ఫాదర్ ఇన్ లాదీ బాధ్యతే
మ్యారేజ్ కౌన్సెలింగ్
చట్టం మహిళలకు అనేక రక్షణ కవచాలను ఏర్పరచింది.
పోరాడేందుకు కత్తిని, డాలును కూడా సమకూర్చింది.
అయితే ఈ చట్టాల గురించి... వాటిలోని సెక్షన్ల గురించి అవగాహన కలిగించే ప్రత్యేక యంత్రాంగమే విస్తృతంగా లేదు.
అంటే... కవచం ఉంటుంది, ధరించలేదు.
కత్తి, డాలు ఉంటాయి. వాటిని ఉపయోగించలేరు. ఫలితంగా..
బాధిత మహిళలు న్యాయం పొందలేకపోతున్నారు.
ఫ‘లా’లను అందుకోలేకపోతున్నారు. అలాంటి వారికోసమే ఈ కౌన్సెలింగ్.
నేను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక బాబు పుట్టాడు. వాడికి ఏడాది అయినా గడిచిందో లేదో దురదృష్టవశాత్తూ మావారు ఓ యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పటినుంచి నేనూ, బాబూ అనాథలమైనాము. ఇప్పుడు బాబుకు మూడేళ్లు. మాది కులాంతర వివాహం కావడంతో నాకు పుట్టినింటి నుంచి ఏ అండా లేదు. అత్తింటి వారేమో మా కొడుకే పోయాక మీకూ మాకూ ఇక సంబంధం ఏమిటని నన్ను ఈసడించుకుంటున్నారు. వితంతువైన కోడలిని పోషించవలసిన బాధ్యత అత్తమామలకు లేదా? ఎందుకంటే నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం ఉద్యోగం చేసే వీలు లేదు. మా అత్తమామలు ధనవంతులు. ఏ బాధ్యతలూ లేనివారు. ఆస్తికోసం వారితో పోట్లాడటం నాకు ఇష్టం లేదు. మా ఇద్దరికీ నెలవారీ ఖర్చులకు సరిపడా మెయింటెనెన్స్ ఇస్తే చాలు. నాకు ఏదైనా ఆధారం దొరికాక అది కూడా అక్కరలేదు. నన్ను ఏం చేయమంటారు?
- ఒక సోదరి, హైదరాబాద్
మీ పరిస్థితి దయనీయం. మీ ఆత్మగౌరవం హర్షణీయం. వితంతువైన కోడలు అత్తమామల నుంచి మెయింటెనెన్స్ పొందవచ్చు. మీరే కాదు, మీ బాబు కూడా. మీరు ఆశ్రయించవలసిన చట్టం ది హిందూ అడాప్షన్ అండ్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ 1956. ఈ చట్ట ప్రకారం తనను తాను పోషించుకోలేని, పోషణకు ఏ ఆధారమూ, ఆస్తిపాస్తులూ, ఆదాయమూ లేని వితంతువైన కోడలు మామగారి నుంచి సెక్షన్ 19ను అనుసరించి మెయింటెనెన్స్‌ను పొందవచ్చు. మీరు వెంటనే కోర్టును ఆశ్రయించండి. మీ వారికి రావలసిన ఆస్తిని కూడా మీ మామగారు ఇవ్వలేదు. కనుక ఈ పిటిషన్ వేసిన తర్వాత ఆయనే స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చే అవకాశం కూడా ఉంది.
మా వివాహమై 6 సంవత్సరాలైంది. మావారు ఐటీ ఉద్యోగి. మాకు నాలుగేళ్ల పాప ఉంది. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం మాది. మా వారు నేనన్నా, పాపన్నా ప్రాణం పెడతారు. ఇటీవల కాలంలో వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. వారికి నైట్‌పార్టీలు ఎక్కువయ్యాయి. మొదట్లో లైట్‌గా డ్రింక్ చేసేవారు. కల్చర్ కదా అని సరిపెట్టుకున్నాను. రానురాను క్లబ్‌లకు, పబ్‌లకు వెళ్లడం ఎక్కువైంది. తాగుడు కాస్తా వ్యసనంగా మారింది. రాత్రిళ్లు రాగానే బెడ్‌రూంకు వెళ్లి బోల్ట్ వేసుకుంటున్నారు. మరుసటి రోజు మత్తులో జోగుతున్నారు. నేను కనిపెట్టిన విషయమేమిటంటే ఆయన డ్రగ్స్‌కి కూడా బానిసయ్యారని. దాంతో ఒక రోజున కోపం పట్టలేక నిలదీశాను. ఛడామడా తిట్టేశాను. విషయం ఎలాగూ తెలిసిపోయింది కదా అని ఆయన ప్రవర్తన మరింత భయానకంగా మారింది. తాను ఏమి చేస్తున్నానో తెలియని పరిస్థితిలో ఒకరోజు పాప గొంతు పిసకబోయారు. సమయానికి నేను చూడబట్టి సరిపోయింది కానీ... లేకుంటే ఏమయి ఉండేదో..? ఊహించడానికే భయంగా ఉంది. ఆయనను డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్‌కు కానీ, హాస్పిటల్‌కు గానీ తీసుకు వెళ్దామని ప్రయత్నించాను కానీ, వినడం లేదు. కోపంతో మండిపడుతున్నారు. నాకు ఆయనంటే చాలా ప్రేమ. ఆయనను బాగు చేసుకోవాలని ఉంది. దయచేసి కేసులు వేయమని సలహా ఇవ్వకండి. చికిత్స చేయించే మార్గం ఏమైనా ఉంటే సూచించండి.
- శృతి, విశాఖపట్నం
మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. భయపడకండి. అతనిని చికిత్సకు పంపే మార్గం ఉంది. కానీ కోర్టును ఆశ్రయించ వలసి ఉంటుంది. అంటే కేవలం ఒకటిరెండుసార్లు వెళ్తే సరిపోతుంది. మీరు మానసిక ఆరోగ్య చట్టం 1987ను అనుసరించి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, రిసెప్షన్ ఆర్డర్ పొందాలి. అంటే మత్తుపదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, అస్వస్థుడై మానసిక ప్రవర్తన మారిపోయిన వ్యక్తులను మానసిక రోగుల చికిత్సాలయంలో నిర్బంధించి, చికిత్స ఇవ్వమని ఇచ్చే ఆర్డర్. కనక బలవంతంగా చికిత్సకు పంపవలసిందిగా మీరు రిసెప్షన్ పొందండి. అప్పుడు పోలీసులు మీ వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ గారు రోగిన వైద్యపరీక్షకు పంపి, అతని మానసిక స్థితిని బట్టి అతని సంక్షేమాన్ని, మీ భద్రతను దృష్టిలో పెట్టుకుని మానసిక రోగుల చికిత్సాలయానికి గానీ వైద్యశాలకు గానీ తరలించమని ఆర్డర్స్ జారీ చేస్తారు. మీ వారు తప్పకుండా ఆరోగ్యవంతులవుతారు.