
మగాళ్లు కూడా కొంటున్నారు!
సర్వే
పూర్వం రాజులు కంఠాభరణాలు, హారాలు, కంకణాలు మొదలైనవాటిని ధరించేవారు. రాణిగారితో పోటీ పడినట్లు ఉండేది రాజుల వస్త్రాభరణాల అలంకరణ. అయితే, సామాన్య జనాలకు వచ్చేటప్పటికి స్త్రీలు మాత్రమే ఆభరణాలు ధరించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మగాళ్లూ ఆభరణాల మీద మోజుపడుతున్నారు.
తాజాగా నేషనల్ ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో... పురుషులకు సంబంధించిన ఆభరణాలు, అలంకరణ సామగ్రికి గిరాకీ పెరిగినట్లు తేలింది. అన్ని వయసుల పురుషులూ ఖరీదైన ఆభరణాలను కొంటున్నారట. గుజరాత్ పురుషులు మాత్రం కాయిన్లు, బిస్కట్ల రూపంలో విలువైన బంగారు, ప్లాటినం, వెండి కొంటున్నారు తప్ప ఆభరణాలను కొనడం లేదు. అయితే... ముంబై, అహ్మదాబాద్, బరోడా, పుణె, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, కొచ్చిన్ తదితర ప్రాంతాల్లోని పురుషులు ఆభరణాలు బాగా కొంటున్నారు, ధరిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. బంగారం, వెండి, ప్లాటినం ధరల్లో ఈ పదేళ్లలో వచ్చిన పెరుగుదలకు ఇది కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.