బాలికపై సామూహిక అత్యాచారం | Girl Kidnapped By Two Men And Gang Raped In Rangareddy District | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక అత్యాచారం

Published Wed, Nov 9 2022 1:07 AM | Last Updated on Wed, Nov 9 2022 1:07 AM

Girl Kidnapped By Two Men And Gang Raped In Rangareddy District - Sakshi

మీర్‌పేట: జిరాక్స్‌ కోసం బయటకు వెళ్లిన ఓ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట లెనిన్‌నగర్‌ ప్రశాంత్‌నగర్‌ ఫేజ్‌–2కు చెందిన ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 5న రాత్రి 7.30 గంటలకు స్థానికంగా ఉండే జిరాక్స్‌ షాప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన రతన్‌ (22) కలిశాడు.

నేనూ మీ ఇంటి వైపే వెళ్తున్నాను.. డ్రాప్‌ చేస్తానంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక మరో బాలుడు (17) కూడా బైక్‌పై ఎక్కాడు. బాలికను ఇంటి వద్ద దించకుండా  రైతుబజార్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను ఎక్కించుకున్న చోటే వదిలేశారు. కాగా, జిరాక్స్‌ కోసమని బయటకు వెళ్లిన కూతురు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. బాలిక ఇంటికి వచ్చిందని చెప్పడంతో  వెనక్కి వచ్చారు.

మరుసటి రోజు బాలికను ఈ విషయమై అడగగా.. రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి బైకుపై తిప్పి తిరిగి వదిలేశారని మొదట చెప్పింది. అనుమానం కలిగిన తల్లిదండ్రులు మరోసారి గట్టిగా నిలదీయడంతో వారిద్దరూ అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు రతన్, బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రతన్‌ పాత నేరస్తుడని అతనిపై నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. వారిపై పోక్సో, అత్యాచారం, కిడ్నాప్‌ కేసులు నమోదు చేశామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement