వనపర్తి జిల్లా పెబ్బేరులో పశువుల సంత
కాటేసిన కరువు!
పాడి పశువులు ఉన్న ఇంట్లో కరువు కాటకాలకు చోటు ఉండదు’ అనేది సూక్తి. పెద్దవాళ్లు ఈ మంచిమాట చెప్పి పశువును కాపాడితే అది మనిషికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పేవాళ్లు. ఇంటి పోషణ బాధ్యత పంచుకుని యజమానికి సాయంగా నిలుస్తుందనేవాళ్లు. రైతుకి అసలైన బాంధవ్యం పశువుతోనే. ఆ సూక్తులకు కాలం చెల్లినట్లే ఉంది. పాడి ఆవు, గేదెను బతికించుకోవడానికి గుప్పెడు గడ్డిపరకలు కరువయ్యాయి. వర్షం కూడా జనం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నగరాలకే పరిమితమవుతున్నట్లే ఉంది. నడిరోడ్లను, భవనాలను చెరువులుగా మారుస్తూ ‘గతంలో ఇవి చెరువులే, చెరువులను ఆక్రమించి భవనాలు కట్టేసుకున్నార’ని గుర్తు చేస్తోంది.
ఎండి బీడువారిన నేల మీద నాలుగు చినుకులు చిలకరిస్తే పచ్చగా గడ్డి మొలుస్తుందని వానకు కూడా మనసు రాలేదు చాన్నాళ్లపాటు. దాంతో రైతులు తమ పశువులను సంత పాలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకుం టున్నారు. తనతోపాటు పొలంలో కష్టపడిన ఎడ్లు, ఇంటిని పాడితో కళకళలాడించిన ఆవులు, గేదెలు కళ్లెదుటే ఆకలితో నకనకలాడుతుంటే రైతులు చూడలేకపోతున్నారు. ఎవరైనా ఒక మోపు గడ్డి వేసి వాటి ప్రాణాలను కాపాడుకునే వాళ్లకు అమ్మి అవి క్షేమంగా ఉన్నాయని తృప్తి పడదామంటే అదీ కష్టంగానే ఉంది.
కబేళాలో కోసి మాంసాన్ని అమ్ముకునే వ్యాపారి తప్ప పశువును కొనడానికి ఎవరూ రావడం లేదు. వనపర్తి జిల్లా పెబ్బేరు సంతకెళ్తే గుండెను రంపంతో కోస్తున్నంత బాధ కళ్ల ముందు కనిపిస్తుంది. ఇన్ని రోజులు తనతోపాటు కష్టపడిన పశువును వదల్లేక రైతుల ముఖాల్లో ఎంతో దైన్యం. ఎంత కష్టమైనా నీ ఇంటి ముందు కొట్టంలోనే ఉంటానని చెప్పడానికి మాటలు రాక పశువులు మౌనంగా కన్నీళ్లు కారుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాలో పెబ్బేర్ సంతకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి ఎద్దులు, ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు సంతకు వచ్చిన పశువుల్లో అధిక శాతం కబేళాలకు తరలి వెళ్తున్నాయి. వాటిని మేపడానికి మేత లేదు, పశుగ్రాసం కొనడానికి రైతు దగ్గర డబ్బుల్లేవు. పశువులను కొనడానికి సంతకు వచ్చిన వారిలో వ్యాపారులు తప్ప రైతులు ఉండడం లేదు.
పశుగ్రాసం కొరతతో...
గడ్డి కొని పశువును కాపాడుకుందామంటే... ఒక్క ట్రాక్టర్ ఎండు వరి గడ్డి పదివేలకు పైగానే పలికింది. ఆ పైన రవాణా ఖర్చులు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు మేత కొనలేక పాడి పశువులను పోషించలేక సంతకు తరలించాల్సి వచ్చింది. వాన చుక్క జీవం పోస్తుంది. వాన పడక ప్రాణం తీస్తుంది.
– సాక్షి, వనపర్తి
నా వల్ల కాలేదు
నాకు నాలుగు ఆవులు, రెండు జతల ఎద్దులు ఉన్నాయి. వాటికి మేత లేక ఇబ్బంది పడుతున్నాను. గడ్డి ధర కొనే పరిస్థితి లేదు. ఏమి చేయాలో అర్థం కాక సంతకు తీసుకొచ్చా. వర్షాలు కురిసి పచ్చిక మొలిచే వరకు వాటి ప్రాణాలను కాపాడడం చాలా కష్టం. అవి కడుపు మాడ్చడం ఇష్టంలేక అమ్మేయాలని వచ్చాను.
– శ్రీనివాసులు, కాకురాల, గద్వాల
గడ్డికొనలేకనే...
నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. పత్తి, వేరుశనగ వేశాను. ఒక జత ఎద్దులు, మూడు ఆవులు ఉన్నాయి. వరి పంట వేయకపోవడంతో గడ్డికి తీవ్రకొరత ఏర్పడింది. గడ్డి, దాణా కొనాలంటే అప్పులు చేయాల్సి వస్తోంది.
– రామచంద్రయ్య, శేరుపల్లి, వనపర్తి