ఎక్కడి నుంచో ఏడుపు. పిల్లాడి ఏడుపు. గుక్కపట్టి ఏడుస్తున్న ఏడుపు. గుండెల మీద బాదుతున్న ఏడుపు. జైలు గదిలో అతడు ఉలిక్కిపడి లేచాడు. చిన్న నేరమే అనుకున్నాడు. కానీ... జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నాడు.
అనంతపురం జిల్లా సోమందేపల్లి. సాయంకాలం. పోలీస్‌స్టేషన్‌కు ఒకతను వచ్చాడు. ఆందోళనగా ఉద్వేగంగా ఉన్నాడు.‘సార్... మా అబ్బాయి కృష్ణ. ఐదేళ్ల పసివాడు. ఇంటిముందు సైకిల్ తొక్కుతున్నాడు. అంతసేపూ వాడి అమ్మ అక్కడే ఉండి లోపలేదో చిన్న పని ఉండి వెళ్లొచ్చింది. చూస్తే వీడు లేడు. అంతటా వెతికాం. ఎక్కడా లేడు. ఏం చేయాలో తెలియక మీ దగ్గరకొచ్చాం’ అన్నాడు. ‘మీ పేరు’ అడిగాడు ఎస్.ఐ. ‘లక్ష్మయ్య’వెంట అతడి భార్య కూడా వచ్చింది. కంటికి మింటికి ధారగా ఏడుస్తూ ఉంది. పోలీసులు వివరాలు రాసుకున్నారు. లక్ష్మయ్య వెంట వెళ్లిన పోలీసులు అతడి ఇంటి చుట్టుపక్కల ప్రశ్నించారు. అనుమానం ఉన్న చోటల్లా వెతికారు.అందరి సమాధానం ఒకటే ‘మాకు తెలియదు.’ చీకటి పడినా వెతుకుతూనే ఉన్నారు. కానీ, ఆ పసివాడి ఆచూకీ తెలియలేదు.
లక్ష్మయ్యకు ఎవరైనా శత్రువులు ఉన్నారా! అనుమానంతో ఈ దిశగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు పోలీసులు.లక్ష్మయ్యకు కిరాణాకొట్టు ఉంది. చిరువ్యాపారి. అతడికి ఆ ప్రాంతంలో మంచివాడన్న పేరుంది. ఎవరితోనూ తగాదాలు లేవు. వ్యాపారంలో ఇబ్బందులూ లేవు. పెళ్లయిన పదేళ్లకు పుట్టాడు కృష్ణ. దాంతో వాడిని కళ్లలో వత్తులు వేసుకొని చూసుకుంటున్నారు తల్లిదండ్రి. సో... ఎవరైనా ఎత్తుకెళ్లే అవకాశం లేదు. మరి ఆ పిల్లాడే ఎటైనా వెళ్లి నూతిలోనో గొయ్యిలోనో పడ్డాడా? ఎందుకంటే వాడు తొక్కిన సైకిల్ అక్కడే ఉంది. ఇలా అనుకుంటూ ఇండ్లు, ఆటస్థలాలు, బావులూ పరిశీలించారు. ఏం తేలలేదు.తిండి తిప్పల్లేకుండా బిడ్డ కోసం పలవరిస్తున్న ఆ తల్లిదండ్రి బాధ చూడలేకపోయారు పోలీసులు.
మరుసటి రోజు ఉదయం కిరాణాకొట్టులో ఉన్న ల్యాండ్‌లైన్‌కి ఫోన్ వచ్చింది. లక్ష్మయ్య ఎత్తాడు. మీ పిల్లవాడిని కిడ్నాప్ చేశాం. 5 లక్షలు ఇస్తే వదిలేస్తాం. ఈ విషయం పోలీసులకు చెబితే పిల్లవాడ్ని చంపేస్తాం’... ఆ మాటలు వింటూనే లక్ష్మయ్య హడలిపోయాడు.‘అయ్య, పిల్లవాడిని ఏమీ చేయద్దు. మీరడిగిన డబ్బు ఎలాగోలా ఇచ్చుకుంటా!’ మొరపెట్టుకున్నాడు. పిల్లవాడి ఆచూకీ గురించి వాకబు చేయడానికి అప్పుడే అక్కడకు వచ్చిన ఎస్సై లక్ష్మయ్య ద్వారా విషయం అంతా విన్నాడు. ‘భయపడకండి. వాళ్లు చెప్పిన టైమ్‌కి చెప్పిన చోటుకి మీరు డబ్బుతో వెళ్దురుగానీ’ ధైర్యం చెప్పాడు.
పోలీసులు ఇచ్చిన ‘సూట్‌కేసు’ను తీసుకొని కిడ్నాపర్ చెప్పిన చోటుకి వెళ్లాడు లక్ష్మయ్య.పోలీసులు మఫ్టీలో లక్ష్మయ్యను అనుసరించారు.కొంత దూరంలో పనులు చేస్తున్నట్టు ఉండిపోయారు. కిడ్నాపర్ చెప్పిన చోట సూట్‌కేస్‌ను ఉంచాడు లక్ష్మయ్య. పనులు నటిస్తూ లక్ష్మయ్య వెళ్లినవైపే చూస్తున్న ఎస్సైకి కాసేపటికి ఓ వ్యక్తి తమ ముందు నుంచే నడిచి వెళ్లడం చూశాడు. మామూలు వ్యక్తిగానే అనిపించాడు. అతని చేతి నుంచి ఏదో జారి కింద పడింది. ఎర్రటి రంగులో ఉన్న రిబ్బన్. దాన్ని ఆ వ్యక్తి తిరిగి తీసుకుని చేతికి చుట్టుకున్నాడు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కట్టెలున్న ఒక బండి అటుగా వెళ్లింది. ఓ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అంతకుమించి ఎవరూ రాలేదు. అంతగా సంచారం ఉండని చోటు కాబట్టే కిడ్నాపర్లు ఈ ప్లేస్ చెప్పినట్టున్నారు అనుకున్నారు పోలీసులు.చీకటి పడేవరకు అక్కడే ఉన్నారు కానీ ఎవరూ ఆ సూట్‌కేసును తీసుకువెళ్లడానికి రాలేదు. చూసి చూసి తిరుగు ముఖం పట్టారు లక్ష్మయ్య, పోలీసులు.
కిరాణ కొట్టులో ఉన్న ఫోన్ మోగింది.లక్ష్మయ్య ఫోన్ ఎత్తాడు. ‘నువ్వు పోలీసులకు చెప్పలేదు. నిన్ను నమ్మాం. నిన్ను పరీక్షించడానికే మేం అక్కడికి రాలేదు. రేపు సాయంకాలం మొదటి ఆట సినిమా మొదలవగానే శ్రీనివాస థియేటర్ దగ్గరకు డబ్బులు తీసుకొని రా! అక్కడ మేం చెప్పిన చోట ఆ సూట్‌కేస్ ఉంచి వెళ్లిపో! సూట్‌కేస్ తీసుకున్నాక పిల్లవాడిని మీ ఇంటి వద్ద వదులుతాం’ అన్నార‘సరే!’ అన్నాడు లక్ష్మయ్యకిడ్నాపర్లు చెప్పిన టైమ్‌కి శ్రీనివాస థియేటర్‌కి చేరుకున్నాడు లక్ష్మయ్య.ఫోన్‌లో చెప్పిన సమాచారం మేరకు థియేటర్‌కి ఓ పక్కగా ఉన్న జనరేటర్ దగ్గర సూట్‌కేస్ ఉంచి బయటకు వచ్చేశాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు అటే చూస్తున్నారు. సూట్‌కేసును తీసుకెళ్లడానికి వచ్చినవారిని పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు గొడవపడుతూ వచ్చారు. గట్టిగట్టిగా అరుచుకుంటున్నారు. ఉన్నట్టుండి కొట్టుకోవడం మొదలుపెట్టారు. వారిని విడదీయడానికి అక్కడున్న జనం గుమికూడడం వెంటవెంటనే జరిగిపోయాయి.జనరేటర్‌కి పోలీసులకు మధ్య జనం. జనం సర్దిచెప్పడంతో ఆ ఇద్దరూ కాసేపటికి దూరం జరిగారు. జనరేటర్ దగ్గరున్న సూట్‌కేస్ పోలీసులకు కనిపించలేదు. గొడవపడుతున్న వారిద్దరిని పరిశీలనగా చూశాడు ఎస్.ఐ. అనుమానంగా అనిపించలేదు. కాని ఒక్క క్షణం మళ్లీ గమనించాడు. అందులో ఒక మనిషి చేతికి మణికట్టు మీద ఎర్ర రిబ్బన్ ఉంది. ఎర్ర రిబ్బన్. క్షణం ఆలస్యం చేయలేదు. పులిలా లంఘించి అతన్ని పట్టుకున్నాడు. తోడుగా నాటకం ఆడిన మరో వ్యక్తిని కూడా.
‘మాకేం తెలియదు సార్! అసలు ఆ పిల్లవాడెవరు? మేమెందుకు కిడ్నాప్ చేస్తాం! మా ఇద్దరికి డబ్బులకు సంబంధించిన సమస్య ఉంది. అందుకే గొడవపడ్డాం’ అన్నారు ఇద్దరూ.‘నిన్న.. ఎర్రటి రిబ్బన్ సూట్‌కేసును వెతుక్కుంటూ అక్కడికొచ్చింది. ఈ రోజు ఈ ఎర్రటి రిబ్బన్ ఇక్కడ గొడవపడుతుంది. మా కంతా తెలిసిపోయింది. అనవసరంగా తాత్సారం చేయకుండా విషయం చెప్పేస్తే ఎక్కువ కష్టపడరు. మా సహనాన్ని పరీక్షించద్దు’ అన్నారు పోలీసులు. విచారణలో విషయం అంతా విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు.‘ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసింది నేనే సార్’ అన్నాడు ఎర్రటి రిబ్బన్ కట్టుకున్న వ్యక్తి. అతని పేరు కిశోర్.‘నాకు సాయపడింది నా స్నేహితులు’ అన్నాడు. తోడుగా గొడవ పడిన వ్యక్తి కాకుండా సూట్‌కేసుతో ఉడాయించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు క్షణాల్లో పట్టుకొచ్చారు. మొత్తం ముగ్గురు చేసిన పని. కిశోర్ వివరాలు చెప్పడంమొదలుపెట్టాడు...ఓ రోజు టౌన్ నుంచి మా అక్కవాళ్లింటికి వచ్చాను. సిగిరెట్ కొనుక్కోవడానికి లక్షయ్య షాప్ ముందు ఆగాను. మధ్యాహ్న సమయం. కొట్టు దగ్గర లక్ష్మయ్య ఒక్కడే ఉన్నాడు. సిగరెట్ తీసివ్వడానికి అతను వెనక్కి తిరిగాడు. గల్లాపెట్టెలో డబ్బులు బాగా కనిపించాయి. నా చేయికి అందినంత తీసుకున్నాను. అప్పుడే లక్ష్మయ్య నన్ను చూశాడు. నన్ను తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నాడు. ఊళ్లో వాళ్లను పిలిచి వారందరి ముందు నన్ను తిట్టాడు. దొంగ అన్నాడు. నాకు చాలా అవమానం వేసింది. సిగ్గుతో చచ్చిపోయాను. అప్పటికి వెళ్లిపోయాను. ఈ సంఘటన జరిగి ఆరునెలలకు పైగానే అయ్యింది. అందరూ మర్చిపోయుంటారు. కానీ, నేను మర్చిపోలేదు. మొన్న మళ్ళీ ఈ ఊరికి వచ్చాను. లక్ష్మయ్య కంటపడ్డాడు. తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాను. కొట్టుకు కొంత దూరంలో ఉన్న వీళ్ల ఇంటి ముందు పిల్లవాడు ఆడుకుంటూ కనిపించాడు. వాడిని దూరం చేస్తే వీడికి తగిన శాస్తి కలుగుతుందని అనుకున్నాను. ఎత్తుకెళ్లిపోయాను’ అన్నాడు. ‘మరి, ఆ పిల్లవాడిని ఎక్కడ ఉంచారు?’‘చంపేశాను’‘వ్వాట్...!’ ‘అవున్సార్! వాణ్ణి చంపేస్తే నా పగ తీరుతుందనుకున్నాను. నా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఆ పిల్లవాడి గొంతు పిసికి చంపేశా. ఓ ఇంకుడుగుంత ఖాళీగా కనిపించింది. దాంట్లో పిల్లవాడిని వేసి, మట్టితో కప్పేశాం..’‘పిల్లవాడిని చంపేసింది చాలక డబ్బులు ఎందుకు డిమాండ్ చేశావ్!’‘లక్ష్మయ్యకు కొడుకు బలహీనత ఉంది కాబట్టి, క్యాష్ చేసుకుందామనుకున్నాను’ అన్నాడు కిశోర్.
కిశోర్ చెప్పిన ఇంకుడుగుంత దగ్గర తవ్వించారు. పిల్లవాడి బాడీని వెలికి తీసి, పోస్ట్‌మార్టం చేసి తల్లిదండ్రికి అప్పగించారు. ఆ తల్లిదండ్రి కడుపుకోత ఎవరూ తీర్చలేనిది. పసివాడిని కిడ్నాప్ చేసినందుకు, చంపినందుకు, డబ్బుల కోసం వేధించినందుకు... నిందితులను జైలుకు పంపించారు పోలీసులు. పసివాడిని మట్టుపెట్టునందుకు జీవితఖైదును అనుభవిస్తున్నారు వారిప్పుడు. తాము చేసిన నేరం ఎవరికీ తెలియదనుకున్నారు. కానీ, చేతికి చుట్టుకున్న ఓ ఎర్రరిబ్బన్ కూడా తమని పోలీసులకు పట్టిస్తుందని, కటకటాల వెనక్కి నెడుతుందని గుర్తించలేకపోయారు.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment