హరిహరప్రీతికరమైన కార్తికమాసంలో ఉన్నాం మనం. ఈ మాసంలోని రోజులన్నీ పర్వదినాలే. అయితే కార్తీకంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు.
శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటిస్తే సిరిసంపదలు, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.
ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. ఇక్కడ ఉపవాసం అంటే కేవలం కడుపు మాడ్చుకోవడమే కాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు, పాపపు ఆలోచనలు చేయరాదు, దైవదూషణ తగదు. అశ్లీల సంభాషణలలో పాలు పంచుకోరాదు. ఇతరులను ముఖ్యంగా గురువులు, పెద్దలు, పండితులను గేలి చేయరాదు. పరనింద పనికి రాదు.
ఆకలి వేస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని సూర్యాస్తమయం కోసం ఎదురు చూడటం కంటే హాయిగా భోజనం చేసి, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ప్రయోజనకరం. ఉపవాసం ఉండలేని వారు, ఉండలేకపోయానే అని బాధపడుతూ కూర్చునేకంటే, మనసులోకి చెడు ఆలోచనలు, ఇతరులకు కీడు తలపెట్టే తలంపులు రానివ్వకుండా చూసుకోవడం ఇంకా మంచిది.
మనం ఉపవాసం ఉన్నామంటే, ఇతరుల ఆకలి బాధ తెలుసుకోవడం కోసమే. మన భోజనానికి అయ్యే ఖర్చుతో పేదవాడికి కడుపు నింపడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించడం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment