ఊపిరి సేవ | Fish Delivery Program | Sakshi
Sakshi News home page

ఊపిరి సేవ

Published Tue, Jun 6 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

ఊపిరి సేవ

ఊపిరి సేవ

నేను నా దైవం
దేవుడికి ఎన్నో సేవలు ఉంటాయి.
సుప్రభాత సేవ... తోమాల సేవ
ఆరగింపు సేవ... ఊంజల్‌ సేవ
ఏకాంత సేవ... పవళింపు సేవ.
మరి మనిషికి సేవ అవసరం అయితే?
ఊపిరి సలపలేనంత కష్టం వస్తే?
చెయ్యాల్సింది.. ఊపిరి సేవ.


రేపు బత్తినివారి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనుంది. ప్రసాద వితరణకు ప్రతిసారీ బత్తిని సోదరులలో ఒకరైన హరినాథ్‌గౌడ్‌  ముందుంటారు. ‘నేను, నా దైవం’ గురించి హరినాథ్‌ ఏమని చెబుతారు? చేప ప్రసాదమే దైవం అని చెబుతారేమో అనుకుంటూ ఈ విషయమై ఆయన్ని కలుసుకోవడానికి హైదరాబాద్, కవాడిగూడలోని వారి నివాసానికి వెళ్లాం. ఇంటి ముందు గోడకు ‘చేప’ బొమ్మ కనిపించింది. లోపలికి వెళ్లేసరికి హరినాథ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. చేతిలో చేప ఆకారంలో ఉన్న పెన్ను, మెడలో చేప బొమ్మ ఉన్న గొలుసు, ఇంట్లో షోకేసులో చేప బొమ్మలు... గమనిస్తూ ఉండిపోయాం. ఫోన్‌ తర్వాత సంభాషణ మొదలైంది.

‘చేప మందు’ పంపిణీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టున్నారు?
మందు కాదు, ‘ప్రసాదం’ అనండి. ఎందుకంటే మేం దీనిని దైవ ప్రసాదంగా భావిస్తాం.

ఔషధాన్ని ‘ప్రసాదం’ అంటున్నారంటే మీలో దైవభక్తి చాలా ఎక్కువ ఉన్నట్టుంది?
చాలా! ఇది ఇప్పటిది కాదు మా తాత ముత్తాతల నుంచి వస్తున్న భక్తి పరంపర.
     
ఎవరిని మీరు భక్తిగా పూజించేది?
మా ముత్తాత నుంచి మేమంతా శివుణ్ని ఆరాధిస్తుంటాం. మా తండ్రి అయితే, రోజూ మూడు– నాలుగు గంటల సేపు పూజ చేసేవాడు. మా ఇల్లు శివయ్య పాటలు, భజనలతో మార్మోగేది. ఆయన పూజ ముగించుకొని బయటకు వచ్చినప్పుడు ఆ కైలాసనాథుడు శివయ్యలాగే కనిపించేవాడు. దైవం అంటే నా చిన్నప్పటి సంఘటన ఒకటి ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఒక పార్సీ మహిళ ‘చేప ప్రసాదం’ కోసం మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. కాసేపటికి మా తండ్రి పూజ ముగించి బయటకు వచ్చాడు. ఆమె, మా తండ్రి పాదాలకు నమస్కరించబోయింది. మా తండ్రిగారు అడ్డుకుని ‘మహిళ ఎవరి పాదాలకూ నమస్కరించకూడదమ్మా!’ అన్నారు. ఆమె కళ్లనీళ్లతో ‘మీలో దైవశక్తికి నమస్కరిస్తున్నాను’ అంది.
 
బత్తిని సోదరులందరికీ ఈ దైవభక్తి ఉందా?
అందరూ శివారాధకులే! మేం ఐదుగురు అన్నదమ్ములం, నలుగురు అక్కచెల్లెళ్లు. మరో మూడేళ్లకు నాకు 80 ఏళ్లు నిండుతాయి. ఐదుగురు అన్నదమ్ముల్లో ఇప్పుడు నేను, మా అన్న ఇద్దరం మిగిలాం. అంతా హైదరాబాద్‌లోనే ఉన్నాం! మా పెద్దన్న కుటుంబం దూద్‌బౌలిలో, రెండో అన్న వనస్థలిపురంలో, మరో ఇద్దరు కూకట్‌పల్లిలో, నేను కవాడీగూడలో ఉంటున్నాం. అన్ని కుటుంబాల వాళ్లం యేటా మృగశిరకార్తె ముందురోజున జరిగే పూజలో కలుసుకుంటాం.

మృగశిరకార్తె ముందురోజునే ఎందుకు, ఏమిటా పూజ?
మా ఐదు కుటుంబాలలోని కొడుకులు, కోడళ్లలో ఎవరికి వీలైతే వాళ్లు రెండు– మూడు నెలల ముందుగానే హిమాలయాలు, రిషీకేష్‌... వంటి కొన్ని ప్రాంతాల నుంచి వనమూలికలను సేకరించి తెస్తారు. మా పూర్వికులు ఉన్న దూద్‌బౌలీలోని ఇంట్లో సత్యనారాయణవత్రం జరుపుకుంటాం. మా అమ్మ, నాన్నల సమాధుల వద్ద పూజలు చేస్తాం. మరుసటి రోజు ఉదయం మృగశిరకార్తె ప్రవేశించే సమయంలో ప్రసాదాన్ని సిద్ధం చేస్తాం. దేవుడి దగ్గర పెట్టి, కుటుంబ సభ్యులంతా ఆ ‘ప్రసాదం’ తీసుకొని అందరికీ పంచడానికి సిద్ధమైపోతాం.

దేవుని ప్రసాదం అంటున్నారు. చేపతో ఇవ్వడం ఏంటి? ఈ ‘ప్రసాదం’ తయారీ ఎవరు నేర్పారు?
హిమాలయాల నుంచి వచ్చిన ఒక ముని మా ముత్తాత వీరన్న గౌడ్‌కు పరిచయం అయ్యాడు. ఆరోగ్యం కోసం మందు ఇవ్వమన్నప్పుడు ఆ ముని వనమూలికలతో తయారుచేసిన ప్రసాదాన్ని ఇచ్చాడు. ఆ రోజు మృగశిర కార్తె. ఆ రోజే ఆ ప్రసాదాన్ని ఎలా తయారుచేసుకోవాలి, చేపతో ఎలా వేసుకోవాలో కూడా చెప్పాడు. ఆ ముని చెప్పినవిధంగా ఔషధాన్ని తయారుచేసి కుటుంబంలో అందరికీ, చుట్టుపక్కల వారికీ ఇచ్చాడు. అలా 172 సంవత్సరాల క్రితం మొదలైన ఈ సేవ ఇప్పటికీ కొనసాగుతుండటం ఆ దైవ నిర్ణయంగా భావిస్తాం.  

శైవులు అంటున్నారు. మత్స్యం విష్ణు అవతారం కదా!
శివకేశవులకు భేదం లేదు. దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. నా పేరులోనే ‘హరి’ ఉన్నాడుగా! మత్సా్యవతారంగా వచ్చినవాడు దేవుడే. ఊపిరిని పోస్తూ మత్స్య రూపంలో ఆ దేవుడే ఉబ్బసం సమస్యను తగ్గిస్తున్నాడు.

చేపతోనే ప్రసాదం. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి?
వారికి బెల్లంతో ‘ప్రసాదం’ వేస్తాం. ఇది కూడా ఆ ముని చెప్పినదే!   

ప్రసాదం ఇచ్చిన ముని మీ కుటుంబంలో ఎవరికైనా కలలోకి వస్తుంటారా?
నా కలలోకే వచ్చారు. ప్రజలకు ఊపిరి సమస్య రాకుండా ఈ ‘సేవ’ను ఇలాగే కొనసాగించమని, తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.

మీ దైవప్రసాదం మీద చాలా మందికి ‘అపనమ్మకం’ ఉంది?  
చాలా మందుల కంపెనీలు ఈ ఫార్ములా చెప్పమని అడిగాయి. మేం కాదన్నాం. ‘ఆ దేవుడి దయ వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. మాకు డబ్బులొద్దు’ అని చెప్పాం. దీంతో వాళ్లు ఈ ‘ప్రసాదం’ మీద చెడు ప్రచారం చేశారు. అయినా, మేం గట్టిగానే పోరాటం చేశాం.

ఈ పోరాటం కష్టం అనిపించలేదా? ఏమని దైవానికి మొరపెట్టకున్నారు?
దైవాన్ని తప్పు పడుతుంటే బాధతో కన్నీళ్లు వచ్చేవి. మేం చేస్తున్న దానికి ఎవరి నుంచి ఒక్క పైసా ఆశించలేదు. మా కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగలేదు. ప్రజలకు ఈ రూపంలో మేం చేసుకునే ‘సేవ’ఇది. దైవమిచ్చింది, దైవమే చూసుకుంటుంది అనుకున్నా.

మీరు చెప్పకపోతే మీ కుటుంబంలో ఎవరి ద్వారా అయినా ఈ ‘ఫార్ములా’ ఎవరైనా తీసుకోవచ్చు కదా?
ఇది దైవం మాకు ఇచ్చిన వరం. దీనిని వేరే ఇంటికి వెళ్లనివ్వం. కేవలం కొడుకులు, కోడళ్లకు మాత్రమే తెలుసు. ఆడపిల్లకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తాం. అందుకని వాళ్లకీ చెప్పం. అందరం అంత దీక్షగా ఉంటాం.

దైవ వరంగా వచ్చిన ఈ ‘ప్రసాదం’ ఉబ్బసం వ్యాధికేనా! మిగతా జబ్బులకు కూడానా?
ఎన్నో చిన్నపెద్దా జబ్బులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఆస్తమా సమస్యసు నివారిస్తుంది. అయితే, వరుసగా నాలుగైదేళ్లు ఈ ప్రసాదం తీసుకుంటూ పథ్యం పాటిస్తేనే! అసలు పథ్యమేమీ పాటించకపోయినా 20 శాతం సమస్య తగ్గిపోతుంది.
     
మీ భక్తి, ప్రసాదం గురించి చాలా చెప్పారు. అసలు దేవుడు ఉన్నాడంటారా?
దూద్‌బౌలిలో మా పూర్వికుల ఇల్లు బాగా పాతది, కూలిపోయింది. కానీ, ఆ ఇంట్లో పూజగది అలాగే ఉండిపోయింది. ఆ ఇంట్లో సన్నటి బావి ఉంది. ఆ బావిలో ఎంత కరువొచ్చినా ఇప్పటికీ నీళ్లు ఉంటాయి. ఈ రెండూ నాకు ఎప్పుడూ అద్భుతం అనిపిస్తాయి. దైవశక్తి అక్కడే ఉందని మా కుటుంబం అంతా నమ్ముతాం. ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో ఎన్నో చూశాను. దైవశక్తి ఈ లోకాన్ని పాలిస్తుంది. మా కుటుంబాన్ని మెచ్చి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించింది ఆ శక్తే.

ఎవరో ముని ఇచ్చిన ఫార్ములాతో మీరు పాప్యులర్‌ అయ్యారు కదా! మరి ఈ ప్రసాదం పంపిణీ జరిగే చోట ఆ ముని ఊహాచిత్రమైనా పెట్టరు ఎందుకు?
మా తల్లిదండ్రులను గురువులుగా భావించి వాళ్లు చెప్పిందే పాటిస్తున్నాం. అందుకే ఊహా చిత్రాలేవీ పెట్టడం లేదు.

శివభక్తులు కదా!  శైవక్షేత్రాలకు వెళుతుంటారా?
కాలు బాగున్నప్పడు కేదార్‌నాథ్, బదరీనాథ్‌ వంటి తీర్థయాత్రలన్నీ చేశాను.  

మీలో శక్తి తగ్గినప్పుడు రీఛార్జ్‌ కావడానికి ఏం చేస్తారు?
ఆ శివయ్యను తలుచుకుంటాను. కళ్లు మూసుకొని ఆయన రూపం దర్శించుకుంటాను. ఏదో శక్తి ఒంట్లో ప్రవహించినట్టుగా ఉంటుంది.

మీ ప్రసాదం దేవుణ్ణి నమ్మేవాళ్లకే పనిచేస్తుందా? నమ్మనివారికి పనిచేయదా?
ఎవరికైనా పనిచేస్తుంది.

ఈ ప్రసాదం కేవలం హిందువులకేనా?
కులం, మతం లేదు. ఈ ప్రసాదాన్ని అందరూ వేయించుకుంటారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి వచ్చేవారూ ఉన్నారు.

వైద్యులెవరైనా మీ ‘ప్రసాదం’ కోసం వచ్చారా?
ఢిల్లీలో డాక్టర్‌ ఆనంద్‌గారింటికి వెళ్ళినప్పుడు ఆయాసపడుతూ పడుకున్న వారి అమ్మగారిని చూశాను. ఊపిరి అందక చాలా బాధపడుతున్నారు. ప్రసాదం విషయం చెప్పి తీసుకురమ్మన్నాను. వాళ్లు వరుసగా మూడేళ్లపాటు వచ్చి ప్రసాదం తీసుకున్నారు. ఆరోగ్యం బాగైంది. ఇప్పటికీ వాళ్లు ఫోన్‌ చేస్తుంటారు.

మీరు కాలు ఎలా కోల్పోయారు? ఏదైనా ప్రమాదం జరిగిందా?
 మాకు వంశపారంపర్యంగా మధుమేహం ఉంది. నాకు 43 ఏళ్ల వయసులో  వచ్చింది. మొన్న పుష్కరాలకు వెళ్లినప్పుడు కాలి పగుళ్లలో ఇసుక చేరి, ఇన్ఫెక్షన్‌ వచ్చింది. నేను అది గమనించలేదు. ఇన్ఫెక్షన్‌ పెరగడంతో ముందు రెండుసార్లు ఆపరేషన్‌ చేసి కొంత తీసారు. అయినా ఇన్ఫెక్షన్‌ దగ్గలేదు. దీంతో కాలు తీసేయకతప్పలేదు.

మీరు మీ చిన్నప్పటి నుంచి ఈ ‘ప్రసాదాన్ని’ తీసుకుంటున్నారు. అయినా, చక్కెరవ్యాధి రాకుండా ఆగలేదు. పెద్దాసుపత్రులకే వెళ్లాల్సి వచ్చింది?
కొన్నింటిని అడ్డుకోవచ్చు. షుగర్‌ వ్యాధి వంటివాటిని అడ్డుకోలేం. పెద్ద ఆపరేషన్‌ కదా!

కాలు తీసేసే పరిస్థితిలో భయం వేయలేదా? ఏంటీ జీవితం భగవంతుడా అని దేవుణ్ణి ప్రార్థించారా?
ముందు భయపడ్డాను. ఒక్కకాలితో ఎలా? అనుకున్నాను. కానీ, తప్పదు. లేదంటే ఇన్ఫెక్షన్‌ పెరుగుతుంది. పిల్లలు ధైర్యం చెప్పారు. కృత్రిమ కాలు వాడచ్చు అన్నారు. దేవుడి మీదే భారం వేశాను. ఆపరేషన్‌ అయింది. కృత్రిమ కాలితో ఇప్పుడు బాగా నడుస్తున్నాను. రాపిడితో చిన్న పుండు అయ్యింది. అందుకే ‘ఈ కాలు’(కృత్రిమ)ను పక్కన పెట్టాను. తగ్గిపోతుంది. ఏం జరిగినా ప్రసాదం వితరణ మాత్రం ఆగదు.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement