ఆటో ఇమ్యూన్ డిసీజెస్... కంచే మేనుమేసినట్టు... | Fencing menumesinattu autoimmune diseases ... ... | Sakshi
Sakshi News home page

ఆటో ఇమ్యూన్ డిసీజెస్... కంచే మేనుమేసినట్టు...

Published Mon, Sep 15 2014 11:06 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Fencing menumesinattu autoimmune diseases ... ...

మన శరీరం అనేక వ్యవస్థల సమ్మేళనంతో ఏర్పడ్డ అత్యద్భుతమైన నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణాన్ని కాపాడుకోవడానికి మనలో అంతర్గతంగా ఒక రక్షణ వ్యవస్థ కూడా ఉంది. దీన్నే ‘వ్యాధి నిరోధకత’ (ఇమ్యూనిటీ) అని మనం వ్యవహరిస్తుంటాం. శత్రుదుర్భేద్యమైన ఈ వ్యవస్థ కార్యకలాపాలు మన శరీరంలో జరిగేందుకు ఎన్నో రక్షణ కణాలు ఉంటాయి. బయటి నుంచి వచ్చే అనేక హానికారక క్రిములు, సూక్ష్మజీవులు, ఏకకణజీవులను తరమి వేసేందుకు ఈ కణాలన్నీ చాలా చురుగ్గా, కర్కశంగా పనిచేస్తుంటాయి. బయటి నుంచి ఏదైనా హానికారక క్రిమిగానీ, లేదా జీవిగానీ ప్రవేశించగానే ఈ రక్షణ కణాలన్నీ దాన్ని చుట్టుముడతాయి. దాని పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. అలా ఆ హానికారక శత్రుకణాలను నాశనం చేసేవరకు వాటి ముట్టడింపు కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఒక్కోసారి అది మన శరీరంలోని మన సొంత కణాలనే శత్రుకణాలుగా పరిగణించే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు మన స్వీయ రక్షణ వ్యవస్థే మన సొంత కణాల వినాశానికి పూనుకుంటుంది. ఇలా జరగడం వల్ల వచ్చే రుగ్మతలను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. స్వయం రక్షణ వ్యవస్థ తిరగబడటం వల్ల ప్రత్యేకంగా మన ‘నాడీ వ్యవస్థ’కు చేకూరే హానికరమైన అంశాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం.
ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే...
 
 మన శరీరంలోని అన్ని భాగాలతో పాటు ముఖ్యంగా మన రక్తంలో రక్షణ కణాలు ఉంటాయి. వీటిలో ‘టీ-లింఫోసైట్స్’ అనేవి ముఖ్యమైనవి. ఇలాంటి మరికొన్ని రక్షణ కణాలుంటాయి. ఈ కణసముదాయం అంతా శరీరాన్ని రక్షించే పనిలో ‘పోలీస్’ బాధ్యతలను నిర్వహిస్తుంటుంది. శరీరానికి హాని చేసే ఏదైనా కణం లోపలికి ప్రవేశించగానే దానికి వ్యతిరేకంగా పనిచేసే కణాలు పుడతాయి. ఇలా వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే వీటిని ‘యాంటీబాడీస్’గా వ్యవహరిస్తుంటారు. మనకు హాని చేయడానికి  బయట నుంచి వచ్చే క్రిములనూ, సూక్ష్మజీవులను సాధారణంగా మనం ‘ఫారిన్‌బాడీ’ అని అంటుంటాం.  ఏ హానికారకం (ఫారిన్‌బాడీ) మనలోకి ప్రవేశిస్తుందో.. సరిగ్గా దానికి వ్యతిరేకమైన ‘యాంటీబాడీస్’ మనలో పుడుతుంటాయి. అవి మనకు హానిచేసే వాటిని చుట్టుముట్టి, వాటిని తుదముట్టించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఒక్కోసారి ఈ యాంటీబాడీస్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాంటప్పుడు మన యాంటీబాడీసే మన శరీరంలోని ఏదో ఒక భాగాన్ని ఫారిన్‌బాడీగా భావిస్తాయి. మన యాంటీబాడీస్‌కు ఇలాంటి భావన రాగానే అవి... సొంత శరీర భాగాన్ని శత్రువుగా పరిగణించి దానిపై తమ ముట్టడిని ప్రారంభిస్తాయి. ఇలాంటి ప్రక్రియ శరీరంలోని ఏ భాగంలోనైనా జరగవచ్చు. ఉదా: నాడీవ్యవస్థ, కిడ్నీలు, కీళ్లు, లంగ్స్, చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థ, గుండె, గర్భాశయం... ఎక్కడైనా ఈ ప్రక్రియ చోటు చేసుకోవచ్చు. ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటోఇమ్యూన్ డిసీజెస్‌కు గురయ్యే అవకాశాలున్నాయి.
 
గులియన్‌బ్యారీ సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్)

సీఎమ్ వైరస్, కాంపైలో బాక్టర్ అనే సూక్ష్మాంగజీవులు శరీరంలోకి వెళ్లినప్పుడు జ్వరం, జలుబు మొదలైనవి వస్తాయి. ఆ తర్వాత 3-4 రోజులకు జ్వరం తగ్గుతుంది. కానీ జ్వరం తగ్గిన రెండు నుంచి మూడు వారాల తర్వాత జీబీ సిండ్రోమ్ లక్షణాలు మొదలవుతాయి. పైన పేర్కొన్న సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించగానే... వెంటనే రక్తంలో ఉండే యాంటీబాడీస్ ఆ సూక్ష్మజీవులపై దాడి ప్రారంభిస్తాయి. మన శరీరంలోని రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ట్టమైనదంటే... మనలోకి ప్రవేశించిన రోగకారక క్రిములు ఎంత బలంగా ఉంటే మన లింఫాటిక్ వ్యవస్థలోంచి రక్షణ కణాలూ అంతగానే యాంటీబాడీస్‌ను సృష్టిస్తాయి. ఈ యాంటీబాడీస్ అన్నీ బలగాల రూపంలో సమీకృతమై ఒక బెటాలియన్‌లాగా రంగంలోకి దిగుతాయి. సాధారణంగా ఆ యాంటీబాడీస్ అన్నీ బయటి జీవుల్ని పూర్తిగా నాశనం చేసి, బయటకు పంపే మార్గాన్నే చూస్తుయి. కానీ జబ్బు వచ్చాక వెలువడ్డ ఈ యాంటీబాడీస్‌లో కొద్దిపాటి జన్యుపరమైన మార్పుల వల్ల సూక్ష్మజీవులపై దాడి చేయడానికి బదులుగా మన ప్రతి నరంపై ఉండే తొడుగు వంటి పొరను బయటి సూక్ష్మజీవిగా పొరబడతాయి. దాంతో  మన నరాలపై ఉండే ‘మైలీన్’ తొడుగును నాశనం చేయడం ప్రారంభిస్తాయి. ఈ మైలీన్ తొడుగు ద్వారానే మెదడు నుంచి సదరు అవయవానికి వెళ్లాల్సిన ఆదేశాలు వెళ్తుంటాయి. ఈ తొడుగు నాశనం కావడం వల్ల మెదడు నుంచి ఆ భాగానికి అందాల్సిన ఆదేశాలు అందవు. దాంతో ఆ భాగం చచ్చుబడుతుంది.
 
లక్షణాలు: చిన్నపాటి జ్వరం తర్వాత 2-3 వారాల్లో లక్షణాలు కనబటడం మొదలవుతుంది. మొదట తొలిరోజున కాళ్లు-చేతులు తిమ్మిరెక్కడం ప్రారంభమవుతుంది. ఆ రెండోరోజున కాళ్లు, తొడ కండరాలు, పిక్క కండరాలు చచ్చుబడతాయి. దీనివల్ల కూర్చుని-లేవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, నడవలేకపోవడం, నిలబడలేకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. మూడోరోజున చేతులు చచ్చుపడిపోవడం జరగవచ్చు. కొందరిలో మూడు/నాలుగో రోజున ఛాతీకి సంబంధించిన కండరాలు కూడా చచ్చుబడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో వారిని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి కృత్రిమశ్వాస ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొందరికి ముఖానికి ఒకవైపు పక్షవాతం (ఫేసియల్ పెరాలసిస్) రావచ్చు. ఇంకొందరిలో మింగడానికి ఇబ్బంది కలగడం, మాట మారిపోవడం/మాటరాకపోవడం జరుగుతుంది.
 
నిర్ధారణ: కాలి, చేతి కండరాలు చచ్చుపడటం దీని ప్రధాన లక్షణం.  ఈ లక్షణాలను చూడగానే నర్వ్ కండక్షన్ స్టడీ అనే పరీక్షను నిర్వహించి జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. కొందరికి వెన్నెముక నుంచి నీరు (సీఎస్‌ఎఫ్) తీసి పరీక్ష చేస్తారు.
 
చికిత్స: ఆటో ఇమ్యూన్‌జబ్బుల్లో శరీరానికి హాని చేసే యాంటీబాడీస్‌ను రక్తం నుంచి తొలగించడం అనే పద్ధతినిగాని లేదా యాంటీబాడీస్‌ను దెబ్బతీసే ప్రక్రియను గాని అనుసరించాలి. మొదటిది ప్లాస్మాపెరిసిస్ అనే పద్ధతి. అంటే ఈ ప్రక్రియలో శరీరంలోని రక్తాన్నంతా వేరే మెషిన్‌లోకి పంపి, ఆ యాంటీబాడీస్‌ను వేరు చేసి శుద్ధి అయిన రకాన్ని శరీరంలోకి పంపుతారు. రెండో పద్ధతిలో ఇమ్యూనోగ్లోబ్యులిన్స్‌ను రక్తంలోకి పంపి యాంటీబాడీస్ ఉత్పత్తికి కారణమైన యాంటీజెన్స్‌ను (అంటే శరీరంలోకి ప్రవేశించే దొంగలాంటి పదార్థాలను) శక్తిహీనం (న్యూట్రలైజ్) చేస్తారు. దీనివల్ల మరిన్ని యాంటీబాడీస్ అభివృద్ధి కావడం నిలిచిపోతుంది. ఇలాంటి చికిత్సప్రక్రియ ఆటోఇమ్యూన్ జబ్బులు తీవ్రంగా ఉన్న సమయంలో ఉపయోగపడుతుంది.

 కోలుకునే సంభావ్యత: మొదటి రెండు వారాల లోపు ఈ చికిత్స ఇస్తే దాదాపు 90 శాతం మందికి పూర్తిగా బాగయ్యే అవకాశం ఉంటుంది.
 
మయస్థేనియా గ్రేవిస్

మన శరీరంలో ఉండే కండరాలు తొందగా అలసిపోవడం, కనురెప్పలు వాలిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, కూర్చుని లేవలేకపోవడం వంటి లక్షణాలతో ‘మయస్థేనియా గ్రేవిస్’ కనపడుతుంది. జబ్బు తీవ్రత మరీ ఎక్కువ అయితే శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, మింగలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.
 
ఎందుకు వస్తుంది: మన కండరాల్లో ఎన్నో కండర కణాలు ఉంటాయి. ఈ కండరాలు, నరాలతో అనుసంధానమయ్యే సూక్ష్మప్రాంతాన్ని ‘న్యూరో మస్క్యులార్ జంక్షన్’ అంటారు. ఇలాంటివి కొన్ని మిలియన్లు ఉంటాయి. కండరాల కదలికలు, అవి సక్రమంగా పనిచేయడమంతా ఈ జంక్షన్స్ ద్వారానే జరుగుతుంది. కండరాల కదలికలకు అవసరమైన ‘అసిటైల్ కొలీన్’ అనే పదార్థం నాడీకణం చివరి భాగం నుంచి ఉత్పత్తి అయి కండరకణ పొరల్లో ఉండే రిసెప్టార్స్‌లోకి వెళ్లి అక్కడ్నుంచి కండరాల్లోకి వెళ్లి, దాని కదలికలకు కారణమవుతుంది. అయితే కొన్నిసార్లు అసిటైల్ కొలీన్ యాంటీబాడీస్ ఉత్పన్నమై కండరపొర అయిన రిసెప్టార్‌కు అతుక్కుపోయి అసిటైల్ కొలీన్‌ను కండరంలోకి ప్రవేశించకుండా అడ్డుపడతాయి. దాంతో కండరాలు త్వరగా చచ్చుబడిపోవడం, పనిచేయకుండా ఉండటం జరుగుతుంది.
 
నిర్ధారణ: ఈ జబ్బును క్లినికల్ పరీక్షలోనే 90 శాతం వరకు నిర్ధారణ చేయవచ్చు. అయితే పూర్తి నిర్ధారణ కోసం నియోస్టిగ్‌మిన్ అనే ఇంజెక్షన్‌ను కండరంలోకి (ఇంట్రామస్క్యులర్) ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే చచ్చుబడినట్లు ఉన్న కండరం 20 నుంచి 30 నిమిషాల సేపు మునుపటిలాగానే శక్తిని పుంజుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ మామూలుగా చచ్చుబడిపోతుంది. ఇదేగాక... రక్తంలో ‘అసిటైల్ కోలిన్ యాంటీబాడీస్’ను కనుగొనడం ద్వారా కూడా ఈ జబ్బును నిర్ధారణ సాధ్యం.
 
చికిత్స: ఈ జబ్బుకు చాలా దశల్లో చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అవి...
1) ‘పైరిడోస్టిగ్మిన్’ అనే మందును 60 ఎంజీ టాబ్లెట్ల రూపంలో రోజుకు మూడుసార్లు ఇస్తారు.

2) కొందరికి ఛాతీలో ఉండే థైమస్ గ్రంథి పెద్దగా ఉంటే దాన్ని శస్త్రచికిత్స ద్వారా తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జబ్బు ఉన్న వారికి ఛాతీ సీటీ స్కాన్ తీయించి, థైమస్ గ్రంథిని చూడాల్సి ఉంటుంది.
 
3) కొందరికి ఈ జబ్బు చాలా తీవ్రంగా వస్తుంది. వీరికి వెంటనే చికిత్స ఇవ్వకపోతే అది ప్రాణహానికి దారితీయవచ్చు. దీన్నే ‘మయస్థేనియా క్రైసిస్’ అంటారు. ఈ కండిషన్‌లో శ్వాస తీసుకోలేకపోవడం, శరీరంలోని అన్ని కండరాలూ చచ్చుబడిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు రోగికి ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాలి. పైరిడోస్టిగ్మిన్ మందును ఇస్తూ, స్టెరాయిడ్స్, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లేదా ప్లాస్మా పెరిసిస్ ప్రక్రియలను అనుసరించాలి.
 
4) రోగి కోలుకున్న తర్వాత దీర్ఘకాలం పాటు పైరిడోస్టిగ్మిన్, ఇమ్యూనోసప్రెసెంట్స్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది.
 
మల్టిపుల్ స్క్లిరోసిస్

దీన్నే సంక్షిప్తరూపంలో ఎమ్‌ఎస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్‌జబ్బుల్లో చాలా సంక్లిష్టమైన రుగ్మత.
 
ఎవరికి వస్తుంది :
ఇది ఎవరికైనా రావచ్చు. అయితే 15 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్న మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.
 
ఎలా వస్తుంది: కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ (ముఖ్యంగా మంప్స్, మీజిల్స్ వంటివి) వచ్చి తగ్గాక నాడీ పదార్థానికి సంబంధించిన యాంటీబాడీస్ ఎక్కువగా  ఉత్పన్నమవుతాయి. ఇవి నాడీ వ్యవస్థలోని... మెదడు, చిన్నమెదడు, బ్రెయిన్‌స్టెమ్, ఆప్టిక్ నర్వ్, వెన్నుపాము... ఇలా ఏ భాగంపైనైనా దాడి చేస్తాయి. దాంతో ఆ భాగం దెబ్బతిని, మెదడులో ఆ భాగానికి (సెంటర్‌కు) సంబంధించిన కణాలు నిర్వీర్యమై -  శరీరంలో సదరు అవయవం చచ్చుపడుతుంది.
 
లక్షణాలు: కొందరికి ఒక వైపు చేయి, కాలు చచ్చుపడిపోతాయి. కొందరిలో ఒక వైపు కంటి చూపు కోల్పోవడం జరుగుతుంది. మరికొందరిలో నడక సమయంలో నియంత్రణ తప్పడం, మూతి, ముఖం వంకరపోవడం, మెల్లకన్ను, ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ విజన్) వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
నిర్ధారణ: లక్షణాలను బట్టి ఎమ్మారై (బ్రెయిన్) తీయాల్సి ఉంటుంది. ఇందులో తెల్లటి మచ్చలు (వైట్ ప్యాచెస్) కనిపిస్తాయి. దీంతో జబ్బును 99 శాతం నిర్ధారణ చేయవచ్చు. ఇక వీఐపీ అనే టెస్ట్ చేయడం ద్వారా కూడా నిర్ధారణ సాధ్యమవుతుంది. వెన్నులోంచి తీసిన నీటి (సీఎస్‌ఎఫ్)లో కనిపించే ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ కూడా ఈ జబ్బు నిర్ధారణకు తోడ్పడేవే.
 
బెల్స్ పాల్సీ

ఇది చాలా మందిలో కనిపించే సాధారణ  జబ్బే. క్రేనియల్ నర్వ్స్‌లో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది.
 
ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ (ముఖానికి సంబంధించిన నరాన్ని)ను దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి.
 
లక్షణాలు: మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం... ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
నిర్ధారణ: బెల్స్ పాల్సీ నిర్ధారణ కోసం మిథైల్ ప్రెడ్నిసలోన్ అనే మందును 500 ఎంజీ మోతాదులో రోజుకు రెండుసార్లు చొప్పున గాని లేదా 1 గ్రామును రోజుకు ఒకసారిగాని... మూడు రోజులు ఇవ్వాలి. ఆ తర్వాత 10వ రోజు నుంచి మెరుగుదల కనిపిస్తుంటుంది. పూర్తిగా కోలుకునేందుకు ఒక నెల రోజులు పట్టవచ్చు.
 
గతంలో ఆటోఇమ్యూన్ జబ్బులకు పెద్దగా చికిత్స ఉండేది కాదు. అయితే ఇటీవల ఇమ్యూనోగ్లోబ్యులిన్ వంటి మందులతో ఒకింత సమర్థమైన చికిత్సే అందుబాటులో ఉంది. కాబట్టి ఆటోఇమ్యూన్ జబ్బులకు అంతగా నిరాశపడాల్సిన అవసరం లేదు.
 
మరికొన్ని ఆటోఇమ్యూన్ జబ్బులు

పైన పేర్కొన్న ఆటో ఇమ్యూన్ జబ్బులేగాక... ఈ తరహాకు చెందినవే మరికొన్ని రుగ్మతలూ ఉన్నాయి. అవి...  ఇటన్‌లాంబర్ట్ సిండ్రోమ్  లింబిక్ ఎన్‌సెఫలోపతి / డిమెన్షియా  సెన్సరీ న్యూరోపతి  ఎమ్‌ఎన్‌డీ (మోటార్ న్యూరాన్ డిసీజ్)
 
ఆప్సోక్లోనస్ / మయోక్లోనస్  పాలిమయోసైటిస్ వంటివి.
 
ఇటన్‌లాంబర్ట్ సిండ్రోమ్‌లో కండరాలు చచ్చుపడిపోతాయి. ఈ లక్షణం ఉదయం ఎక్కువగా ఉండి, పనిచేసే కొద్దీ చచ్చుదనం తగ్గిపోతూ ఉంటుంది.
 
‘లింబిక్ ఎన్‌సెఫలోపతి’లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. ప్రవర్తన, నడవడికలో మార్పులు వస్తాయి.  

సెన్సరీ న్యూరోపతి వచ్చినప్పుడు నరాలలో కొన్ని పొరలు (ఫైబర్స్) దెబ్బతింటాయి. దీనవల్ల శరీరంలో కొంత మేర స్పర్శ తగ్గిపోతుంది. కానీ కదలికలు మాత్రం బాగానే ఉంటాయి.
 
ఎమ్‌ఎన్‌డీ... అంటే వెన్నుపాములో ఉండే యాంటీరియర్ హర్స్‌సెల్స్ దెబ్బతినడం వల్ల చేతికండరాలు చచ్చుపడటం, కాలికండరాలు గట్టిగా మారడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా కండరాలు బిగుసుకుపోవడాన్ని, కండరాలు కొట్టుకుంటూ ఉండటాన్ని చర్మం బయటి నుంచి చూడవచ్చు.
 
ఆప్సోక్లోనస్ / మయోక్లోనస్‌లో కనుగుడ్లు ఎప్పుడూ పక్కకుగాని, పైకి కిందికిగాని వేగంగా కదులుతూ ఉంటాయి. అంతేకాకుండా కాళ్లు చేతులు జర్క్‌లు ఇచ్చినట్లుగా కొట్టుకుంటూ ఉంటాయి.
 
అదనంగా పేర్కొన్న ఈ ఆటోఇమ్యూన్ జబ్బుల్లో ఇటన్ లాంబర్ట్ సిండ్రోమ్ మినహా మిగతావి కాస్తంత అరుదైనవి.
 
నాడీ వ్యవస్థకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు వస్తాయి?

మన నాడీ వ్యవస్థలో ముఖ్యమైనది మెదడు. ఇందులోంచి 12 జతల నరాలు (క్రేనియల్ నర్వ్స్) బయలుదేరుతాయి. ఇవిగాక వెన్నుపాము, దాని నుంచి వెలువడే పెరిఫెరల్ నర్వ్స్ కూడా ఉంటాయి. నాడీ వ్యవస్థకు అనుసంధానమైన కండరాలూ ఉంటాయి. ఏ కారణంగానైనా మన సొంత వ్యాధి నిరోధక ఆత్మరక్షణ వ్యవస్థ... పైన పేర్కొన్న మన సొంత భాగాలనే దెబ్బతీయడం వల్ల చాలా రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి.
 
నాడీ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన ఆటోఇమ్యూన్ డిసీజెస్...

నాడీ వ్యవస్థకు వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో చాలారకాలే ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ కిందివి చాలా సాధారణంగా/ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి...
 
గులియాన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్)  మయస్థేనియా గ్రేవిస్  

మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఎమ్.ఎస్.)  బెల్స్ పాల్సీ

ఆటోఇమ్యూన్ క్రేనియల్ మోనోన్యూరోపతీస్  

ఆటోఇమ్యూన్ ఎన్‌సెఫలోపతి  

స్టిఫ్‌మ్యాన్ సిండ్రోమ్

ఆటోఇమ్యూన్ ఎపిలెప్సీ  

ఆటోఇమ్యూన్ సెరిబెల్లార్ అటాక్సియా  

ఆటోఇమ్యూన్ డిమెన్షియా
 
ఆటోఇమ్యూన్ సెరిబ్రల్ వ్యాస్క్యులైటిస్.
 
స్టిఫ్‌మ్యాన్ సిండ్రోమ్

 
ఈ రుగ్మత ‘యాంటీ జీఏడీ యాంటీబాడీస్’ అనే కణాలను సృష్టించి వెన్నుపాములో ఉండే కొన్ని కణశ్రేణులపై దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. దాంతో లక్షణాలు నిదానంగా చాలా దీర్ఘకాలంలో బయటపడతాయి. ఈ లక్షణాలు బయటపడటానికి నెలలూ పట్టవచ్చు.
 
లక్షణాలు : నడిచేటప్పుడు కాళ్లు చేతులు నొప్పి పుట్టడం, కండరాలు గట్టిగా పట్టుకుపోవడం, నడవలేకపోతారు.
 
చికిత్స : దీనికి పైన పేర్కొన్న రుగ్మత అయిన ఆటోఇమ్యూన్ ఎన్‌సెఫలోపతితో పాటు స్టిఫ్‌మాన్ సిండ్రోమ్‌కు మిథైల్ ప్రెడ్నిసలోన్, ఇమ్యూనోగ్లోబ్యులిన్‌తో చికిత్స చేస్తే జబ్బులు క్రమంగా తగ్గుతాయి. ఆ తర్వాత ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే మందులు చాలా కాలం వాడాల్సి ఉంటుంది.
 
 ఆటో ఇమ్యూన్ ఎన్‌సెఫలోపతి  


 ఇది రెండు విధాలుగా వస్తుంది. అవి...
 1) హషిమోటోస్ ఎన్‌సెఫలోపతి
 2) పారానియోప్లాస్టిక్ ఎన్‌సెఫలోపతి
 ఈ రెండింటిలోనూ యాంటీబాడీస్ నాడీవ్యవస్థకు విరుద్ధంగా పనిచేసి, మెదడును దెబ్బతీస్తాయి. దాంతో ఫిట్స్ రావడం, నడకలో నియంత్రణ కోల్పోవడం, స్పృహతప్పడం వంటి పరిణామాలు సంభవిస్తాయి.
 
నిర్ధారణ :
ఎమ్మారై (బ్రెయిన్)లో తెల్ల మచ్చలు (వైట్‌ప్యాచెస్) కనిపించడం; వెన్నునుంచి తీసిన నీటి (సీఎస్‌ఎఫ్)లో ఈ యాంటీబాడీస్, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్‌లు ఉండటం ద్వారా ఆటోఇమ్యూన్ ఎన్‌సెఫలోపతిని నిర్ధారణ చేస్తారు.
 
ఆటో ఇమ్యూన్ సెరిబ్రల్ వాస్క్యులైటిస్ (ఏసీవీ)

ఇది కొన్ని సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్‌లో భాగంగా కనిపించే జబ్బు. అంటే జీవ వ్యవస్థలలో ఏ వ్యవస్థకైనా వచ్చే రుగ్మతతో పాటు వస్తుంది. అందులో ముఖ్యమైనది సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ). ఈ ఆటో ఇమ్యూన్ సెరిబ్రల్ వాస్క్యులైటిస్ అనే జబ్బులో మెదడులో ఉండే రక్తనాళాలకు వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీస్ వృద్ధిచెందుతాయి. ఫలితంగా ఆ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా మెదడులోని ఏ అవయవాన్ని నియంత్రించే సెంటర్‌కు రక్తసరఫరా అందదో మన శరీరంలో ఆ భాగం దెబ్బతింటుంది. ఇది పక్షవాతంలా బయటపడుతుంది. అంటే అకస్మాత్తుగా ఒకవైపు కాలు, చెయ్యి పడిపోవడం, మూతి వంకరపోవడం, మాట మారడం, చూపు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవేగాక... కొందరిలో తలనొప్పి, ఫిట్స్, ఒకేవస్తువు రెండుగా కనిపించడం, కాళ్లూచేతులు తిమ్మిరెక్కడం వంటి  లక్షణాలూ కనిపిస్తాయి.
 
చికిత్స: దీనికోసం కూడా మొదటి దశలో మిథైల్ ప్రెడ్నిసలోన్, ఆ తర్వాత ఇమ్యూనో మాడ్యులేటర్స్ వాడుతారు.ఈ మందులతో దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
 
 ఆటోఇమ్యూన్ క్రేనియల్ మోనోన్యూరోపతీ


 మన నాడీవ్యవస్థలో మెదడు నుంచి పుర్రె భాగం నుంచి 12 జతల నరాలు బయటకు వస్తాయనీ, వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారన్న సంగతి తెలిసిందే. ఈ నరాలలో ప్రతిదీ కుడి, ఎడమ... రెండువైపులా ఉండి తమదైన ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంటాయి. అవి...
 
మొదటి క్రేనియల్ నర్వ్... వాసన చూసేందుకు
రెండో క్రేనియల్ నర్వ్...    చూడటానికి
మూడు, నాలుగు, ఆరు నరాలు...కన్ను కదలికలకు
ఐదో క్రేనియల్ నర్వ్...    ముఖంపై స్పర్శజ్ఞానానికి
ఏడో క్రేనియల్ నర్వ్ ...    ముఖం కండరాల కదలికలకు
ఎనిమిదో క్రేనియల్ నర్వ్... చెవులతో వినికిడి జ్ఞానం కోసం
తొమ్మిది, పది నర్వ్స్...    గొంతు -మింగడం కోసం
పదకొండో నర్వ్...    మెడ స్పర్శకు
పన్నెండో క్రేనియల్ నర్వ్...నాలుక కదలికలకు... ఉపయోగపడతాయి.
 
సాధారణంగా ఒకరోజు లేదా రెండు రోజుల నుంచి కన్ను కదలిక సరిగా జరగకుండా ఉండటం, మనుషులు లేదా వస్తువులు రెండుగా కనిపిస్తూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వీళ్లలో 3, 4, 6 క్రేనియల్ నర్వ్స్‌లో ఏదో ఒకటి దెబ్బతిని ఉంటుంది.
     
కొందరికి అకస్మాత్తుగా ఒకవైపు చూపు తగ్గిపోతుంది. ఇది రెండో క్రేనియల్ నర్వ్ దెబ్బతినడం వల్ల జరిగే పరిణామం. దీన్నే ‘ఆప్టిక్ న్యూరైటిస్’ అంటారు.
     
ఇక కొందరిలో వాసన తెలియకపోవడం, కొందరికి రుచి తెలియకుండా పోవడం వంటివి జరగవచ్చు. అంటే వీళ్లలో రెండో లేదా ఐదో క్రేనియల్ నర్వ్ దెబ్బతిందన్నమాట.
 
కొందరికి మింగడం కష్టం కావచ్చు. నాలుక వంకరపోవచ్చు. ఈ రకమైన పరిణామాలు 9, 10, 12వ క్రేనియల్ నర్వ్స్ దెబ్బతినడం వల్ల జరుగుతాయి.
 
ఈ పన్నెండు క్రేనియల్ నర్వ్స్‌లో ఏది దెబ్బతిన్నా దాని వల్ల వాటికి సంబంధించిన సదరు లక్షణాలు కనిపిస్తున్నాయని నిర్ధారణ అయితే పైన పేర్కొన్న లక్షణాలన్నింటికీ ఒకే రకమైన చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. అదే... మిథైల్ ప్రెడ్నిసలోన్ 500 ఎంజీ మోతాదులో రోజుకు రెండుసార్ల చొప్పున మూడు రోజులు ఇచ్చి... ప్రెడ్నిసలోన్ అనే మాత్రలు 10 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో జబ్బు నిర్ధారణ జరిగాక మాత్రమే అనుసరించాల్సిన ప్రక్రియ. కాబట్టి రోగులు ఎవరికి వారు లక్షణాలు కనిపించగానే పైన పేర్కొన్న చికిత్స ప్రక్రియలు అనుసరించకూడదు.

- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement