
అతి దాహం, అతి మూత్రం, ఇన్ఫెక్షన్లు... ఎందుకిలా?
నా వయసు 38 ఏళ్లు. ఈమధ్య తరచూ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. అతిగా దాహం వేస్తోంది. విపరీతమైన ఆకలి. ఎప్పుడూ నీరసంగా అనిపిస్తోంది. తరచూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. నేను చేస్తున్న పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుందేమోనని నేను అనుకుంటుంటే... లక్షణాలను విన్నవారు నాకు షుగర్ వచ్చిందేమోనని అంటున్నారు. నాకు ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరంగా చెప్పండి. – డి. వివేక్, విశాఖపట్నం
ఉద్యోగరీత్యా మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇలా ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటిస్‌ను మరింత త్వరగా వచ్చేలా చేస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలన్నీ డయాబెటిస్ లక్షణాలనే పోలి ఉన్నాయి. మీరు చెబుతున్నట్లుగా ప్రైవేట్ పార్ట్స్‌లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి డయాబెటిస్ ఉన్నవారిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి.
మీ లక్షణాలన్నీ చాలావరకు డయాబెటిస్‌నే సూచిస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు షుగర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ పరీక్షలు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, హెచ్‌బీఏ1సి వంటి పరీక్షలు డయాబెటిస్ నిర్ధారణకు ఉపకరిస్తాయి. మీరు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సూచనల ప్రకారం తగిన పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాలను బట్టి చికిత్స తీసుకోండి.
వీపు మీద ఈ నల్లమచ్చలేమిటి?
నా వయసు 45 ఏళ్లు. వీపు మీద నల్లటి మచ్చలతో కూడిన చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి. మామూలు గడ్డలే కదా అని ఇంతవరకు డాక్టర్‌కు చూపించ లేదు. కానీ ఇటీవల అవి పెరుగుతున్నాయి. గడ్డ గట్టిగా అవుతోంది. నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. సుబ్బారావు, గుంటూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అవి యాక్నే లా అనిపిస్తున్నాయి. మీకు సివియర్ యాక్నే (మొటిమలు) వస్తుండవచ్చు. ఈ మొటిమలన్నవి కేవలం ముఖం మీదే కాకుండా ఒక్కోసారి వీపు మీద, ఛాతీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ సలహాపై తగిన పూతమందులు, మరీ అవసరమైతే యాంటీబయాటిక్స్ వంటివి వాడితే మీ సమస్య తేలికగానే పరిష్కారమవుతుంది. మీరు వెంటనే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
ఎప్పుడూ ఆందోళన, నిద్రలేమి... ఎందుకిలా?
నా వయసు 34 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ కంపెనీ పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. చిన్న విషయానికీ చాలా ఎక్కువగా గాభరా పడుతుంటాను. ఎక్కువగా ఆందోళనకూ, ఉద్వేగాలకు గురవుతుంటాను. ఆలోచనలు చాలా ఎక్కువ. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. – ఎల్. రఘు, హైదరాబాద్
మీ లక్షణాలను బట్టి చూస్తే మీరు యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన అంశాలైన... తీవ్రమైన ఆందోళన, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది.
దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్‌పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానాపడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యతో అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది.
పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీరు చెప్పిన జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యను నివారించచడం చాలా ముఖ్యం. కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్‌ను కేవలం డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి.
ఒంట్లో విటమిన్–డి పాళ్లు తగ్గాయి... ప్రమాదమా?
నా వయసు 32 ఏళ్లు. ఇటీవల బాగా నిస్సత్తువగా ఉంటే, డాక్టర్‌ను కలిసి కొన్ని వైద్యపరీక్షలు చేయించాను. విటమిన్–డి పాళ్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. విటమిన్–డి తగ్గడం వల్ల ఏదైనా ప్రమాదమా? దయచేసి వివరంగా చెప్పండి. – కిశోర్‌కుమార్, భీమవరం
మన ఎముకలకు అవసరమైన క్యాల్షియమ్‌ను పీల్చుకునేందుకు విటమిన్–డి దోహదపడుతుంది. విటమిన్–డి తగ్గడం వల్ల ఎముకలు మెత్తబడిపోతాయి. పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి స్తుంది. పెద్దల్లో ఆస్టియోమలేసియా అనే వ్యాధికి విటమిన్–డి లోపం కారణమవుతుంది. ఇవేగాక విటమిన్–డితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
విటమిన్–డి వల్ల మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అంతేకాదు... ఇది మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. మన కండరాల వ్యవస్థ, నరాల పటిష్టత, కండరాలకూ, నరాలకూ మంచి సమన్వయం... ఇవన్నీ విటమిన్–డి వల్ల సాధ్యపడతాయి. మనలోని కణాలు తమ తమ జీవక్రియలను సక్రమంగా నెరవేర్చడానికి విటమిన్–డి దోహదపడుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
విటమిన్–డి ని పొందడం ఎలా? ఉదయం వేళలోని లేత ఎండలో కనీసం 30 నిమిషాల పాటు మన ముఖం, కాళ్లు, చేతులు, వీపు వంటి శరీర భాగాలు ఆ లేత ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యేలా తిరగడం వల్ల మనకు విటమిన్–డి లభిస్తుంది. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా తిరగడం మంచిది.
ఆహార పదార్థాల ద్వారా...
కొన్ని రకాల ఆహారపదార్థాలలోనూ విటమిన్–డి పుష్కలంగా ఉందని రుజువైంది. అవి... సాల్మన్ చేపలు మాకరెల్ చేపలు ∙ట్యూనా చేపలు పుట్టగొడుగులు (అయితే వీటిలో విటమిన్–డి పాళ్లను పెంచడానికి అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్‌పోజ్ అయ్యేలా చేయాలి) పాలు లేదా పెరుగు గుడ్డులోని తెల్ల, పచ్చ సొన వంటి ఆహారాల్లోనూ ఇది ఎక్కువ.
మీలో విటమిన్–డి పాళ్లు తగ్గాయంటున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్‌లోనూ విటమిన్–డి టాబ్లెట్లు దొరుకుతున్నాయి. మీ డాక్టర్ సలహాతో వాటిని వాడండి. స్వాభావికంగా విటమిన్–డి పాళ్లను పెంచుకునేందుకు ఉదయపు లేత ఎండలో నడుస్తూ, పైన పేర్కొన్న ఆహారం తీసుకోండి.
- డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment