
ఈసీజీ నార్మల్...అయినా ఛాతీనొప్పి ఎందుకు?
నా వయసు 27 ఏళ్లు. నాకు తరచూ గుండెల్లో పట్టేసినట్లుగా మజిల్ క్రాంప్స్‌లాగానే అనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని రెండుసార్లు ఈసీజీ తీయించాను. గుండెలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఈ లక్షణం తరచూ కనిపిస్తుండటంతో గుండెకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉందేమోనని ఆందోళనగా ఉంది. ఈసీజీ నార్మల్‌గా ఉన్నా నాకు ఎందుకీ నొప్పి వస్తోంది? తగిన పరిష్కారం చూపండి. – మనోజ్‌కుమార్, నల్లగొండ
మీరు చెప్పిన లక్షణాలు కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు తీయించిన ఈసీజీ రిపోర్టుల్లో గుండెకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని రెండు సార్లు రిపోర్టు వచ్చింది కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్, ఈసోఫేగల్ స్పాజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి.
కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఒకసారి జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించండి. ఆయన సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, వ్యాధి నిర్ధారణ జరిగాక సరైన మందులు వాడితే సమస్య దానంతట అదే తగ్గుతుంది.
అవసరమైతే ఆ ఇన్‌హేలర్ ఇస్తారు
నా వయసు 43 సంవత్సరాలు. గత పదిహేడేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. అన్ని రకాల వైద్యప్రక్రియల్లో చికిత్స తీసుకున్నా దేనితోనూ రిలీఫ్ రాలేదు. గత పదేళ్ల నుంచి ఇన్‌హేలర్‌ను వాడుతున్నాను. దాంతో నాకు మంచి ఉపశమనం దక్కింది. అయితే అది రిలీవర్ మాత్రమేనని, ఇంకో ఇన్‌హేలర్ వాడాలని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. ఈ ఇన్‌హేలర్‌తో నాకు మంచి రీలీఫే ఉంది కదా. అయినా కొత్త ఇన్‌హేలర్ వాడాల్సిందేనా? – మంజునాథ్, నెల్లూరు
ఇన్‌హేలర్స్‌లో రెండు రకాలు ఉంటాయి. మొదటివి... ఆస్తమా అటాక్ లక్షణాలు... అంటే దగ్గు, ఊపిరి అందకపోవడం, పిల్లికూతలు రావడం, ఛాతీ బిగుతుగా కావడం వంటి లక్షణాలనుంచి తక్షణ ఉపశమనం ఇస్తాయి. వీటిని రిలీవర్స్ అంటారు. ఇక రెండోవి ఆస్తమా వల్ల వాయునాళాలలో వచ్చిన ఇన్‌ఫ్లమేషన్‌ను తొలగించడంలో సహాయపడేవి. వీటిని ప్రివెంటర్స్ అంటారు.
మొదటిదశలో ఆస్తమా రోగులకు రిలీవర్స్ ప్రిస్క్రయిబ్ చేస్తాం. ఆ రోగులు వారంలో రెండుసార్లు కంటే ఎక్కువగా రిలీవర్ ఇన్‌హేలర్స్ వాడాల్సి వస్తుంటే, ఆ తర్వాతి దశ చికిత్సలో భాగంగా వాటికి తోడుగా ప్రివెంటర్స్‌ను జతచేస్తాం. మీరు చికిత్స తీసుకుంటున్న వైద్య నిపుణుడిని సంప్రదించి ఆయన సూచన మేరకు మీకు అవసరమైన విధంగా ప్రివెంటర్ లేదా ఆయన సూచించిన విధంగా మందులు తీసుకోండి.
బాబు సరిగా తినడు... ప్రోటీన్ ఇవ్వడం ఎలా?
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. చాలా సన్నగా ఉంటాడు. ప్రోటీన్ డైట్ పెట్టమని చాలా మంది చెబుతున్నారు. అయితే మావాడు మటన్‌గానీ, చికెన్‌గానీ ముట్టుకోడు. గుడ్డు లాంటివి కూడా ఇష్టంగా తినడు. వాడికి ప్రోటీన్ ఆహారం ఇవ్వడం ఎలా? చూడటానికి బలహీనంగా కనిపిస్తున్నా చలాకీగా, హుషారుగా ఉంటాడు. మావాడికి ఏదైనా ప్రత్యేక ఆహారం అవసరమా? ఏవైనా వైద్య పరీక్షలు అవసరమా? తగిన సలహా ఇవ్వండి. – కె. మాలతి, కర్నూలు
మీరు చేస్తున్న ఫిర్యాదు చాలా మంది తల్లులే చేస్తుంటారు. అయితే పెరిగే వయసులో ఉన్న పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వడం చాలా అవసరం. దాంతో పాటు తాజాపళ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.
అతడు మాంసాహారం ఇష్టపడటం లేదు కాబట్టి అతడు తినేవాటిల్లోనే ప్రోటీన్లు ఉండే ఆహారం ఇవ్వండి. మాంసాహారంలోనేగాక శాకాహారంలోని పప్పు ధాన్యాలు, మీల్ మేకర్ వంటి సోయా ఉత్పాదనలు, రాగుల వంటి ఆహారపదార్థాల్లో ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవుతాయి. అయితే మీరు చెప్పినదాన్ని బట్టి అతడు బాగా తినకపోవడం అన్నది అతడి ఎదుగుదలకు ఏవిధంగానూ ఆటంకంగా కనిపించడం లేదు కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి.
దాదాపు ప్రతి నెలా జలుబు... ఎందుకిలా?
నా వయసు 26 ఏళ్లు. నాకు దాదాపు ప్రతి నెలా జలుబు చేస్తుంటుంది. జలుబు చేసిన ప్రతిసారీ గొంతు మారిపోయి గరగరగా మారుతోంది. ఒకసారి డాక్టర్‌కు చూపిస్తే అలర్జీ అని చెప్పి మందులు ఇచ్చారు. ఇలా ప్రతి నెలా జలుబు చేయడం వల్ల పనిపాటలకు ఇబ్బంది అవుతోంది. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన పరిష్కారం చూపండి. – మనోజ్ఞ, విజయవాడ
మీరు వివరించిన లక్షణాలను బట్టి మీరు మాటిమాటికీ వస్తున్న ఫ్యారింజైటిస్ లేదా ల్యారింజైటిస్ సమస్యలతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ బాధలకు మూలకారణం అలర్జీ కావచ్చు లేదా ముక్కులో కండపెరగడం కూడా అయి ఉండవచ్చు. మీరు ఒకసారి పల్మొనాలజిస్ట్ లేదా ఈఎన్‌టీ సర్జన్‌లను కలవండి. వారు పరీక్షించి మీ సమస్యను నిర్ధారణ చేస్తారు. దానిమీదే మీ చికిత్స ఆధారపడి ఉంటుంది.
పగటిపూట ఎప్పుడూ ఆవలింతలు...ఎందుకిలా?
నా వయసు 43. నాకు కొద్దికాలంగా ఆందోళన ఎక్కువగా ఉంటోంది. ఏ పనిపైనా ఆసక్తి ఉండటం లేదు. రాత్రిపూట నిద్ర ఉండటం లేదు. పగటివేళల్లో నిద్రవస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడూ ఆవలింతలు వస్తున్నాయి. నలుగురినీ కలవాలన్న విషయమే ఆందోళనకు గురిచేస్తోంది. రక్త, మూత్ర పరీక్షల్లో అంతా మామూలుగానే ఉంది. నాకు ఏవైనా మానసిక సమస్యలు ఉన్నాయేమోనని ఆందోళనగా ఉంది. నాకు మంచి పరిష్కారం సూచించండి. – రమేశ్‌బాబు, ఒంగోలు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీరు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు అనిపిస్తోంది. అది నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు సాధారణ యాంగై్జటీ సమస్య లేదా ఏదైనా ఫోబియాతో బాధపడుతున్నట్లు అనుకోవచ్చు. మీరు ముందుగా ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలా వద్దా అని ఆయన నిర్ణయిస్తారు.
- డాక్టర్ ఎమ్. గోవర్ధన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment