ఎన్నికలు
ఎన్నికలంటే ఉపన్యాసాలు, వాదనలు, పందేలు, ప్రగల్భాలు... ఇవి కాకుండా సర్వేలు, జోస్యాలు కూడా ఉంటాయి. మన దేశంలో ఇవి షరా మామూలే అయినా అమెరికాలో కూడా ఉన్నాయంటే కాసింత ఆశ్చర్యమే. చరిత్రలో ఇంతకు మునుపు లేని విధంగా ఒక స్త్రీగా కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుంటే గ్రహాలన్నీ ఆమెను చల్లగా చూడనున్నాయని అక్కడి జ్యోతిష్యులు అంటున్నారు. అలాగని ట్రంప్ కోసం తారాతీరాన్ని చూస్తున్నవారు తక్కువగా లేరు. ఇంతకీ అక్కడ ఏం చెబుతున్నారు?
ఎన్నికల కాలంలో జ్యోతిషులకు గిరాకీ మన ‘సనాతన’ దేశంలోనే కాదు, అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఉంది. త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి జ్యోతిషులు రకరకాలుగా జోస్యాలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఇదివరకు ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. అయినా ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికన్ జ్యోతిషురాలు ‘లారీ రివర్స్’ గత ఏడాది జూన్‌లోనే జోస్యం చెప్పారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీకి దిగుతారని లారీ 2020 ఆగస్టులో చెప్పిన జోస్యం ఫలించడంతో ఈ ఎన్నికల్లో ఆమె జోస్యంపై జనాలు నమ్మకం పెంచుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం తథ్యమని మరో జ్యోతిషురాలు ‘అమీ ట్రిప్’ జోస్యం ప్రకటించారు. ‘స్టార్‌హీల్’ అనే యూజర్ పేరుతో ‘టిక్‌టాక్’లో నిత్యం జోస్యాలు చెప్పే అమీ ట్రిప్‌కు 7.40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో కొత్తగా ‘టిక్ టాక్’లోకి ప్రవేశించిన జ్యోతిషుడు జో థియోడర్ కూడా కమలా హ్యారిస్‌కు అనుకూలంగా జోస్యాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోస్యాలు చెబుతున్న వారిలో ఎక్కువ మంది కమలా హ్యారిస్‌కు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న పుట్టారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న పుట్టారు. వీరిద్దరూ నిండు పున్నమి తిథిలోనే పుట్టారు. అయితే ట్రంప్ పుట్టిన రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. ‘చాలామంది జ్యోతిషులు ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవాలని భావిస్తున్నారు. అందుకే ఆమెకు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు. అయితే, సంపూర్ణ చంద్రగ్రహణం రోజున పుట్టిన వారి శక్తిని తక్కువగా అంచనా వేయలేం. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’ అని బ్రిటన్‌కు చెందిన జ్యోతిషురాలు ఫ్రాన్సెస్కా ఆడీ చెబుతుండటం విశేషం.
మరోవైపు భారతీయ జ్యోతిష్యులలో ఒకడైన కార్తిక్ గోర్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న రాహువు కమలా హ్యారిస్‌కు మాత్రం వరాలు కురిపించనున్నాడని చెప్పారు. మరో జ్యోతిష్యుడు విజయేంద్ర ట్రంప్ జాతకం ప్రకారం ఆయన విషయంలో చంద్రుడు వేదనలో ఉన్నాడని అందువల్ల అతనికి ప్రతికూలత ఎదురుకానుందని అన్నారు.
అయితే చాట్‌జిపిటి ద్వారా కొందరు 16 శతాబ్దపు మహా జ్యోతిష్యుడైన నోస్ట్రాడామస్ ఇప్పుడు ఉంటే అతను అమెరికా ఎన్నికల విషయంలో ఏం జోస్యం చెబుతాడని ఏ.ఐ.ని అడిగితే అది అనూహ్యమైన జవాబు చెప్పింది. ‘కమలా హ్యారిస్‌గానీ ట్రంప్‌గానీ ఊహించే అంచనాకు చేరలేకపోవచ్చు’ అంది. ‘చివరి నిమిషంలో మలుపు తిరిగి రంగంలో లేని వారు పదవిని ఆశించవచ్చు’ కూడా అన్యాపదేశంగా సూచించింది. దాంతో ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ బరిలో ఉన్న టిమ్ వాల్జ్, జెడి వాన్స్ వైపు కొంతమంది చూస్తున్నారు. అలాగే ఏ.ఐ ఈ ఎలక్షన్ల తర్వాత అమెరికాలో అల్లర్లు రేగుతాయని, వీధులు మండుతాయని కూడా జోస్యం చెప్పింది.
గతంలో బైడన్ అధ్యక్షుడు అయ్యే ముందు అలాగే జరిగింది కదా.
ఏమైనా ఈ ఎన్నికలు అందరినీ ఉత్కంఠగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. గ్రహాలు ఇదంతా లైవ్‌లో చూస్తూ ఫలితాలను ఏమని టెలికాస్ట్ చేస్తాయో త్వరలో తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment