తాను చెరువులో విసిరేసిన ఉంగరాన్నిచేప మింగిందని, ఆ చేపనే తన స్నేహితుడుతనకు కానుకగా ఇచ్చాడని, దాన్నే బిస్మిల్లాహ్ అని చదివి కూతురు కోసి ఉంటుందని, ఇదంతా బిస్మిల్లాహ్‌పఠించడం వల్లనే జరిగిందని తండ్రికి బోధపడింది.
ఏదైనా పని ప్రారంభించే ముందు ‘బిస్మిల్లాహ్’ అని పఠిస్తే మంచిదనే విషయాన్ని ఒక పండితుని దగ్గర నేర్చుకుందో అమ్మాయి. ఆ రోజు నుంచి ‘బిస్మిల్లాహ్ చదవందే ఏ పనీ మొదలెట్టేది కాదు. అయితే, అది ఆ అమ్మాయి తండ్రికి రుచించలేదు. తన కూతురి చేత ‘బిస్మిల్లాహ్’ అనడం, రాయడం మాన్పించాలని ఆ తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకరోజు అత్యంత ఖరీదైన ఒక ఉంగరాన్ని కూతురికిచ్చి దాన్ని భద్రంగా దాచి ఉంచమని చెప్పాడు. అమ్మాయి ‘బిస్మిల్లాహ్’ చదివి ఉంగరాన్ని తన జేబులో వేసుకుంది. రాత్రి అమ్మాయి నిద్రలోకి జారుకున్నాక ఆమె నుంచి ఉంగరాన్ని దొంగిలించి, దానిని ఒక చెరువులో విసిరేసి ఇంటికి వచ్చాడు. ఏమీ ఎరగనట్టుగా ఉంగరం ఏది? అని అడిగాడు. తాను దాచిన తావులో చూస్తే ఉంగరం కనిపించలేదు అమ్మాయికి. ‘సాయంత్రంలోగా తన ఉంగరాన్ని తనకు అప్పజెప్పకపోతే నా చేతిలో నీ చావు ఖాయం’ అని హెచ్చరికలు చేశాడు.
తండ్రి బెదిరింపులకు కించిత్తు కూడా ఆందోళన చెందకుండా రోజంతా బిస్మిల్లాహ్ పఠించడంలోనే లీనమైపోయింది ఆ అమ్మాయి. ఇంతలో ఒక స్నేహితుడు ఒక చేపను ఆ అమ్మాయి తండ్రికి కానుకగా అందించాడు. ఆ చేపను పులుసు చేయమని పురమాయించాడు తండ్రి. బిస్మిల్లాహ్ చదివి చేపను కత్తితో కోయగా చేప కడుపులోంచి ఉంగరం బయటపడింది. ఆనందంగా ఆ ఉంగరాన్ని తీసి శుభ్రం చేసి, దాచి పెట్టింది. తండ్రి రాగానే ఆయన చేతికి అందించింది. అది చూసి తండ్రి విస్తుపోయాడు. తాను చెరువులో విసిరేసిన ఉంగరాన్ని చేప మింగిందని, ఆ చేపనే తన స్నేహితుడు తనకు కానుకగా ఇచ్చాడని, దాన్నే బిస్మిల్లాహ్ అని చదివి కూతురు కోసి ఉంటుందని, ఇదంతా బిస్మిల్లాహ్ పఠించడం వల్లనే జరిగిందని తండ్రికి బోధపడింది. కూతుర్ని మార్చే ఆలోచనను విరమించుకుని తానూ బిస్మిల్లాహ్ పఠించడం మొదలెట్టాడు. దైవవిశ్వాసులకు ఎప్పుడూ మేలే కలుగుతుంది.
– జుబేదాబేగం
Comments
Please login to add a commentAdd a comment