కోర్కెలు తీర్చే మార్కెట్ గణపతి | Ganesha wishes to fulfill the market | Sakshi
Sakshi News home page

కోర్కెలు తీర్చే మార్కెట్ గణపతి

Published Thu, Aug 28 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

కోర్కెలు తీర్చే మార్కెట్ గణపతి

కోర్కెలు తీర్చే మార్కెట్ గణపతి

ఒకే దేవుడికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ముంబైలో ‘లాల్‌బాగ్ చా రాజా’ వినాయకుడు కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు. ఈ వినాయకుడిని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే ఈ వినాయకుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. ముంబై నగరంలోని లాల్‌బాగ్ ప్రాంతంలో కొలువైన ఈ విఘ్ననాయకుడిని ‘లాల్‌బాగ్ చా రాజా’ అనే పిలుస్తారు. అదే పేరుతో ఇక్కడ గణేషోత్సవ మండలి ఏర్పడి, ఎనిమిది దశాబ్దాలుగా గణనాయకుడికి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతున్నాయి. ఇక్కడ ప్రతిష్టించబడిన వినాయకుడి ని ‘నవ్సాచా గణపతి’ అంటే కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేర్కొంటారు.
 
1934 నుంచి ప్రారంభం...

లాల్‌బాగ్ ప్రాంతంలో 1934లో తొలుత గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన సమయంలో భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం జోరుగా కొనసాగుతోంది. అందువల్ల తొలినాళ్లలో ఈ మండలిని ‘సార్వజనీక్ గణేషోత్సవ్ మండల్ లాల్‌బాగ్’ అని పిలిచేవారు. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి వెనుక పెద్ద కథ ఉంది. 1932లో ‘పెరు చాల్’ వద్ద ఉన్న మార్కెట్ మూతపడడంతో ఇక్కడి చిరు వ్యాపారులు, మత్స్యకారులు ఆందోళన చెందారు. మార్కెట్  కోసం తమకు మంచి స్థలం లభిస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని మొక్కుకొన్నారు. ఫలితంగా వారికి లాల్‌బాగ్‌లో ప్రాంతంలో స్థలం లభించింది. దీంతో ఇదే లాల్‌బాగ్ మార్కెట్‌లో 1934 సెప్టెంబర్ 12వ తేదీ న ఉత్సవాలు ప్రారంభించారు. తొలినాళ్లలో చిన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. ఇదే నేడు మహామండలిగా ఎదిగి లక్షలాది భక్తులకు తీర్థస్థలంగా మారింది. కాగా, నాటి నుంచి నేటి వరకు రత్నాకర్ కాంబ్లీ వంశస్తులు లాల్‌బాగ్‌చా రాజా గణపతి విగ్రహాన్ని తయారు చేస్తూ వస్తున్నారు.
 
స్వచ్ఛందసేవ....
 
లాల్‌బాగ్‌చా రాజా మండలికి భారీ మొత్తంలో వచ్చే డబ్బు, బంగారం, ఇతర కానుకలు, విలువైన వస్తువులను మండలి స్వచ్ఛందంగా సేవల కోసం వినియోగిస్తోంది. బీహార్‌లో వరదలు వచ్చినప్పుడు,  1962, 1968 యుద్ధ సమయాల్లో కూడా భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. విద్యా సంస్థల భవనాల నిర్మాణం కోసం కొంత ధనాన్ని కేటాయిస్తున్నారు. భారత సైన్యం కోసం 1990లో లక్ష రూపాయల నిధితో ‘ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్’ ను ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ ద్వారా యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు లాల్‌బాగ్‌చా రాజా ఆర్థిక సహాయం అందజేస్తుంది. లాల్‌బాగ్‌చా రాజా తమ సొంత వెబ్‌సైట్‌ను 2000 సంవత్సరంలో www.lalbaugcharaja.comపేరుతో రూపొందించింది.
 
- జి.ఎస్.
 ఫొటోలు: పి.ఆర్, సాక్షి ముంబై

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement