డా. కేశవులు
తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ డైరెక్టర్ డా. కేశవులుతో ‘సాగుబడి’ ముఖాముఖి
ప్రశ్న: ఏయే ఉత్పత్తులకు తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ సంస్థ ద్వారా ధ్రువీకరణ పొందవచ్చు?
డా.కేశవులు: రైతులు రసాయనాలు వాడకాన్ని మాని పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే అన్ని రకాల ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పూలతోపాటు మిర్చి, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలకు మా వద్ద నుంచి సేంద్రియ ధ్రువీకరణను సులభంగా పొందవచ్చు. అంతేకాదు, అడవి నుంచి సేకరించే ఉత్పత్తులకు కూడా సేంద్రియ ధ్రువీకరణ ఇస్తాం.
ప్రశ్న: సేంద్రియ వ్యాపారులకు లైసెన్స్ ఇస్తారా?
డా. కేశవులు: సేంద్రియంగా పండించిన పంటలను శుద్ధి చేసే ప్రాసెసింగ్ సెంటర్లు, సేంద్రియ ఆహారోత్పత్తులను విక్రయించే టోకు, చిల్లర వ్యాపారులకు కూడా మా సంస్థ అనుమతి ఇస్తుంది. జీవన ఎరువులు, జీవన క్రిమి, కీటక నాశనులు వంటి సేంద్రియ ఉత్పాదకాలకు కూడా ధ్రువీకరణ ఇస్తాం.
ప్రశ్న: ఈ ధ్రువీకరణతో∙ ఎక్కడైనా అమ్ముకోవచ్చా?
డా. కేశవులు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడ సాగు చేసే రైతులైనా మా నుంచి సేంద్రియ ధ్రువీకరణ పొంది, తమ ఉత్పత్తులను మన దేశంలో, విదేశాల్లో కూడా అమ్ముకోవచ్చు.
ప్రశ్న: సేంద్రియ ధ్రువీకరణకు ఎంత ఖర్చవుతుంది?
డా. కేశవులు: వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల సంస్థ(అపెడా) నుంచి ధ్రువీకరణ హక్కులు పొందిన రాష్ట్రాల్లో తొమ్మిదవది తెలంగాణ. ఇతర రాష్ట్రాలకన్నా తక్కువ ఫీజుతోనే ధ్రువీకరణ ఇస్తున్నాం. ఏడాదికి ఒక ఎకరానికైతే రూ. 1,860 అవుతుంది. 25 ఎకరాలకైతే రూ. 2,100 అవుతుంది. సేంద్రియ పంటగా ధృవీకరణ పొందడానికి ఆహార ధాన్యాలు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలకు రెండేళ్లు పడుతుంది. బహువార్షిక పండ్ల తోటలకు మూడేళ్లు పడుతుంది. ఈలోగా కూడా సేంద్రియ ఉత్పత్తిగానే అమ్ముకోవచ్చు. సేంద్రియ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రతి ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు.. తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ, హాకా భవన్, నాంపల్లి, హైదరాబాద్. ఫోన్స్: 040–23237016, 23235939, 91000 26624.
– డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment