వాకాడు: బ్యాంకు పేరుతో మహిళలే మహిళలను ముంచారు. రుణాలిస్తామంటూ భారీగా డిపాజిట్లు వసూలు చేశారు. చివరకు బ్యాంకు బోర్డు తిప్పేసి నమ్మినోళ్లకు చేయిచ్చారు. మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు..కోటలోని శ్యాంసుందరపురానికి చెందిన ఇసనాక ప్రసూనమ్మ చైర్‌పర్సన్‌గా కంటేపల్లి ప్రమీల, హేమకుమారి సభ్యులుగా పదేళ్ల క్రితం మహిళా బ్యాంకు ఏర్పాటయింది. సుప్రయోగా మహిళా బ్యాంకు పేరుతో ప్రారంభించిన ఈ బ్యాంకు బ్రాంచ్‌లను కోట, విద్యానగర్‌లో ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం రూ.4 వేలు డిపాజిట్ కడితే పదిరెట్లు రుణం మంజూరు చేస్తామని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వీరి మాటలు నమ్మిన మహిళలు వేలం వెర్రిగా డిపాజిట్లు చెల్లించారు. ఇలా వాకాడు, ముస్లింకాలనీ, బజారువీధి, చర్చికాంపౌండ్, తూపిలిపాళెం, కోట, చిట్టమూరు తదితర గ్రామాలకు సుమారు 650 మంది రూ.4 వేలు వంతున చెల్లించి ఖాతాదారులుగా చేరారు. కొందరైతే రుణాలకోసం ఆశపడి నాలుగైదు పేర్లతో డిపాజిట్లు చెల్లించారు. రెండేళ్లు పూర్తి కావస్తున్నా రుణాలు మంజూరు కాకపోవడంతో మోసపోయామని గ్రహించారు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఒకటిన్నర సంవత్సరం క్రితం బ్యాంకు బోర్డు తిప్పేశారు. కొద్దికాలం కనిపించకుండా పోయిన బ్యాంకు నిర్వాహకురాలు ప్రసూనమ్మ ప్రస్తుతం కోటలో దర్జాగా తిరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము కట్టిన నగదు చెల్లించమని కోరినా ఫలితం కరువైందన్నారు. బ్యాంకు నిర్వాహకులపై కోట పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అక్షర జ్ఞానం లేని ప్రసూనమ్మ ప్రైవేట్ బ్యాంక్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించి భారీగా నగదు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
బ్యాంకు ముసుగులో బురిడీ
Published Mon, Sep 22 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement
Advertisement