
సావిత్రీబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్‌ల కుమారుడు బాబూ టెండూల్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జ్యోతిషులు అతని జాతక చక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం ఉండదని జ్యోతిషులు పెదవి విరిచారు. మరుసటి ఏడాది కష్టపడి చదవనవసరం లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడని కూడా చెప్పారు. బాబు దిగాలు పడ్డాడు. అప్పట్నుంచి చదవడం మానేసి నిర్లిప్తంగా గడపడం మొదలు పెట్టాడు. కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె తల్లి మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రీబాయి ఎన్నో విధాల బాబుకు నచ్చజెప్పచూసి విఫలమైంది. కష్టంలోనూ. సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వెళ్లింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పుకుని కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది.
‘జాతకాలు, జన్మకుండలి పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడవద్దు. నాపై విశ్వాసం ఉంచి బుద్ధిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను పరీక్ష ఉత్తీర్ణుడవుతాడు’ అని బాబా అభయం ఇచ్చారు.
సావిత్రీబాయి ఇంటికి తిరిగి వెళ్లి బాబా చెప్పిన మాటలు బాబుకి చెప్పింది. బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. పరీక్షలు బాగా రాశాడు. ఉత్తీర్ణత కూడా సాధించాడు. బాబాపై ఉంచిన విశ్వాసమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించలేనిది ఏమీ లేదు. ‘‘నిన్ను నువ్వు నమ్ముకో. నీలోని భగవంతుడిని నమ్ముకో’’ అనేది బాబా ఉపదేశం. భగవంతుడి కృపను పొందడానికి, సాయిపథంలో నడవడానికి విశ్వాసమే తొలిమెట్టు. గురువులు, ఇష్టదైవాల గురించి చదివి వదిలేయడం కాదు, వారు చెప్పిన దానిని ఆచరించాలి. అదే మనం వారిపై చూపే నిజమైన నమ్మకం.
– డా.కుమార్ అన్నవరపు
Comments
Please login to add a commentAdd a comment