మహిళావని | Four People Who Kidnapped and Raped a Young Woman | Sakshi
Sakshi News home page

మహిళావని

Published Wed, Apr 24 2019 1:25 AM | Last Updated on Wed, Apr 24 2019 5:01 AM

Four People Who Kidnapped and Raped a Young Woman - Sakshi

నమ్మించి మోసం
న్యూఢిల్లీ సమీపంలోని గుర్‌గావ్‌లో 28 ఏళ్ల యువతిని ఒక షాపింగ్‌ మాల్‌ నుంచి అపహరించుకుని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు వ్యక్తులలో ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంబ్రియాలజిస్టు (గర్భస్థ శిశువులపై పరిశోధనలు జరిపే వైద్య నిపుణురాలు) అయిన ఆ యువతిని ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్న ప్రధాన నిందితుడు గతవారం ఆమెను నమ్మించి షాపింగ్‌ మాల్‌కు రప్పించి, అక్కడి నుంచి మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్‌ చేసి గుర్‌గావ్‌ శివార్లలో ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయారు. 

న్యాయం–ప్రతీకారం!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ మీద పూర్వపు మహిళా ఉద్యోగి ఒకరు తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేయడంతో సుప్రీంకోర్టు జడ్జిలు తమ నివాసాలలోని పనుల కోసం ఇక ముందు పురుషులను మాత్రమే నియమించుకోవాలని తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది! ఒక మహిళ ఆరోపణలు చేయడం వల్ల మిగతా మహిళలకు ఉద్యోగావకాశాలు రాకుండా పోయే ప్రమాదం ఉందనే సంకేతం పంపడానికే జడ్జీలు ఇలా బహిరంగంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల  కేసు విషయంలో గొగోయ్‌ సమన్యాయ సూత్రానుసారం వ్యవహరించలేదని ‘సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌’, ‘ఎస్‌.సి. అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌’ సభ్యులు అంటుండగా, ‘ఎస్‌.సి. ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’, ‘ఎస్‌.సి. సెక్రెటేరియల్‌ స్టాఫ్‌ వెల్ఫేర్‌  అసోసియేషన్‌’ అయనకు సంఘీభావం తెలిపాయి. 

ఉగ్రవాది కుటుంబం
శ్రీలంకలోని షాంగ్రీ–లా హోటల్‌లో ఆత్మాహుతి దాడి జరిపిన ఉగ్రవాది భార్య, సోదరి అదే రోజు జరిగిన ఇంకో ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలో ఆదివారం వివిధ ప్రాంతాలలో జరిగిన ఏడు పేలుళ్లలో 290 మంది వరకు మరణించగా, అనేక వందల మందికి గాయాలయ్యాయి. స్థానిక ఇస్లామిక్‌ సంస్థ ఎన్టీజే (నేషనల్‌ తహీద్‌ జమాత్‌) ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు ఇప్పటికైతే భావిస్తున్నారు. 

గుండె నిబ్బరం 
‘దాడి చేసినవాడిని మీ కలల్ని దోచుకుపోనివ్వకండి’ అనే సందేశంతో నిర్భయ తల్లి ఆశా దేవి, ఆసిడ్‌ దాడి అనంతరం ధైర్యం నిలిచిన లక్ష్మీ అగర్వాల్, ఎల్జీబీటిక్యూ హక్కుల కార్యకర్త లక్ష్మీ నారాయణ్‌ త్రిపాఠీ..  హైదరాబాద్‌లో సాధికారతపై జరిగిన ఒక సమావేశంలో తమ అనుభవాలు పంచుకున్నారు. ‘‘బాధితురాలైన మహిళ చీకట్లోనే కుమిలిపోకుండా తనకు తనుగా ఎలా నిలబడి వెలుగులోకి రావాలన్నది తెలసుకోవాలి. పరిస్థితులతో నిబ్బరంగా పోరాడాలి. తన కలల్ని నిజం చేసుకోవాలి’’ అని ఆశ, అగర్వాల్, త్రిపాఠీ అన్నారు. 

విమర్శల వివాదం
సాధ్వి ప్రజ్ఞసింగ్, మహారాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భూపాల్‌ ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞ.. ‘కట్టడం శిఖరం వరకు ఎక్కాను. కూల్చివేతలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది’ అని అయోధ్య ఘటన గురించి వ్యాఖ్యానించడంతో ఎన్నికల సంఘం ఆమెపై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసింది. మరోవైపు పంకజ ఆదివారంనాడు జల్నా ప్రచార సభలో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్య కూడా వివాదాస్పదం అయింది. ‘‘సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగినట్లుగా సాక్ష్యాలు చూపించమని అడగుతున్నారు. రాహుల్‌ గాంధీకి బాంబు కట్టి పంపిస్తే సరి’’ అని ఆమె అన్నారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement