ఇదో పే.......ద్ద F1 ‘ఫార్ములా’ | Formula 1 AOR Duties Go to Exopoli | Sakshi
Sakshi News home page

ఇదో పే.......ద్ద F1 ‘ఫార్ములా’

Published Fri, Jun 6 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

Formula 1 AOR Duties Go to Exopoli

  • రేసు కార్ల రూటే సెపరేట్   
  •  యుద్ధాన్ని తలపించేలా పోటీలు
  •  ట్రాక్ నుంచి కారు వరకు అన్నింటిలోనూ ప్రత్యేకమే   
  •  నిర్వాహకులకు కాసుల పంట
  • నిగనిగలాడే ఓ నల్లటి ట్రాక్... మధ్య మధ్యలో ఊహించని మలుపులు... వాయు వేగంతో దూసుకుపోయే రేసు గుర్రాల్లాంటి కార్లు... రయ్య్‌మని మోత పెట్టే ఇంజిన్లు... అకస్మాత్తుగా తగ్గిపోయే వేగం...క్షణంలోనే మళ్లీ రాకెట్ వేగం... అనుక్షణం ఉత్కంఠ.. రెప్పపాటులో తారుమారయ్యే ఫలితాలు... రెండొందల దేశాల్లోని ప్రేక్షకుల ఆదరణ... వేల కోట్ల రూపాయల పెట్టుబడి... అంతకుమించిన ఆదాయం... ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకత చాటుకుంటున్న ఒకే ఒక్క క్రీడాంశం ‘ఫార్ములావన్’. ఒళ్లు గగుర్పొడ్చే వేగంతో డ్రైవర్లు చేసే సాహస కృత్యాలు, విన్యాసాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. అలాంటి ఎఫ్-1 నియమ నిబంధనలు, జట్లు, డ్రైవర్లు, రేసు, ట్రాక్‌ల విశేషాల గురించి తెలుసుకుందాం!      
     - చిలుక హరిప్రసాద్
     
    1906 నుంచే మొదలు

    మొదటి గ్రాండ్ ప్రి రేసును 1906లో నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక 1946లో అన్ని కార్లు తప్పక పాల్గొనాలనే కొత్త నిబంధనను ఆమోదిస్తూ ‘ఫార్ములావన్’ అనే పేరును ఖరారు చేశారు.  దీంతో అదే ఏడాది నాన్-చాంపియన్‌షిప్ రేసులను ఏర్పాటు చేశారు. 1950లో అధికారికంగా తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సిల్వర్‌స్టోన్‌లో నిర్వహించారు. 1951లో జువాన్ మాన్యూల్ ఫాంగియో తన అల్ఫా రోమియో-159ను అత్యంత వేగంగా నడిపి వరల్డ్ టైటిల్‌ను అందుకున్నాడు. కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ మాత్రం 1958 నుంచి ప్రారంభమైంది. దీంతో అప్పటికే జరుగుతున్న మోటార్ రేసింగ్‌కు ఫార్ములావన్ చాలెంజ్ విసిరింది. యూకే, దక్షిణాఫ్రికాలో 1960, 70లతో జాతీయ చాంపియన్‌షిప్‌లను కూడా ఏర్పాటు చేసేవారు. చాలా ఏళ్లు నాన్ చాంపియన్‌షిప్ రేసులు జరిగినా ఆర్థిక భారం పెరిగిపోవడంతో 1983లో వీటికి ముగింపు పలికారు. 20వ శతాబ్దంలో ఈ రేసులు ప్రజాదరణ పొందడంతో పాటు బలమైన స్పాన్సర్లు ఆర్థికంగా చేయూత నిచ్చారు. 1950లో కేవలం 7 గ్రాండ్‌ప్రిలతో మొదలైన ఎఫ్-1 నేడు ప్రపంచవ్యాప్తంగా 19 రేసులతో అలరారుతోంది. వరల్డ్ చాంపియన్ రేసులో నిలవాలంటే కనీసం 8 పోటీల్లోనైనా పాల్గొనాలి. గ్రాండ్ ప్రిలకు సంబంధించి అత్యంత అధునాతనంగా నిర్మించిన ప్రత్యేక సర్క్యూట్‌లు ఉంటాయి.
     
    రెండు చాంపియన్‌షిప్‌లు  

    సీజన్ చివర్లో జరిగే రేసు అనంతరం ఆధిక్యంలో ఉన్న డ్రైవర్ ఎఫ్-1 విజేతగా నిలుస్తాడు. ఇందులో  డ్రైవర్స్, కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లు ఉంటాయి. కారు ‘చాసిస్’ తయారు చేసే కంపెనీకి కన్‌స్ట్రక్టర్ లభిస్తుంది. ప్రతి రేసులో డ్రైవర్లకు పాయింట్లు కేటాయిస్తారు. తొలి 10 స్థానాల్లో నిలిచిన వారికి పాయింట్లను విభజిస్తారు. అగ్రస్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 25, తర్వాతి స్థానాల్లో వారికి వరుసగా 18, 15, 12, 10, 8, 6, 4, 2, 1 పాయింట్లు ఇస్తారు. ప్రతి కారుకు నంబర్ ఉంటుంది. గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన డ్రైవర్‌కు ‘నంబర్‌వన్’, అతని సహచరుడికి రెండో నంబర్‌ను ఇస్తారు. మిగిలిన ప్రతి జట్టుకు గత సీజన్‌లో కన్‌స్ట్రక్టర్ చాంపియన్‌షిప్‌లో నిలిచిన స్థానాలను బట్టి నంబర్లను జారీ చేస్తారు.
     
    {పధాన రేసు ఆరంభం ఇలా....

    ఆదివారం జరిగే ప్రధాన రేసుకు నాలుగున్నర గంటల ముందు వార్మప్ ఉంటుంది. రేసు ప్రారంభమయ్యే అరగంట ముందు అన్ని కార్లు పిట్‌లైన్‌ను దాటుతాయి. ఈ సమయంలో వేగం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ గ్రిడ్‌కు వచ్చిన తర్వాత ఇంజిన్‌ను ఆపేయాలి. పోటీ 15 నిమిషాలు ఉందనగా పిట్‌లైన్‌ను మూసివేస్తారు. 15 సెకన్ల ముందు అన్ని కార్లు గ్రిడ్‌ను వదిలి వెళ్లాలి. గ్రీన్ లైట్ వెలగగానే ఫార్మేషన్ ల్యాప్ మొదలవుతుంది. అది ముగిశాక తిరిగి గ్రిడ్ వద్దకు వచ్చి ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచుతారు. అన్ని కార్లు తమ ఆరంభ స్థానాల్లోకి వచ్చిన తర్వాత.. ముందుగా ఏర్పరిచిన పద్ధతిలో రేసు దానంతట అదే ప్రారంభమవుతుంది. ఐదు ఎర్ర లైట్లు ఒక దాని తర్వాత ఒకటి (సెకన్ వ్యవధి అంతరం) వెలుగుతాయి. తర్వాత ఒకేసారి ఈ లైట్లన్నీ వెలుగుతాయి. ఇదే రేసు ఆరంభానికి సూచిక.
     
    నలుగురు డ్రైవర్లు

    ప్రతి గ్రాండ్ ప్రిలో రెండు కార్లను పోటీకి దించాలి. కాబట్టి ఇందుకోసం ప్రతి జట్టు నలుగురు డ్రైవర్లను సిద్ధంగా ఉంచుకుంటుంది. ప్రాక్టీస్ కోసం అదనంగా మరో ఇద్దర్ని ఉపయోగిస్తారు. వీరందరికీ ‘సూపర్ లెసైన్స్’ ఉండాలి. గ్రాండ్ ప్రిలో బరిలోకి దిగాలంటే ఇది తప్పనిసరి. జూనియర్ మోటార్ స్పోర్ట్స్ విభాగంలో నైపుణ్యం, ఫార్ములావన్ కారును 300 కిలోమీటర్లు నడిపిన అనుభవంతో పాటు ఎఫ్-1 జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందం, డ్రైవర్ గత చరిత్రను పరిగణనలోకి తీసుకుని వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఈ లెసైన్స్ జారీ చేస్తుంది. ఒక గ్రాండ్ ప్రి టోర్నీకి ప్రతి డ్రైవర్ సగటున 2 కిలోల బరువు తగ్గుతాడు. వేడి అధికంగా ఉంటే 1.2 లీటర్ల ఫ్లూయిడ్స్‌ను కోల్పోతాడు. 2010 నిబంధనల ప్రకారం ప్రతి జట్టు రెండు కార్లను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్క సీజన్‌లో డ్రైవర్ ఎనిమిది ఇంజిన్ల కంటే ఎక్కువగా నడిపి ఉండరాదు. ఒకవేళ ఎక్కువ ఉపయోగిస్తే పది గ్రిడ్‌ల పెనాల్టీ విధిస్తారు. వరుసగా ఐదు ఈవెంట్లకు ఒకే ఒక్క గేర్‌బాక్స్‌ను ఉపయోగించాలి. గేర్‌బాక్స్ మార్చాల్సి వస్తే డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ఐదు స్థానాల పెనాల్టీ వేస్తారు.
     
    ఎకెల్ శకం...

    1970లో బెర్నీ ఎకెల్‌స్టోన్ రాకతో ఎఫ్-1 కొత్త పుంతలు తొక్కింది. పక్క వ్యాపార ప్రణాళికలతో వేల కోట్ల రూపాయలను టర్నోవర్ చేస్తూ అత్యంత ఖరీదైన క్రీడగా మలిచాడు. దీని కోసం వినూత్నమైన పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. 1971లో ‘బ్రాబమ్’ జట్టును ఎఫ్-లోకి తేవడం ద్వారా కన్‌స్ట్రక్టర్ అసోసియేషన్‌లో స్థానం లభించింది. తర్వాత 1978లో ఎఫ్‌ఐఏ అధ్యక్షుడయ్యాడు. అప్పటిదాకా జట్ల, ఆటగాళ్ల ఆదాయ వ్యవహారాలను సర్క్యూట్ యజమానులే చూసుకునేవారు. దీనికి సంబంధించి ఓ సమగ్రత తేవాలన్న ఉద్దేశంతో ‘ఫార్ములావన్ టూ సర్క్యూట్ ఓనర్స్ ప్యాకేజీ (ఎఫ్‌ఓసీఏ)’ పద్ధతిని ఎకెల్‌స్టోన్ ప్రతిపాదించారు. ఏ జట్టును తీసుకోవాలన్నా.. వదులుకోవాలన్నా ప్యాకేజీ రూపంలో చెల్లించాలి. దీని ప్రకారం అడ్వర్‌టైజింగ్, స్పాన్సర్‌షిప్, రేసు నిర్వహణ, ట్రాక్‌ల నిర్మాణం, లెసైన్స్‌ల జారీ, డ్రైవర్ల కాంట్రాక్టులు, సాంకేతిక నిబంధనలు ఇలా అన్ని వ్యవహారాలతో కూడిన ప్యాకేజీ ఉంటుంది. దీంతో రేసు వ్యాపారం కళకళలాడుతోంది.
     
    చెకర్డ్ ఫ్ల్లాగ్ ఊపితే

    అడ్డు, నిలువు గీతలతో కూడిన చెకర్డ్ ఫ్లాగ్‌ను ఊపడం రేసు ముగింపుకు సంకేతంగా భావిస్తారు. రెడ్ ఫ్లాగ్‌ను వాడితే రేసు నిలిపి వేయాలని అర్థం. ఎల్లో ఫ్లాగ్ ప్రమాదాన్ని తెలుపుతుంది. ఒకసారి మాత్రమే ఎల్లో ఫ్లాగ్ ఊపితే కారు వేగం తగ్గించమని అర్థం. రెండుసార్లయితే వేగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అవసరమైతే ఇంజిన్ ఆపి వేయడానికి సిద్ధంగా ఉండమని సూచన. గ్రీన్ కలర్ జెండా చూపితే ప్రమాదం తొలగిపోయిందని, నలుపు రంగు జెండాను ఏ నంబర్‌కు చూపితే ఆ కారు డ్రైవర్ వెంటనే పిట్ స్థానానికి రావాలని హెచ్చరించడం జరుగుతుంది. ఒక్కొసారి పోటీదారుడిని రేసు నుంచి తప్పించడానికీ ఉపయోగిస్తారు.
     
    స్టీవార్డులదే పెత్తనం

     పోటీల నిర్వహణకు ఎఫ్.ఐ.ఏ ఓ సాంకేతిక ప్రతినిధిని నియమిస్తుంది. ఇతను ఓ పోలీసులాగా పని చేస్తారు. ప్రాక్టీస్ సెషన్‌కు ముందు రోజు రేసులో పాల్గొనే కార్లు సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేవో పరీక్షించడం ఇతని పని. ఇందుకోసం అత్యంత అధునాతనమైన ఎలక్ట్రానిక్స్ ల్యాబోరేటరీ, సాంకేతిక పరికరాలు, నిపుణులతో జట్టు ఉంటుంది. ఇంజిన్, ఏరో డైనమిక్స్, టైర్లు, సస్పెన్షన్, ఇంధనం ఇలా ప్రతి విభాగాన్ని పరిశీలిస్తారు. స్పాట్ చెకింగ్స్ వీటికి అదనం. క్రికెట్ మాదిరిగానే ఎఫ్-1లో ముగ్గురు అంపైర్లు ఉంటారు. వీరిని ‘స్టీవార్డ్సు’ అంటారు. డ్రైవర్ చేసే తప్పిదాన్ని బట్టి స్టీవార్డు కారుకు ‘స్టాప్ అండ్ గో’ శిక్ష విధిస్తారు. దీని ప్రకారం డ్రైవర్ తన పిట్‌స్టాప్ వద్ద 10 సెకన్ల పాటు కారును నిలపాలి. ఈ సమయంలో ఇంధనం నింపుకోవడం, టైర్లను మార్చడం చేయరాదు.  
     
     గుండెకాయ ‘చాసిస్’

     ఫార్ములావన్ కారుకు ‘చాసిస్’ గుండెకాయలాంటిది.. చిన్నచిన్న విడి భాగాలను వేల బోల్ట్‌ల ద్వారా బిగిస్తారు. దీన్నంతటిని ‘మోనోకాక్ (మొత్తం కారు బాడీని ఒకే షీట్‌తో తయారు చేయడం)’ రూపంలో నిర్మిస్తారు. 1962లో లోటస్ కంపెనీ సాంప్రదాయక డిజైన్లను పక్కనబెట్టి అల్యూమినియం షీట్ ఆధారిత చాసిస్‌ను రూపొందించింది. ప్రస్తుత తరంలో పటిష్టమైన కార్బన్ సమ్మేళనాలను వాడుతున్నారు. రెసిన్‌లో పొందుపర్చిన స్పన్ కార్బన్ ఫైబర్స్‌ను అల్యూమినియం మెష్‌పై పోతగా పోస్తున్నారు. దీనివల్ల లైట్ వెయిట్, కఠినత్వం, గాలిలో సులువుగా పరుగెత్తే సామర్థ్యం పెరుగుతుంది. సింగిల్ డ్రైవర్ కూర్చోవడానికి వీలుగా కాక్‌పిట్, దాని చుట్టూ మందమైన బాడీ ఉంటుంది. డ్రైవర్ కొలతలకు సరితూగినట్లుగా సీట్‌ను ఏర్పాటు చేస్తారు.  
     
     మిడ్ ఇంజిన్‌తో మొదలు...

    1961లో మిడ్-ఇంజిన్‌తో కార్లు వచ్చాయి. 2006కు ముందు బలమైన 3-లీటర్ బీ10 ఇంజిన్‌ను వాడారు. కానీ ఎఫ్-1 నిబంధనలు మారడంతో ఇప్పుడు 2.4 లీటర్ వీ-8 ఇంజిన్‌ను వాడుతున్నారు. ఇది 900 హార్స్‌పవర్ శక్తిని విడుదల చేస్తుంది. 500 మైల్స్ పరుగెత్తిన తర్వాత ఇంజిన్‌ను పునర్‌నిర్మించాలి. ఒక్క కారు రెండు రేసులకు మాత్రమే ఉపయోగపడుతుంది. డ్రైవర్, ఫ్యూయెల్, కారు అన్నీ కలిపి మొత్తం బరువు 691 కేజీలు ఉండాలి. ఏడు సెకన్ల వ్యవధిలో కారు గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓవరాల్‌గా కారు ‘ఇంజిన్ సామర్థ్యం, ఏరో డైనమిక్స్, సస్పెన్షన్, టైర్ల గ్రిప్’ ఇలా నాలుగు కీలక అంశాలపై ఆధారపడి పని చేస్తుంది. ట్రాక్‌పై కారు ఎంత వేగంతో పరుగెత్తించినా.... మలుపుల వద్ద పూర్తి కంట్రోలు ఉండేలా చూస్తారు. కారు ముందు, వెనుక ఉండే రెక్కలతో పాటు కింది భాగం నుంచి వచ్చే అధిక ఒత్తిడికి ఒక్కొక్కసారి కారు ట్రాక్‌పై నుంచి బయటకు వెళ్లిపోతుంది. అలా జరగకుండా కాపాడటానికి  బాగా గ్రిప్ నిచ్చే టైర్లతో పాటు అధునాతన ఏరో డైనమిక్స్‌ను ఉపయోగిస్తారు. పిట్‌స్టాప్ వద్ద కారులో సెకన్‌కు 75 లీటర్ల ఇంధనం నింపుతారు.
     
    మంచి నీళ్లలా వేల కోట్లు

    రాకెట్ స్పీడ్‌తో కార్లు దూసుకుపోవాలంటే అంతకు రెట్టింపు వేగంతో డబ్బులు ఖర్చు చేయాలి. 2006 లెక్కల ప్రకారం రేసులో పాల్గొన్న 11 జట్లకు అయిన ఖర్చు అక్షరాలా 200.9 మిలియన్ డాలర్లు (దాదాపు 8030 కోట్ల రూపాయలు). ఇందులో టయోటా (418.5 మిలియన్ డాలర్లు), ఫెరారీ (406.5 మిలియన్ డాలర్లు)... ఇలా ప్రతి జట్టుకు బడ్జెట్ వేర్వేరుగా ఉంటుంది. ఎఫ్-1లోకి కొత్త జట్టు ప్రవేశించాలంటే 47 మిలియన్  డాలర్లు ఎఫ్.ఐ.ఏకు చెల్లించాలి.  
     
    ఆదరణ అదరహో...

    భారత్‌లో ఇప్పుడు కాస్త అవగాహన పెరిగినా... యూరోప్‌లో ఎఫ్-1 అంటే పడి చస్తారు.  గంటకు 320 కి.మీల స్పీడ్‌తో దూసుకుపోవడం నయనానందంగా అనిపిస్తుంది. ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణంతో పాటు కార్ల వైవిధ్యం.. వందల కి.మీల వేగానికి ప్రధాన కారణం. ఈ పోటీలను ప్రత్యక్షంగా లేక రికార్డు చేసిన టేపులను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ వీక్షిస్తారని అంచనా. ప్రపంచంలో అత్యధిక ప్రేక్షకులను కలిగిన క్రీడగా ఎఫ్-1ను పరిగణిస్తారు. 2006 బ్రెజిల్ గ్రాండ్ ప్రి పోటీలో ఒక భాగాన్ని కనీసం 16 కోట్ల మంది తిలకించారు. ఇదే లెక్కన 2001 సీజన్‌లో జరిగిన ఏదో ఓ రేసును చూసిన వారందర్ని లెక్క కడితే 540 కోట్లుగా తేలింది.
     
     యుద్ధ సన్నాహమిది

    ఎఫ్-1 రేసుకు అన్నీ సకాలంలో సమకూర్చాలంటే పెద్ద యజ్ఞమే చేయాలి. ఒక్కో జట్టు ఏడాదిలో 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడంతో సామాగ్రిని తరలించడం కత్తిమీద సామే. రేసింగ్ సామగ్రిని రోడ్డు, ఆకాశ, సముద్ర మార్గాల్లో తరలిస్తారు. సముద్ర మార్గంలో అయితే మూడు నెలల ముందే సామగ్రిని తరలిస్తారు. ఏడాదిలో జరిగే 19 గ్రాండ్‌ప్రిలలో ఒక్కొక్కసారి ఈవెంట్ల మధ్య వారం మాత్రమే విరామం ఉంటుంది.
     
    ఒక్కో జట్టు నాలుగు భారీ ట్రక్‌ల నిండా 25 టన్నులకు మించి సామగ్రిని తీసుకెళ్తుంది. యంత్ర, రక్షణ, దుస్తులతో పాటు ప్రతీ రేసుకు మూడు కార్లు అదనంగా రెండు చాసిస్‌లు తీసుకెళ్తారు. యూరోప్‌లో అయితే కొద్దిగా మేలుకానీ ఇతర దేశాల్లో రవాణా చాలా కష్టంతో కూడుకుంటుంది. అలాంటప్పుడు మేనేజ్‌మెంట్ ప్రత్యేక విమానాలను సమకూరుస్తుంది. వివిధ రేసులకు సామగ్రిల్లో కాస్త తేడా ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైన సామగ్రి రేసు వేదికల్లో లభించకపోతే వాటిని ముందే అక్కడికి తరలించాల్సి వస్తుంది. 143కు పైగా సిబ్బంది, 18 కిరాయి కార్లు, సామాన్లతో కూడిన 11 ట్రక్‌లు, 19 రకాల విమానాల్లో ప్రయాణం, ఏడు నక్షత్రాల హోటల్లో 104 గదుల్లో బస.. ఇంత కార్యక్రమం జరిగితే 2006 హంగేరి గ్రాండ్ ప్రిలో బటన్ ట్రాక్‌పైకి వచ్చాడు. ప్రతి జట్టు వెంట కనీసం 65 నుంచి 75 వరకు సభ్యులు ఉంటారు.
     
    భారత్‌లో ‘బుద్ధ’ సర్క్యూట్

    భారత్‌లో ఎఫ్-1 రేసుకు తలమానికంగా నిలిచిన బుద్ధ సర్క్యూట్‌ను జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ నిర్మించింది. దేశ రాజధాని న్యూఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్)లో దీన్ని ఏర్పాటు చేశారు. 2011లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి రేసుతో ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు వచ్చింది. 2500 ఎకరాల్లో ఉన్న జేపీ గ్రీన్ స్పోర్ట్స్ సిటీలో భాగంగా 874 ఎకరాల్లో ఈ సర్క్యూట్‌ను నిర్మించారు. 400 మిలియన్ డాలర్ల ఖర్చుతో 5.14 కిలో మీటర్ల సర్క్యూట్‌ను ప్రఖ్యాత జర్మన్ ఆర్కిటెక్చర్ హెర్మన్ టిల్కీ రూపొందించారు. ప్రస్తుతం దీని సీటింగ్ సామర్థ్యం 2 లక్షలు. ఎఫ్-1  డ్రైవర్ల సత్తాకు పరీక్షగా ఈ ట్రాక్ నిర్మాణం జరిగింది.  జేపీ గ్రీన్ స్పోర్ట్స్ సిటీలో లక్ష మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, 18 హోల్ గోల్ఫ్ స్టేడియం, 25 వేల మంది సామర్థ్యంతో ఫీల్డ్ హాకీ మైదానం, ఓ అధునాతన అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు.  
     
    మాల్యా ‘ఫోర్స్’

    అక్టోబర్ 2007లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... యూకేకు చెందిన ‘స్పైకర్ ఎఫ్-1 జట్టు’ను 90 మిలియన్ యూరోలకు కొనుగోలు చేశారు. భారత్ నుంచి లెసైన్స్ తీసుకుని ‘ఫోర్స్ ఇండియా ఫార్ములావన్ టీమ్’గా నామకరణం చేశారు. ఫోర్స్ కారు చాసిస్‌ను ‘వీజేఎం’గా పిలుస్తారు. ఎఫ్-1లో ఫోర్స్ జట్టు బరిలోకి దిగడంతో భారత్‌లో ఈ రేసులపై కాస్త అభిమానం ఏర్పడింది. 2011లో సహారా పరివార్ గ్రూప్.. ఫోర్స్‌లో 42.5 శాతం వాటా కొనుగోలు చేసింది. ఐదేళ్ల ఒప్పందంలో భాగంగా మెర్సిడెజ్ బెంజ్ ఫోర్స్‌కు వీజేఎం-2 ఇంజిన్, గేర్‌బాక్స్, హైడ్రాలిక్ వ్యవస్థ, కేఈఆర్‌ఎస్ ఫ్యూచర్స్‌ను సరఫరా చేస్తోంది.
     
    ముచ్చటగా మూడు రోజులు

    ఏ గ్రాండ్‌ప్రిలోనైనా రేసు మూడు రోజుల పాటు మూడు భాగాలుగా జరుగుతుంది. శుక్రవారం జరిగే ప్రాక్టీస్ రెండు సెషన్ల పాటు జరుగుతుంది.  
         
    శనివారం క్వాలిఫయింగ్ రేసు ఉంటుంది. మూడు రౌండ్ల పాటు నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. క్యూ-1... 18 నిమిషాల పాటు జరుగుతుంది.   వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసే డ్రైవర్లు రెండో రౌండ్‌కు అర్హత పొందుతారు. ఇందులో ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తారు.  15 నిమిషాల పాటు జరిగే క్యూ-2లో  6 మందిని ఎలిమినేట్ చేస్తారు. క్యూ-3లో 10 గ్రిడ్ పొజిషన్లకు మిగిలిన 10 కార్లు పోటీపడతాయి. వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసిన డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’ లభిస్తుంది.
     
    ఫార్ములావన్‌కు సంక్షిప్త నామం ఎఫ్-1. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్ (ఎఫ్.ఐ.ఏ) ఆధ్వర్యంలో రేసులు జరుగుతాయి. ‘ఫార్ములా’ అంటే... ‘పోటీదారులందరితో పాటు అన్ని కార్లు తప్పక పాల్గొనే రేసుకు సంబంధించిన నిబంధనల సమాహారం’. సాధారణంగా ఎఫ్-1 సీజన్ మార్చిలో ఆరంభమవుతుంది. ఏడాది పొడవునా సిరీస్‌లా రేసులు జరుగుతాయి. వీటిని గ్రాండ్‌ప్రిలు అంటారు. ఫార్ములావన్‌లో భాగంగా ఆయా దేశాల పేరుతో ఈ గ్రాండ్ ప్రిలు రేసులను నిర్వహిస్తారు. ఒకే దేశంలో ఒకటి కంటే ఎక్కువ గ్రాండ్ ప్రిలు నిర్వహిస్తే ప్రత్యేక పేర్లు కేటాయిస్తారు. బ్రిటన్, జర్మనీ, స్పెయిన్‌లో రెండో గ్రాండ్‌ప్రి పోటీలను ‘యూరోపియన్ గ్రాండ్ ప్రి’గా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement