని  ఆస్టియో ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇది 40 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఎక్కువ. ఎక్కువగా మోకాలిలో కనిపించే సమస్య అయినప్పటికీ చేతివేళ్లు, వెన్నుపూస, తుంటి ప్రాంతం, కాలివేళ్లలోనూ ఆస్టియో ఆర్థరైటిస్‌ తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య సాధారణంగా గతంలో కీళ్లకు ఏదైనా దెబ్బ తగిలి ఉండటం, అధిక బరువు, కాళ్ల ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఉండటం, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం వంటివి కారణాలు. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనిపించవచ్చు. మీరు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్ష, మోకాలి నుంచి కొద్దిగా ద్రవాన్ని తీసి పరీక్షించడం, ఎక్స్‌–రే, సీటీ స్కాన్‌ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. మీకు దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి.

ఎముకల్లో రాత్రివేళ నొప్పి... ఎందుకిలా? 

నా వయసు 48 ఏళ్లు. కొన్ని నెలలుగా కాళ్ల ఎముకల్లో రాత్రి వేళల్లో నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి, యాంటీబయాటిక్స్‌ తీసుకున్నాను. కానీ ఎలాంటి ప్రయోజనమూ కనిపించడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – డి. చంద్రశేఖర్‌రావు, విజయవాడ 
మీకు ఎక్కువగా రాత్రివేళల్లో ఎముక నొప్పి వస్తోందటున్నారు. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీకు ఎముక క్యాన్సర్‌ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. మామూలుగా ఎముక క్యాన్సర్‌ను నొప్పితోగాని, నొప్పి లేకుండా కణుతులతోగాని గుర్తిస్తారు. ఎముకకు సంబంధించిన మృదు కణజాలంలో క్యాన్సర్‌ సోకినప్పుడు కణితి నొప్పిగా ఉండకపోవచ్చు. ఎముకలో గట్టిగా ఉండే భాగంలో క్యాన్సర్‌ వస్తే మాత్రం నొప్పి, ఆ భాగంలో వాపు ముందుగా కనిపిస్తాయి. ఎముక క్యాన్సర్‌ రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఎముకకు చుట్టు కొంత భాగం వరకు వాపు ఉంటుంది. క్యాన్సర్‌ వ్యాధి ఒక చోటి నుంచి ఇంకో చోటికి వ్యాపించకుండా ఉండటానికి మన శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. దీని బయట కొంత భాగం వరకు ఉన్న భాగాన్ని ‘రియాక్టివ్‌ జోన్‌’ అంటారు. క్యాన్సర్‌ వ్యాప్తిని నివారించడానికి ప్రకృతి చేసిన ఏర్పాటిది. క్యాన్సర్‌ మొదటి దశలో ఉన్నవారికి ఈ రియాక్టివ్‌ జోన్‌ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి క్యాన్సర్‌ దుష్ప్రభావాలు, మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ఆ భాగంలో కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి, అక్కడికక్కడే రేడియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ రేడియేషన్‌ థెరపీ అంటారు. చాలా మంది ఎముకలో నొప్పి, వాపు కనిపించగానే మసాజ్‌ చేయిస్తుంటారు. అందుకే నొప్పి, వాపు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

చిన్న దెబ్బ తగిలినా ఎంతో నొప్పి! 
నా బరువు 87 కేజీలు. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు. నాకు యూరిక్‌ యాసిడ్‌ కాస్త ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులో వచ్చింది. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేనంత నొప్పి వస్తోంది. ఎముకలు చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయి. నాకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలా రోజులు ఉంటోంది. నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.  – రాధిక, నల్లగొండ 
మీరు మీ వయసెంతో మీ లేఖలో చెప్పలేదు. అయితే మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ ఎత్తుకు మీరు చాలా బరువు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి మొదట మీరు మీ ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. బాడీమాస్‌ ఇండెక్స్‌ ప్రకారం మీ ఎత్తుకు సరిపడ బరువు ఉండేలా చూసుకోవాలి. మీరు చాలా బరువు పెరగడం వల్ల ఆ భారమంతా మీ ఎముకలపై పడి అవి నాజూకుగా తయారయ్యాయి. ఆ కారణంగానే మీకు ఇలా నొప్పి వస్తుండవచ్చు. మీరు కొద్దిగా ఆహారనియమాలు పాటిస్తూ, ఉదయం సాయంత్రం వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేస్తూ మీ అధిక బరువును నియంత్రించుకోండి. అలాగే రోజూ ఉదయం ఒక క్యాల్షియం మాత్ర తీసుకుంటూ ఉండండి. ఇలా మూడు నెలలు చేయండి. దాంతో మీ బరువు నియంత్రణలోకి వచ్చి మీ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.
డాక్టర్‌ ప్రవీణ్‌ మేరెడ్డి, కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement