
ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నట్లయితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. విటమిన్ బి–కాంప్లెక్స్‌లో ఒకటైన విటమిన్–బి9 (ఫోలిక్ యాసిడ్) సప్లిమెంట్లను వైద్యులు సాధారణంగా గర్భిణులకు సూచిస్తుంటారు. అయితే మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఫోలిక్ యాసిడ్‌ను తీసుకుంటున్నట్లయితే, గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు దాదాపు 75 శాతం మేరకు తగ్గుతాయని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ నిపుణుల పరిశోధనలో తేలింది. ఈ నిపుణులు బీపీతో బాధపడుతున్న పదివేల మందికి పైగా పురుషులు, మహిళలకు ఏడాది కాలం బీపీ మాత్రలతో పాటు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను కూడా ఇచ్చారు.
వీరిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే పక్షవాతం బారినపడ్డారు. కేవలం బీపీ మాత్రలను మాత్రమే తీసుకున్న వారిలో మాత్రం ఆరు శాతం మంది పక్షవాతానికి గురయ్యారు. ఈ పరిశోధన వివరాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. విటమిన్–డి, విటమిన్–సి, క్యాల్షియమ్ సప్లిమెంట్లతో పోలిస్తే, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ల ద్వారానే గుండె జబ్బులను, పక్షవాతం ముప్పును గణనీయంగా నివారించవచ్చని వారు తెలిపారు.