
పెయింట్ వాసన వస్తే చాలు తలనొప్పి
పెయింట్ వాసన నా ముక్కుకు సోకగానే వెంటనే నాకు తలనొప్పి (డల్ హెడేక్) మొదలవుతోంది. ఆ తలనొప్పి చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు... ఎవరైనా స్ప్రే కొట్టుకుని వస్తే వాళ్ల దగ్గరనుంచి ఆ వాసన రాగానే కడుపులో తిప్పడంతో పాటు మళ్లీ హెడేక్ మొదలువుతుంటుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్కడ్నుంచి వెళ్లిపోతాను. అయితే మామూలుగా బయట ఎక్కడైనా అయితే వెళ్లిపోగలను కానీ... ఆఫీస్‌లో కొలీగ్స్ ఎవరైనా స్ప్రే కొట్టుకుని వస్తే వాళ్లతో కలిసి పనిచేయాల్సిన సందర్భాల్లో దూరంగా వెళ్లలేను కదా. నా సమస్యకు పరిష్కారం పరిష్కారం సూచించండి. – ఎల్. లక్ష్మి, హైదరాబాద్
మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు ఒక రకం మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పిని ప్రేరేపించే అంశాల్లో అనేక రకాలు ఉంటాయి. ఇందులో అగరుబత్తీలు, పెర్‌ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. కొందరిలో చాక్లెట్లు, స్వీట్స్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తలనొప్పి రాకుండానే ముందుగా తీసుకునే మందులు (ప్రొఫిలాక్సిస్) తీసుకోండి. మీకు తలనొప్పిని ప్రేరేపించే అంశాలేమిటో తెలుసు కాబట్టి వీలైనంత వరకు వాటిని దూరంగా ఉండండి.
మెడ నుంచి చేతి వరకూ జాలు నొప్పి...
నా వయసు 45 ఏళ్లు. నాకు కుడి చేయి విపరీతంగా లాగుతోంది. నా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపిస్తోంది. మెడ దగ్గర నొప్పి వస్తోంది. కళ్లు తిరుగుతూ ఉన్నాయి. కిందపడిపోయినట్లుగా అనిపిస్తోంది. గత మూడు నెలలుగా ఈ నొప్పి ఇలాగే ఉంది. అప్పుడప్పుడూ నొప్పి నివారణ మందులు వాడుతున్నాను. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గి మళ్లీ వస్తోంది. నాకు తగిన పరిష్కారం చూపించండి. – కె. రాంబాబు, నల్లగొండ
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే బహుశా సర్వికల్ స్పాండిలైటిస్ కారణంగా వెన్నెముక అరిగి, అది వెన్నెముక నుంచి మీ చేతికి వచ్చే నరంపై ఒత్తిడి పడుతున్నట్లు అనిపిస్తోంది. దాంతో మీకు నొప్పి వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే కారణమైతే మీరు బీటాహిస్టిన్, గాబాంటిన్, మిథైల్ కోబాలమైన్ వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. మెడకు సంబంధించిన వ్యాయామాలు తెలుసుకొని, వాటిని చేయాలి. దాంతో మెడకండరాలు బలంగా మారి నొప్పి తగ్గేందుకు అవకాశం ఉంది. మీరు ఒకసారి మీ సమస్య నిర్ధారణ కోసం జనరల్ ఫిజీషియన్ లేదా న్యూరాలజిస్ట్‌ను కలవండి.
- డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment