వీడేంటి గుడిని బచాయించేది? | Ghazal Srinivas Is A Lecherous Animal Wearing Spiritual Guise: Victim | Sakshi
Sakshi News home page

వీడినుంచి బచావ్‌

Published Thu, Jan 4 2018 12:04 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

Ghazal Srinivas Is A Lecherous Animal Wearing Spiritual Guise: Victim  - Sakshi

గుడిని కాపాడతాడట... వీడి సంస్థ పేరే సేవ్‌ టెంపుల్‌... ఉద్యోగాన్ని భక్తితో చేసే వాళ్లనే మలినం చేసే రకం. వీడి దుంపతెగ. వీడేంటి గుడిని బచాయించేది? వీడినుంచి ఆడపిల్లల్ని బచాయించాలి అంటుంది ఈ బాధితురాలు. గజల్‌ శ్రీనివాస్‌ చేతిలో లైంగిక వేధింపులకు గురైన ఈ అమ్మాయి సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇది.

‘నలుగురిలో ఉన్నప్పుడు పెద్దమనిషిగా, ఆధ్యాత్మికవేత్తగా చెలామణి అవుతాడు. ఎవరూ లేనప్పుడు అతడిలోని రాక్షసుడు నిద్ర లేచి వేధింపులు ప్రారంభిస్తాడు. ఆ కార్యాలయంలో పని చేసినన్నాళ్ళూ ఒక్కో క్షణం ఒక్కో నరకం అనుభవించా’ అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బుధవారం ఆమె సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ గజల్‌ శ్రీనివాస్‌తో ఎదురైన చేదు అనుభవాలు, తాను అనుభవించిన నరకాన్ని గురించి చెప్పారు. ‘సేవ్‌ టెంపుల్‌ సంస్థ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్ఫూర్తి పొందే జీతంలో పెరుగుదల లేకపోయినా పాత ఉద్యోగం మాని అక్కడ చేరాలని భావించా. సంస్థ చైర్మన్‌ ప్రకాష్‌తోపాటు గజల్‌ శ్రీనివాస్‌ నన్ను ఇంటర్వ్యూ చేశారు.

జూన్‌ 3న ఉద్యోగంలో చేరిన తర్వాత కొంతకాలం చైర్మన్‌ మా కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాతే గజల్‌ శ్రీనివాస్‌ తన నిజస్వరూపం బయటపడింది. ఒక్కసారిగా గర్జించిన సింహంలా మారిపోయి పంజా విసరడం ప్రారంభించాడు. నాలుగు నెలల నుంచి విచిత్రమైన ప్రవర్తన, వెకిలి చేష్టలు ప్రారంభమయ్యాయి. పనివేళలతో నిమిత్తం లేకుండా నన్ను ఆఫీస్‌లో ఉండమనేవాడు. ఇతర ఉద్యోగుల్ని పంపేసి నన్ను ఒంటరిగా ఉంచడానికి చూసేవాడు. ఎవరైనా మహిళా గెస్టులు వస్తే వారితో గంటల తరబడి మాట్లాడేవాడు. ‘వాళ్ళు వెళ్ళేవరకు నువ్వు ఉండాలి’ అనేవాడు. అలా కుదరదని చెప్పినందుకు ఓసారి నోటికొచ్చినట్లు తిట్టాడు. ఏడుస్తున్నా కనికరం లేకుండా ప్రవర్తించాడు.  రెండోరోజు ఆఫీస్‌కు వచ్చిన వెంటనే నేను వెళ్ళిపోతా అని చెప్పా.

‘నాకు పలుకుబడి ఉంది, నేను పంపకుండా నువ్వు వెళ్ళిపోతానంటే ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వను, శాలరీ సర్టిఫికెట్‌ ఇవ్వను. ఒకవేళ అవి వద్దనుకుని వెళ్ళిపోవాలని చూస్తే నిన్ను ఏదో ఒక కేసులో ఇరికిస్తా’ అంటూ బెదిరించాడు. తనకు నచ్చిన ఆడవాళ్ళను ఆఫీస్‌కు తీసుకువచ్చే అతడు... ఆ సమయంలో మాత్రం టైమ్‌ కాకపోయినా కార్యాలయం నుంచి అందరినీ పంపించేసేవాడు. నేను సీఎం పక్క ఉంటా, త్వరలో గవర్నర్‌ అవుతా, నాకు ఎంతో పలుకుబడి ఉందంటూ లోబరుచుకునే ప్రయత్నం చేసేవాడు. చివరలో అతడి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. హత్తుకుందాం... లాంటి మాటలు అనేవాడు. నేను అతడికి లొంగట్లేదని నాపై కక్షకట్టాడు. రేడియో జాకీ అయిన నాతో నానా చాకిరీ చేయించాడు. టిష్యూ పేపర్స్‌ను అపరిశుభ్రంగా చేసి నేలపై పడేసేవాడు. ఆపై బెల్‌ కొట్టి నన్ను పిలిచి ‘స్వచ్ఛ్‌ భారత్‌’ అంటూ అవి కనిపించట్లేదా... తియ్‌ అనేవాడు. అతిథులు తాగిన కాఫీ, టీ కప్పుల్నీ నాతోనే తీయించేవాడు.

ఆడపిల్లలు ఇందుకే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటారా అని అతడు పెట్టే బాధలు చవిచూసినప్పుడు నాకు అనిపించింది. దీంతో రెండు నెలల పాటు చివరకు అన్నం తినేప్పుడూ ఏడుస్తూనే ఉన్నా. నాకు నమ్మకమైన స్నేహితులకు విషయం చెప్తే ఉద్యోగం మానేయమని అన్నారు. తోటి ఉద్యోగులకు చెప్తే ఆయనతో ఎందుకు పెట్టుకుంటావ్‌ అనే వాళ్ళు. ఆయన భార్య కొన్నాళ్ళ క్రితం వరకు ఆఫీస్‌కు వచ్చినా.. ఆపై మానేశారు. ‘మేడం మీరు రాకపోతే ఆఫీస్‌ మరో రకంగా ఉంటోంది’ అని ఆమెకు పరోక్షంగా హెచ్చరించి చెప్పినా ప్రయోజనం లేదు. తన నిజస్వరూపం బయటకు తెలియకూడదనే అన్నీ గదిలోనే చేస్తుంటాడు. కన్నతండ్రిలాంటి వెలగపూడి ప్రకాశరావు గారికి కూడా ద్రోహం చేశారు.

ఆ ఆఫీస్‌లో పని చేసే పార్వతి ‘‘నువ్వంటే సార్‌కు ఇష్టం... సహకరిస్తే అన్నీ చూసుకుంటాడు’’ అనేది. రోజులు గడిచేకొద్దీ వేధింపులు శృతిమించాయి. నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే నా తర్వాత వచ్చే మరో అమ్మాయి బలవుతుందని భావించా. నాలా మరొకరు బలి కాకూడదంటే గజల్‌ శ్రీనివాస్‌కు బుద్ధి చెప్పాలనుకున్నా. ఎంతో పేరున్న మనిషి కాబట్టి బయటకు వచ్చి ‘అసలు విషయం’ చెప్తే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందుకే సాక్ష్యాధారాలతో అతడి నిజస్వరూపాన్ని సమాజానికి చూపించాలి అనుకున్నా. పెద్దమనిషి ముసుగులో చాలా చిన్నపనులు... అకృత్యాలు చేసే గజల్‌ శ్రీనివాస్‌ చాలా సెక్యూర్డ్‌గా ఉంటాడు. ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకనీయడు. అందుకే స్టింగ్‌ ఆపరేషన్‌ చేయడానికి పెద్ద గ్రౌండ్‌ వర్క్‌ చేశా. కార్యాలయంలోని అతడి బెడ్‌రూమ్‌లోనూ మంచం మినహా ఇంకేమీ ఉండవు. అయినప్పటికీ ధైర్యం చేసి స్పై కెమెరా ఏర్పాటు చేశా. విషయం పసిగడితే నన్ను అక్కడే చంపేస్తాడని తెలుసు. అందుకే నాకు నమ్మకమైన ఓ స్నేహితురాలికి విషయం చెప్పా– ఏ రోజైనా నేను ఆఫీస్‌ నుంచి తిరిగి రాకపోతే... ఫలానా చోట కెమెరా పెట్టాను తీసుకోండి అని సూచించా.

పక్కా ఆధారాల కోసమే నేను ఈ మధ్య ఆయన పిలిచినప్పుడు గదిలోకి వెళ్ళి కాళ్ళు నొక్కడం, ముట్టుకోవడం చేశా. ఇదంతా కెమెరాలో రికార్డు అవుతుందనే చేశా. పోలీసుల వద్దకు వెళ్ళేప్పుడు భయపడ్డా. అయితే ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ నాకు ధైర్యం చెప్పారు. నేను చేసిన సాహసానికి న్యాయం చేస్తూ గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. వారితోపాటు తెలంగాణ పోలీసుకి ఎంతో రుణపడి ఉన్నా. సాధారణంగా ఓ ఆడపిల్ల తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని మౌనంగా భరిస్తుంది తప్ప బయటకు  చెప్పుకోలేదు. తెగించి అలా చెప్పిందంటే అవి శృతిమించాయని, నిజమని నమ్మాల్సిందే. నేను ఇన్ని ఆధారాలు, వీడియోలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా కొందరు అనుమానిస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో మరో బాధితురాలు బయటకు వచ్చేందుకు కూడా ధైర్యం చేయదు. మృగాళ్లకు చెక్‌ పడదు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది. ఆమెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే– అని అంతా ఆలోచించాలి. ఇది కేవలం శృతి తప్పడం కాదు... తీవ్రమైన అపశృతి. ఆయనకు పరిచితులైన కళాకారులు ముందు ఆశ్చర్యపోతారు, ఆ తరవాత ఈ దుర్బుద్ధి ఎలా పుట్టిందా అనుకుంటారు. మహిళలందరూ తమని తాము కాపాడుకోవడానికి బయటకు రావాలని చెబుతున్నాను. పోలీసులకు ధన్యవాదాలు చెబుతున్నాను.

గజల్‌ శ్రీనివాస్‌ను తమ సంస్థ ప్రచార బాధ్యతల  నుంచి తీసేస్తున్నట్లు ‘సేవ్‌ టెంపుల్‌’ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు  వెలగపూడి ప్రకాశ్‌రావు ప్రకటించారు.

గతి తప్పిన గజల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement