గజల్‌ గమనం | Gajal changed his surname and Became known as Ghazal Vinod | Sakshi
Sakshi News home page

గజల్‌ గమనం

Published Tue, Apr 30 2019 2:34 AM | Last Updated on Tue, Apr 30 2019 2:34 AM

Gajal changed his surname and Became known as Ghazal Vinod - Sakshi

నేలతల్లి ఒడిలో ‘సాగు’ సమయాన కాయకష్టాన్ని మరపించేందుకు అమ్మ పాడిన ముడుపుపాటలే అతనికి ఊపిరి పోసాయి. నాన్న భజన పాటల ఆలంబనలో పాటగాడ్ని చేశాయి.సరదాగా తీసే కూని రాగం జానపదాల వైపు నడిపించింది.

ఓ చిన్ని ఆలాపనే అతనిని గాయకుణ్ణి చేసింది. నడకతో ఎన్నో నేర్చుకుని.. ప్రకృతిని తన పాటలో కలుపుకునిఅందంగా వినిపిస్తూ పదేళ్లుగా అతని పాటల ప్రస్థానం సాగుతోంది. దేశభక్తి గీతాలు,సామాజిక గేయాలు, జానపదాలు, గజల్స్‌ అతని గానంలో భాగమయ్యాయి.

అమ్మానాన్నలే గురువులుగా.. పాట, మాట, గేయం, గజల్‌ ఏదైనా విని నేర్చుకున్న ఆ యువకుడు గజల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకుని గజల్‌ వినోద్‌గా గుర్తింపు పొందాడు. అతని గజల్‌ సవ్వడుల ప్రస్థానం అతని మాటల్లోనే..

అమ్మానాన్నలే నా గురువులు
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నా జన్మ స్థలం. నా భార్య స్రవంతి. అమ్మ గేదెల చింతల్లి, నాన్న గేదెల దుర్గారావు, అన్నయ్య, తమ్ముడు ఉన్న మాది రైతు కుటుంబం. అమ్మ పొలం పనులకు వెళుతుండేవారు. ఆమె జానపదాలు పాడుతుంటే విని నాకూ వాటిపై ఇష్టం ఏర్పడింది. నాన్న భజన పాటలు పాడుతుంటే చూసి లయబద్ధంగా పాటలు పాడటం నేర్చుకున్నాను. సాహిత్యంలో గంటేడ గౌరీ నాయుడు, డాక్టర్‌ సినారె, సిరివెన్నెల, గోరేటి వెంకన్న, వంగపండు వంటి మహనీయులకు నేను ఏకలవ్య శిష్యుడిని. ఎం.ఏ తెలుగు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను. గజల్స్‌ పాడుతూ సమాజ చైతన్యానికి నా వంతు కృషి చేస్తున్నాను.సరదాగా పాడుతున్న నన్ను కె. ఎస్‌. జన కళ్యాణ సమాఖ్య స్వచ్ఛంద సేవా సంస్థ వారు గుర్తించారు. ఆదరించారు.

నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. డాక్టర్‌ వంశీ సహకారంతో ఫ్లాష్‌ టీమ్‌ ఏలూరు వారికి నేను పరిచయం అయ్యాను. దీంతో ఉత్తరాంధ్రకే పరిమితమైన నా పాట ఉభయ గోదావరి జిల్లాలను దాటుతూ రాష్ట్రమంతా పలికింది. మల్లం మహేష్‌ కళారత్న వారి ప్రోత్సాహంతో రవీంద్రభారతిలో నా పదేళ్ల ప్రస్థానం వేడుక జరుపుకోవడం జరిగింది. యూ ట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మందికి నేను దగ్గరయ్యాను. అందరూ నన్ను గుర్తించి పలకరించి ప్రోత్సహించడం.. ఇలా ఎన్నో మంచి మంచి అనుభవాల సాధనతో నా పదేళ్ల ప్రస్థానం పూర్తయింది. తోటికళాకారులతో సరదాగా ఉంటాను. అందుకే అందరూ ఇష్టపడతారు. గౌరవిస్తారు.

ప్రపంచమంతా నా గజల్స్‌ వినిపిస్తాను
తెనాలి స్వచ్ఛంద సేవా సంస్థ వారు గజల్‌ గాన కోయిల బిరుదును ఇచ్చి ప్రోత్సహించింది. రెండుసార్లు అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా వీసా సమస్యల కారణంగా వెళ్ళలేకపోయాను. ఎప్పటికైనా ప్రపంచమంతా నా గజల్స్‌ వినిపిస్తాను. రెండుసార్లు జానపద గీతాలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందాను. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నాను. రవీంద్రభారతిలో సన్మానం మరువలేనిది. ఐ.ఎ.ఎస్‌ల చేతుల మీదుగా, యూత్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను అందుకున్నాను. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వగలిగాను.

మార్పు రావాలి
నేను స్వయంగా కొన్ని పుస్తకాలు రాసాను. కొన్ని ఆల్బమ్స్‌ కూడా రిలీజ్‌ చేశాను. వాటికి మంచి స్పందన వచ్చింది. కళాకారునిగా ఈ సమాజం నన్ను గుర్తించింది. మంచిని పంచే బాధ్యతను అప్పగించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ సమాజంలో కళ అంటే గౌరవం ఉంది. కళాకారుడు అంటే చిన్న చూపు ఉంది. కొందరి తప్పిదాలు అందుకు కారణం కావచ్చు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
బోణం గణేష్, సాక్షి, విజయనగరం  ఫొటో: డి.సత్యనారాయణమూర్తి

పేరు తెచ్చిన పాటలు
నేను పాడిన వాటిలో ‘నా  చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో’ అంటూ బాల కార్మిక గీతం. ఇది ఊరేనా.. నే నడిచిన నేలేలా అన్న పల్లె పాట.. కమ్మనైన అమ్మ పాట అంటే ఎంతో మధురము వంటి పాటలు నాకు ఎంతో పేరు తీసుకుని వచ్చాయి. గజల్స్‌ పాడటం వలన గజల్‌ వినోద్‌ గా ప్రసార మాధ్యమాలు నన్ను చూపించాయి. నా వంతుగా సమాజాన్ని చైతన్యం చేసే చాలా పాటలు పాడాను, రాసాను. విద్యార్థులను, మహిళలను, రైతులను, చైతన్యం చేస్తున్నాను. నాపైనా, కళలపైనా అందరి ఆశీర్వాదం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement