
పర్‌బత్‌తో అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నాడు. ముఖ్యంగా దేశభక్తి అంశాలు వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో అక్షయ్ ప్రస్తావన తప్పక వస్తోంది. ‘దేశంలో స్త్రీలకు శానిటరీ నాప్‌కిన్ లేదని ఉద్యమం వస్తే అక్షయ్ సినిమా చేస్తాడు. ఆడవాళ్లకు టాయిలెట్‌లు లేవంటే అక్షయ్ సినిమా చేస్తాడు. ఆడవాళ్లు మార్స్ గ్రహం మీదకు ఆర్బిటర్‌ను పంపితే అక్షయ్ సినిమా చేస్తాడు. ఇప్పుడు కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశారు... ఇక అక్షయ్ సినిమా చేస్తాడు’ అని నెట్‌లో వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధాని మోడీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి అతడు దేశ వ్యవహారాలకు సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిగా మారిపోయాడని కూడా అనవచ్చు. ఈ నేపథ్యంలో అక్షయ్ మీద అభిమానం పెంచుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది.
తాజాగా మొన్నటి ఆదివారం ఉదయం వర్షం కురుస్తున్న సమయంలో ముంబైలోని అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఒక అభిమాని ప్రత్యక్షమయ్యాడు. రోజూ ఇది మామూలే కాని ఈ అభిమాని కొంచెం వేరుగా ఉన్నాడు. ఇతడు గుజరాత్‌లోని ద్వారకా నుంచి ఏకంగా 900 కిలోమీటర్లు నడిచి అక్షయ్‌ను చూడటానికి వచ్చాడు. పేరు పర్‌బత్. అక్షయ్ ఇతణ్ణి చూసి ఆశ్చర్యపోయి ‘ఎందుకు నడిచావు’ అని అడిగాడు. ‘నేను ఫిట్‌గా ఉన్నాను. మీ అభిమానులు ఫిట్‌గా ఉంటారు. నడవడం ఆరోగ్యానికి మంచిది అని చెప్పడానికి నడిచాను’ అని జవాబు చెప్పాడు. అక్షయ్‌ను చూడటానికి పర్‌బత్ రోజుకు 18 నుంచి 21 కిలోమీటర్లు నడుస్తూ పద్దెమిది రోజుల్లో ఈ దూరం పూర్తి చేశాడు.
అక్షయ్‌లా ఉన్న మజిద్ మీర్
‘ఇంత అభిమానం మీ నుంచి పొందడం నా అదృష్టం’ అని అక్షయ్ ఆ అభిమాని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.అయితే మరోవైపు కాశ్మీర్‌లో తిరుగుతున్న ఒక పాత్రికేయునికి అచ్చం అక్షయ్ కుమార్‌ను పోలిన ఒక రైతు కనిపించాడు. అతడి పేరు మజిద్ మీర్. అయితే ఆ రైతు అక్షయ్ కుమార్ అభిమాని కాదు. సునీల్ గవాస్కర్ అభిమాని. రోజూ పొలానికి వెళ్లే ముందు సునీల్ గవాస్కర్‌లా తల మీద క్రికెట్ హ్యాట్‌ను ఆ రైతు పెట్టుకుంటాడట. సెలబ్రిటీలను ఇలా సామాన్యులు వార్తల్లో ఉంచుతూనే ఉంటారు.