
ఊబకాయం పాటు మధుమేహ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలకు సరికొత్త ఆయుధం లభించింది. కొవ్వును వేగంగా కరిగించగల, మధుమేహాన్ని తగ్గించగల రెండు హార్మోన్లను కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నోటమ్, లిపోకాలిన్–5 అనే పేరున్న ఈ రెండు హార్మోన్లతో ఇతర ఉపయోగాలు ఉన్నట్లు వీరు అంటున్నారు. అవయవాలు, కండరాల మధ్య సమాచార ప్రసారం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా తాము ఈ హార్మోన్లను గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ముందుగా తాము హార్మోన్ల వ్యవస్థ ఎలా పనిచేస్తోందో గుర్తించామని, ఆ తరువాత మనుషుల్లో, ఎలుకల్లోని హార్మోన్ల మధ్య సారూప్యతను తెలుసుకున్నామని చెబుతున్నారు.
చాలా హార్మోన్లు మనుషుల్లో, ఎలుకల్లో ఒకే తీరున పని చేస్తున్నట్లు తెలిసిందని, దీనిని బట్టి ఎలుకలలో నోటమ్, లిపోకాలిన్–5లు చేస్తున్న పని మానవులలోనూ సాధ్యమన్నది స్పష్టమైనట్లు వివరించారు. శరీరానికి పోషకాలు ఒంటబట్టేందుకు కూడా ఈ రెండు హార్మోన్లు ఉపయోగపడుతున్నట్లు తమకు తెలిసిందని, గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment