General health counseling
-
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
పెయింట్ వాసన వస్తే చాలు తలనొప్పి పెయింట్ వాసన నా ముక్కుకు సోకగానే వెంటనే నాకు తలనొప్పి (డల్ హెడేక్) మొదలవుతోంది. ఆ తలనొప్పి చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు... ఎవరైనా స్ప్రే కొట్టుకుని వస్తే వాళ్ల దగ్గరనుంచి ఆ వాసన రాగానే కడుపులో తిప్పడంతో పాటు మళ్లీ హెడేక్ మొదలువుతుంటుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్కడ్నుంచి వెళ్లిపోతాను. అయితే మామూలుగా బయట ఎక్కడైనా అయితే వెళ్లిపోగలను కానీ... ఆఫీస్‌లో కొలీగ్స్ ఎవరైనా స్ప్రే కొట్టుకుని వస్తే వాళ్లతో కలిసి పనిచేయాల్సిన సందర్భాల్లో దూరంగా వెళ్లలేను కదా. నా సమస్యకు పరిష్కారం పరిష్కారం సూచించండి. – ఎల్. లక్ష్మి, హైదరాబాద్ మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు ఒక రకం మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పిని ప్రేరేపించే అంశాల్లో అనేక రకాలు ఉంటాయి. ఇందులో అగరుబత్తీలు, పెర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. కొందరిలో చాక్లెట్లు, స్వీట్స్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తలనొప్పి రాకుండానే ముందుగా తీసుకునే మందులు (ప్రొఫిలాక్సిస్) తీసుకోండి. మీకు తలనొప్పిని ప్రేరేపించే అంశాలేమిటో తెలుసు కాబట్టి వీలైనంత వరకు వాటిని దూరంగా ఉండండి. మెడ నుంచి చేతి వరకూ జాలు నొప్పి... నా వయసు 45 ఏళ్లు. నాకు కుడి చేయి విపరీతంగా లాగుతోంది. నా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపిస్తోంది. మెడ దగ్గర నొప్పి వస్తోంది. కళ్లు తిరుగుతూ ఉన్నాయి. కిందపడిపోయినట్లుగా అనిపిస్తోంది. గత మూడు నెలలుగా ఈ నొప్పి ఇలాగే ఉంది. అప్పుడప్పుడూ నొప్పి నివారణ మందులు వాడుతున్నాను. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గి మళ్లీ వస్తోంది. నాకు తగిన పరిష్కారం చూపించండి. – కె. రాంబాబు, నల్లగొండ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే బహుశా సర్వికల్ స్పాండిలైటిస్ కారణంగా వెన్నెముక అరిగి, అది వెన్నెముక నుంచి మీ చేతికి వచ్చే నరంపై ఒత్తిడి పడుతున్నట్లు అనిపిస్తోంది. దాంతో మీకు నొప్పి వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే కారణమైతే మీరు బీటాహిస్టిన్, గాబాంటిన్, మిథైల్ కోబాలమైన్ వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. మెడకు సంబంధించిన వ్యాయామాలు తెలుసుకొని, వాటిని చేయాలి. దాంతో మెడకండరాలు బలంగా మారి నొప్పి తగ్గేందుకు అవకాశం ఉంది. మీరు ఒకసారి మీ సమస్య నిర్ధారణ కోసం జనరల్ ఫిజీషియన్ లేదా న్యూరాలజిస్ట్‌ను కలవండి. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
ఈసీజీ నార్మల్...అయినా ఛాతీనొప్పి ఎందుకు? నా వయసు 27 ఏళ్లు. నాకు తరచూ గుండెల్లో పట్టేసినట్లుగా మజిల్ క్రాంప్స్లాగానే అనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని రెండుసార్లు ఈసీజీ తీయించాను. గుండెలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఈ లక్షణం తరచూ కనిపిస్తుండటంతో గుండెకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉందేమోనని ఆందోళనగా ఉంది. ఈసీజీ నార్మల్‌గా ఉన్నా నాకు ఎందుకీ నొప్పి వస్తోంది? తగిన పరిష్కారం చూపండి. – మనోజ్‌కుమార్, నల్లగొండ మీరు చెప్పిన లక్షణాలు కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు తీయించిన ఈసీజీ రిపోర్టుల్లో గుండెకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని రెండు సార్లు రిపోర్టు వచ్చింది కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్, ఈసోఫేగల్ స్పాజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఒకసారి జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించండి. ఆయన సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, వ్యాధి నిర్ధారణ జరిగాక సరైన మందులు వాడితే సమస్య దానంతట అదే తగ్గుతుంది. అవసరమైతే ఆ ఇన్హేలర్ ఇస్తారు నా వయసు 43 సంవత్సరాలు. గత పదిహేడేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. అన్ని రకాల వైద్యప్రక్రియల్లో చికిత్స తీసుకున్నా దేనితోనూ రిలీఫ్ రాలేదు. గత పదేళ్ల నుంచి ఇన్హేలర్ను వాడుతున్నాను. దాంతో నాకు మంచి ఉపశమనం దక్కింది. అయితే అది రిలీవర్ మాత్రమేనని, ఇంకో ఇన్హేలర్ వాడాలని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. ఈ ఇన్హేలర్తో నాకు మంచి రీలీఫే ఉంది కదా. అయినా కొత్త ఇన్హేలర్ వాడాల్సిందేనా? – మంజునాథ్, నెల్లూరు ఇన్హేలర్స్లో రెండు రకాలు ఉంటాయి. మొదటివి... ఆస్తమా అటాక్ లక్షణాలు... అంటే దగ్గు, ఊపిరి అందకపోవడం, పిల్లికూతలు రావడం, ఛాతీ బిగుతుగా కావడం వంటి లక్షణాలనుంచి తక్షణ ఉపశమనం ఇస్తాయి. వీటిని రిలీవర్స్ అంటారు. ఇక రెండోవి ఆస్తమా వల్ల వాయునాళాలలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ను తొలగించడంలో సహాయపడేవి. వీటిని ప్రివెంటర్స్ అంటారు. మొదటిదశలో ఆస్తమా రోగులకు రిలీవర్స్ ప్రిస్క్రయిబ్ చేస్తాం. ఆ రోగులు వారంలో రెండుసార్లు కంటే ఎక్కువగా రిలీవర్ ఇన్హేలర్స్ వాడాల్సి వస్తుంటే, ఆ తర్వాతి దశ చికిత్సలో భాగంగా వాటికి తోడుగా ప్రివెంటర్స్ను జతచేస్తాం. మీరు చికిత్స తీసుకుంటున్న వైద్య నిపుణుడిని సంప్రదించి ఆయన సూచన మేరకు మీకు అవసరమైన విధంగా ప్రివెంటర్ లేదా ఆయన సూచించిన విధంగా మందులు తీసుకోండి. బాబు సరిగా తినడు... ప్రోటీన్ ఇవ్వడం ఎలా? మా బాబు వయసు ఎనిమిదేళ్లు. చాలా సన్నగా ఉంటాడు. ప్రోటీన్ డైట్ పెట్టమని చాలా మంది చెబుతున్నారు. అయితే మావాడు మటన్గానీ, చికెన్‌గానీ ముట్టుకోడు. గుడ్డు లాంటివి కూడా ఇష్టంగా తినడు. వాడికి ప్రోటీన్ ఆహారం ఇవ్వడం ఎలా? చూడటానికి బలహీనంగా కనిపిస్తున్నా చలాకీగా, హుషారుగా ఉంటాడు. మావాడికి ఏదైనా ప్రత్యేక ఆహారం అవసరమా? ఏవైనా వైద్య పరీక్షలు అవసరమా? తగిన సలహా ఇవ్వండి. – కె. మాలతి, కర్నూలు మీరు చేస్తున్న ఫిర్యాదు చాలా మంది తల్లులే చేస్తుంటారు. అయితే పెరిగే వయసులో ఉన్న పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వడం చాలా అవసరం. దాంతో పాటు తాజాపళ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అతడు మాంసాహారం ఇష్టపడటం లేదు కాబట్టి అతడు తినేవాటిల్లోనే ప్రోటీన్లు ఉండే ఆహారం ఇవ్వండి. మాంసాహారంలోనేగాక శాకాహారంలోని పప్పు ధాన్యాలు, మీల్ మేకర్ వంటి సోయా ఉత్పాదనలు, రాగుల వంటి ఆహారపదార్థాల్లో ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవుతాయి. అయితే మీరు చెప్పినదాన్ని బట్టి అతడు బాగా తినకపోవడం అన్నది అతడి ఎదుగుదలకు ఏవిధంగానూ ఆటంకంగా కనిపించడం లేదు కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. దాదాపు ప్రతి నెలా జలుబు... ఎందుకిలా? నా వయసు 26 ఏళ్లు. నాకు దాదాపు ప్రతి నెలా జలుబు చేస్తుంటుంది. జలుబు చేసిన ప్రతిసారీ గొంతు మారిపోయి గరగరగా మారుతోంది. ఒకసారి డాక్టర్‌కు చూపిస్తే అలర్జీ అని చెప్పి మందులు ఇచ్చారు. ఇలా ప్రతి నెలా జలుబు చేయడం వల్ల పనిపాటలకు ఇబ్బంది అవుతోంది. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన పరిష్కారం చూపండి. – మనోజ్ఞ, విజయవాడ మీరు వివరించిన లక్షణాలను బట్టి మీరు మాటిమాటికీ వస్తున్న ఫ్యారింజైటిస్ లేదా ల్యారింజైటిస్ సమస్యలతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ బాధలకు మూలకారణం అలర్జీ కావచ్చు లేదా ముక్కులో కండపెరగడం కూడా అయి ఉండవచ్చు. మీరు ఒకసారి పల్మొనాలజిస్ట్ లేదా ఈఎన్టీ సర్జన్లను కలవండి. వారు పరీక్షించి మీ సమస్యను నిర్ధారణ చేస్తారు. దానిమీదే మీ చికిత్స ఆధారపడి ఉంటుంది. పగటిపూట ఎప్పుడూ ఆవలింతలు...ఎందుకిలా? నా వయసు 43. నాకు కొద్దికాలంగా ఆందోళన ఎక్కువగా ఉంటోంది. ఏ పనిపైనా ఆసక్తి ఉండటం లేదు. రాత్రిపూట నిద్ర ఉండటం లేదు. పగటివేళల్లో నిద్రవస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడూ ఆవలింతలు వస్తున్నాయి. నలుగురినీ కలవాలన్న విషయమే ఆందోళనకు గురిచేస్తోంది. రక్త, మూత్ర పరీక్షల్లో అంతా మామూలుగానే ఉంది. నాకు ఏవైనా మానసిక సమస్యలు ఉన్నాయేమోనని ఆందోళనగా ఉంది. నాకు మంచి పరిష్కారం సూచించండి. – రమేశ్‌బాబు, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీరు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు అనిపిస్తోంది. అది నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు సాధారణ యాంగై్జటీ సమస్య లేదా ఏదైనా ఫోబియాతో బాధపడుతున్నట్లు అనుకోవచ్చు. మీరు ముందుగా ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలా వద్దా అని ఆయన నిర్ణయిస్తారు. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
అతి దాహం, అతి మూత్రం, ఇన్ఫెక్షన్లు... ఎందుకిలా? నా వయసు 38 ఏళ్లు. ఈమధ్య తరచూ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. అతిగా దాహం వేస్తోంది. విపరీతమైన ఆకలి. ఎప్పుడూ నీరసంగా అనిపిస్తోంది. తరచూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. నేను చేస్తున్న పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుందేమోనని నేను అనుకుంటుంటే... లక్షణాలను విన్నవారు నాకు షుగర్ వచ్చిందేమోనని అంటున్నారు. నాకు ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరంగా చెప్పండి. – డి. వివేక్, విశాఖపట్నం ఉద్యోగరీత్యా మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇలా ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటిస్‌ను మరింత త్వరగా వచ్చేలా చేస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలన్నీ డయాబెటిస్ లక్షణాలనే పోలి ఉన్నాయి. మీరు చెబుతున్నట్లుగా ప్రైవేట్ పార్ట్స్‌లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి డయాబెటిస్ ఉన్నవారిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీ లక్షణాలన్నీ చాలావరకు డయాబెటిస్‌నే సూచిస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు షుగర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ పరీక్షలు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, హెచ్‌బీఏ1సి వంటి పరీక్షలు డయాబెటిస్ నిర్ధారణకు ఉపకరిస్తాయి. మీరు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సూచనల ప్రకారం తగిన పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాలను బట్టి చికిత్స తీసుకోండి. వీపు మీద ఈ నల్లమచ్చలేమిటి? నా వయసు 45 ఏళ్లు. వీపు మీద నల్లటి మచ్చలతో కూడిన చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి. మామూలు గడ్డలే కదా అని ఇంతవరకు డాక్టర్‌కు చూపించ లేదు. కానీ ఇటీవల అవి పెరుగుతున్నాయి. గడ్డ గట్టిగా అవుతోంది. నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. సుబ్బారావు, గుంటూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అవి యాక్నే లా అనిపిస్తున్నాయి. మీకు సివియర్ యాక్నే (మొటిమలు) వస్తుండవచ్చు. ఈ మొటిమలన్నవి కేవలం ముఖం మీదే కాకుండా ఒక్కోసారి వీపు మీద, ఛాతీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ సలహాపై తగిన పూతమందులు, మరీ అవసరమైతే యాంటీబయాటిక్స్ వంటివి వాడితే మీ సమస్య తేలికగానే పరిష్కారమవుతుంది. మీరు వెంటనే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. ఎప్పుడూ ఆందోళన, నిద్రలేమి... ఎందుకిలా? నా వయసు 34 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. చిన్న విషయానికీ చాలా ఎక్కువగా గాభరా పడుతుంటాను. ఎక్కువగా ఆందోళనకూ, ఉద్వేగాలకు గురవుతుంటాను. ఆలోచనలు చాలా ఎక్కువ. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. – ఎల్. రఘు, హైదరాబాద్ మీ లక్షణాలను బట్టి చూస్తే మీరు యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన అంశాలైన... తీవ్రమైన ఆందోళన, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానాపడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యతో అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీరు చెప్పిన జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యను నివారించచడం చాలా ముఖ్యం. కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్ను కేవలం డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఒంట్లో విటమిన్–డి పాళ్లు తగ్గాయి... ప్రమాదమా? నా వయసు 32 ఏళ్లు. ఇటీవల బాగా నిస్సత్తువగా ఉంటే, డాక్టర్‌ను కలిసి కొన్ని వైద్యపరీక్షలు చేయించాను. విటమిన్–డి పాళ్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. విటమిన్–డి తగ్గడం వల్ల ఏదైనా ప్రమాదమా? దయచేసి వివరంగా చెప్పండి. – కిశోర్‌కుమార్, భీమవరం మన ఎముకలకు అవసరమైన క్యాల్షియమ్‌ను పీల్చుకునేందుకు విటమిన్–డి దోహదపడుతుంది. విటమిన్–డి తగ్గడం వల్ల ఎముకలు మెత్తబడిపోతాయి. పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి స్తుంది. పెద్దల్లో ఆస్టియోమలేసియా అనే వ్యాధికి విటమిన్–డి లోపం కారణమవుతుంది. ఇవేగాక విటమిన్–డితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్–డి వల్ల మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అంతేకాదు... ఇది మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. మన కండరాల వ్యవస్థ, నరాల పటిష్టత, కండరాలకూ, నరాలకూ మంచి సమన్వయం... ఇవన్నీ విటమిన్–డి వల్ల సాధ్యపడతాయి. మనలోని కణాలు తమ తమ జీవక్రియలను సక్రమంగా నెరవేర్చడానికి విటమిన్–డి దోహదపడుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. విటమిన్–డి ని పొందడం ఎలా? ఉదయం వేళలోని లేత ఎండలో కనీసం 30 నిమిషాల పాటు మన ముఖం, కాళ్లు, చేతులు, వీపు వంటి శరీర భాగాలు ఆ లేత ఎండకు ఎక్స్పోజ్ అయ్యేలా తిరగడం వల్ల మనకు విటమిన్–డి లభిస్తుంది. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా తిరగడం మంచిది. ఆహార పదార్థాల ద్వారా... కొన్ని రకాల ఆహారపదార్థాలలోనూ విటమిన్–డి పుష్కలంగా ఉందని రుజువైంది. అవి... సాల్మన్ చేపలు మాకరెల్ చేపలు ∙ట్యూనా చేపలు పుట్టగొడుగులు (అయితే వీటిలో విటమిన్–డి పాళ్లను పెంచడానికి అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ అయ్యేలా చేయాలి) పాలు లేదా పెరుగు గుడ్డులోని తెల్ల, పచ్చ సొన వంటి ఆహారాల్లోనూ ఇది ఎక్కువ. మీలో విటమిన్–డి పాళ్లు తగ్గాయంటున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోనూ విటమిన్–డి టాబ్లెట్లు దొరుకుతున్నాయి. మీ డాక్టర్ సలహాతో వాటిని వాడండి. స్వాభావికంగా విటమిన్–డి పాళ్లను పెంచుకునేందుకు ఉదయపు లేత ఎండలో నడుస్తూ, పైన పేర్కొన్న ఆహారం తీసుకోండి. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
వెంటిలేటర్‌పై ఎప్పుడు, ఎందుకు..?
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ వెంటిలేటర్‌పై ఎప్పుడు, ఎందుకు..? మా అమ్మగారి వయసు 68 ఏళ్లు. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇక ఆమె బతకడం కష్టమని అందరూ అంటున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నవారు బతకడం కష్టమా? అసలు వెంటిలేటర్ ఎందుకు అమర్చుతారు? ఒకవేళ ఆమె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటే, ఇలా ఆమె ఇంకెన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండాల్సి ఉంటుంది? - దయాకర్‌రావు, హైదరాబాద్ వెంటిలేటర్‌పై పెట్టిన పేషెంట్ మళ్లీ క్షేమంగా తిరిగి రారు అని అనుకోవడం పూర్తిగా అపోహ మాత్రమే. వెంటిలేటర్‌పైకి వెళ్లిన పేషెంట్లు మళ్లీ కోలుకునే అవకాశాలే ఎక్కువ. వెంటిలేటర్ అంటే కృత్రిమశ్వాస. దీనిపై పెట్టాలంటే ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టాన్ని అమర్చి దాన్ని వెంటిలేటర్ పరికరం ట్యూబులతో కలుపుతారు. రోగి పరిస్థితి మరీ విషమంగా ఉంటే అనేర రకాల గొట్టాలను అమర్చాల్సి అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియను అనుసరించేప్పుడు శరీర సహజసిద్ధమైన రక్షణ విధానాన్ని అతిక్రమించినట్లు అవుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ సోకకుండా రోగిని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ అమర్చుతారు. ఇక మీ ప్రశ్నల్లో ఒకటైన వెంటిలేటర్ ఏ పరిస్థితుల్లో అమర్చుతారు అనే విషయానికి వస్తే... రోగి రక్తంలో ఆక్సిజన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నా, కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు ఎక్కువగా ఉన్నా, ఆయాసం ఎక్కువైనా, అపస్మారక స్థితిలో ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఊపిరి తీసుకోడానికి అవసరమయ్యే కండరాల పనితీరులో లోపం ఏర్పడి, అవి సరిగా పనిచేయలేకపోతున్నా వెంటిలేటర్‌ను అమర్చుతారు. అంతేగాక... శరీరంలోని కీలకమైన మిగతా అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ ప్రభావం శ్వాసవ్యవస్థపై పడినప్పుడు, ఊపిరితిత్తులకు న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ సోకి శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నప్పుడు కూడా వెంటిలేటర్‌ను అమర్చుతారు. ఇక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ప్రభావంతో ఉబ్బసం ఎక్కువైనప్పుడు అది సెప్సిస్‌కు దారి తీస్తుంది. అలాంటప్పుడు రోగికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వెంటిలేటర్ అమర్చుతారు. ఇక మీ అమ్మగారిని ఎన్నాళ్లు వెంటిలేటర్‌పై అమర్చుతారనే ప్రశ్న విషయానికి వస్తే... ఆమెను ఏ కారణంపై వెంటిలేటర్‌పై ఉంచారో మీరు తెలియపరచలేదు. కాబట్టి ఆమె రోగ తీవ్రతను అనుసరించి, ఆమెను వెంటిలేటర్‌పై ఉంచుతారు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ పెరిగిన యూరిక్ యాసిడ్‌తో కీళ్లనొప్పి..! నా వయసు 25 ఏళ్లు. ఇంకా పెళ్లికాలేదు. గత మూడు నెలలుగా తీవ్రమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాను. ఒక డాక్టర్గారికి చూపిస్తే, ఆయన పరీక్షలు చేయించి, నా యూరిక్ యాసిడ్ పాళ్లు 6.8 ఎంజీ/డీఎల్ ఉన్నాయని చెప్పారు. పైగా నేను విసర్జనకు వెళ్లినప్పుడు కూడా మూత్రం నుంచి దుర్వాసన వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - తేజస్విని, ఈ-మెయిల్ మీరు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే మీరు ‘గౌట్’ అనే కీళ్లవ్యాధితో బాధపడుతున్నారు. రెండు ఎముకల మధ్యభాగాల్లో (కీళ్లలో) రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లు పెరగడం వల్ల, అవి స్ఫటికాలుగా మారుతాయి. అలా స్ఫటికాల్లా (క్రిస్టల్స్) మారిన యూరిక్ యాసిడ్రాళ్లతో ఎముకల చివరలు ఒరుసుకుపోవడం వల్ల కీళ్లవాపు, కీళ్ల వద్ద తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా స్థూలకాయం (ఒబేసిటీ), ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, రెడ్‌మీట్, సీఫుడ్ వంటి మాంసాహారం తీసుకోవడడం, నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వంటి కుటుంబచరిత్ర ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక కొంతమందిలో సాధారణంగానే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా లక్షణాలు ఏవీ కనిపించకుండానే ‘గౌట్’ వ్యాధి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటివారికి చికిత్స అవసరం ఉండదు. కానీ కీళ్లలో నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే చికిత్స అవసరమవుతుంది. మీరు వెంటనే మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 24 ఏళ్లు. మార్కెంటింగ్ జాబ్‌లో ఉన్నాను. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా ఎడమ మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఎలాంటి పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్‌మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. మాకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపిస్తే ఎక్స్‌రే తీసి, బెణికినట్లు చెబుతున్నారు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కె. సందీప్, కోదాడ మణికట్టు బెణికితే వచ్చే సమస్యలు సాధారణంగా కొద్దివారాలపాటు ఉంటాయి. అయితే మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణమది. కొన్ని చిన్న ఎముకలు విరిగినట్లుగానే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. లేదా మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ ఎండోమెట్రియాసిస్ సాధారణ సమస్యే! నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్‌ను కలిశాను. డాక్టర్‌గారు నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాల గురించి వివరించండి. అలాగే పీరియడ్స్ సమయంలో మళ్లీ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయా? - ఒక సోదరి, హైదరాబాద్ మీలా ఎండోమెట్రియాసిస్ రావడం అన్నది చాలామంది మహిళల్లో కనిపించే చాలా సాధారణమైన విషయం. కొంతమందిలో ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత ఈ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇక కొంతమందిలో మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడం, యోగా వంటి రిలాక్సేషన్ ప్రక్రియలతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతూ నొప్పిని నియంత్రణలో ఉంచవచ్చు. కానీ కొందరిలో నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో మళ్లీ గర్భధారణను కోరుకోని వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖను బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు అవకాశాలను పరీక్షించే కొన్ని రకాల పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల అయ్యేలా (ఒవ్యులేషన్)/ ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) వంటి ప్రక్రియలతో గర్భధారణకు తగిన అవకాశాలే ఉన్నట్లుగా భావించవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతానసాఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సంతాన సాఫల్య చికిత్స చేసే నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.