
పాదాలనొప్పి... నివారణ... చికిత్స
వయసు పెరుగుతున్నకొద్దీ పాదాల్లో నొప్పి రావడం చాలామందిలో కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం...
మడమ కింది భాగం నుంచి మొదలై కాళ్ల వేళ్ల వద్ద ఉండే ఎముకల వరకు... అంటే పాదమంతా విస్తరించి ఉండే భాగాన్ని ప్లాంటార్ ఫేషియా అంటారు. అది ఎముకనూ, కండరాలనూ కలిపే ధాతువు వంటిది. దీనికి సాగే గుణం ఎక్కువ. ఇది పొట్టిగా ఉంటే పాదం వద్ద వంపు పెద్దగా ఉంటుంది. పొడవుగా ఉంటే పాదం వద్ద వంపు తక్కువగా ఉంటుంది. మరీ పొడుగ్గా ఉంటే పాదం అంతా సమతలంగా కిందికి ఆనినట్లుగా ఉంటుంది. ప్లాంటార్ ఫేషియా కింద కొవ్వుపదార్థం ఉండటం వల్ల నడుస్తున్నప్పుడు దానిపై పడే ఒత్తిడి నుంచి ఈ కొవ్వు నిండిన భాగం కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ఫేషియాకు ఏదైనా గాయం తగిలితే పాదం నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పులు సాధారణం గా ఉదయం వేళల్లో ఎక్కువగా ఉంటాయి. కూర్చుని అకస్మాత్తుగా లేచినప్పుడు పాదాల్లో నొప్పి రావచ్చు. కొందరిలో సూదులతో గుచ్చినట్లుగా కూడా నొప్పి కలగవచ్చు.
పాదాల నొప్పుల నివారణకు: పాదాల్లో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పాదంపై పడే భారాన్ని గణనీయంగా తగ్గించి, పాదానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇందుకోసం ఎక్కువగా నడవడం, పరుగెత్తడం తగ్గించాలి. పాదం మధ్యలో వంపు తిరిగి ఉన్న భాగానికి సపోర్ట్ ఇచ్చేలా ఉండే పాదరక్షలను ఎంచుకోవాలి. ఒకవేళ ఫ్లాట్ పాదరక్షలు వాడేవారికి పాదాల్లో నొప్పి వస్తుంటే... ఆర్చ్‌లా వంపు తిరిగి ఉన్న భాగానికి సపోర్ట్ ఇచ్చేలా అక్కడ స్పాంజి వంటి మెత్తటి పదార్థాన్ని పాదరక్షలోని ఆ ప్రదేశంలో అమర్చుకోవడం మంచిది. దీనివల్ల వంపు భాగంలో ఒత్తిడి తగ్గుతుంది.
ఈ వ్యాయామాలతో పాదం నొప్పి నుంచి ఉపశమనం...
ఫేషియాను సాగేలా చేసే వ్యాయామం: గోడ ఎదురుగా నిలబడి, మీ చేతుల్ని గోడపై ఆన్చాలి. నొప్పిగా ఉన్న కాలిని వెనక్కు పెట్టి పాదాలను ఫ్లాట్‌గా భూమికి ఆన్చి ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచాలి. ఈ సమయంలో పాదాలను లేపకూడదు. దీన్ని ఆరు నుంచి ఎనిమిది సార్లు రిపీట్ చేయాలి. ఇలా చేస్తే ఫేషియా సాగి నొప్పి తగ్గే అవకాశాలు ఎక్కువ.
పిక్క సాగేలా చేసే వ్యాయామం: గోడ ఎదురుగా నిలబడి చేతులను గోడపై ఆన్చాలి. నొప్పిగా ఉన్న కాలిని నిలకడగా ఉంచి మరోకాలిని మోకాళ్ల వద్ద ముందుకి వంచాలి. ఈ సమయంలో పాదాలు నేలను తాకి ఉండేలా చేయాలి. దీన్ని ఆరు నుంచి ఎనిమిది సార్లు రిపీట్ చేయాలి.
కాలి కండరాలను బలపరచుకోవడం కోసం: ఇందుకోసం కాలి మునివేళ్లపై నిలబడి పైన ఉండే వస్తువును అందుకోవడానికి ప్రయత్నించినట్లుగా సాగాలి.
కాలివేళ్లను దృఢంగా చేసుకోవడం కోసం: కింద పడి ఉన్న వస్తువును కాలివేళ్లతో అందుకోవాలి. ఈ నాలుగు రకాల వ్యాయామాలు చేస్తుండటం వల్ల పాదాలనొప్పులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
చికిత్స: పాదాల నొప్పుల తీరుతెన్నులను, వ్యక్తి లక్షణాలను బట్టి మంచి హోమియో వైద్యుని ఆధ్వర్యంలో ఆర్సెనికమ్, లెడమ్‌పాల్, పెట్రోలియమ్, జింకమ్, ఆసిడ్ బెంజ్, రొడోడెండ్రాన్, కాస్టికమ్ మొదలైన మందులను వాడితే మంచి ఫలితం ఉంటుంది.