
పెళ్లితో ఒక అమ్మాయి భార్య అవుతుంది, ఒక అబ్బాయి భర్త అవుతాడు. అప్పటి వరకు వాళ్లిద్దరూ తల్లిదండ్రుల ముద్దుల సంతానమే. భర్త హోదా రాగానే బాస్ అనుకుంటాడా? పెళ్లితో అమ్మాయి తనను తాను తగ్గించుకుని ఒదిగి ఉండాలా? నిజానికి పెళ్లి పరమార్థంలో ఇలా ఏమీ చెప్పలేదు. భార్యభర్త స్నేహితుల్లా ఉండాలని, గృహస్థ జీవనంతో పిల్లలను కని, మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మాత్రమే చెప్పింది పెళ్లి. మధ్యలో ఎప్పుడో లౌక్యమైన సవరణలతో భర్త అంటే ఆదేశించేవాడు, భార్య అంటే అనుసరించాల్సిన ప్రాణి అనే భావజాలం రాజ్యమేలింది. సమాజంలో స్త్రీ ప్రాధాన్యం తగ్గడం మొదలైంది కూడా అప్పుడే. ఆ వివక్షపూరితమైన మార్పును స్వాగతించిన తరాలు అంతరించాయి. ఆ పునాదుల మీద కరడు గట్టిన తరాలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాయి.
పేగుబంధం
పాపాయి ఏడిస్తే లాలించడానికి తల్లి రావాలి. తల్లి ఆ క్షణంలో రాలేకపోతే నానమ్మ, మేనత్త, పెద్దమ్మ, చిన్నమ్మ ఎవరో ఒకరు వస్తారు. ఇది ఉమ్మడి కుటుంబాల్లో. ఇప్పుడన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. భార్య కూరగాయలు తరుగుతున్నప్పుడు పాపాయి ఏడిస్తే... చేతులు కడుక్కుని ఎత్తుకున్నా సరే... మిర్చి, ఉల్లిపాయల ఘాటు పాపాయి ఒళ్లు మండుతుంది. ఇదంతా చూస్తూ ఉన్న భర్త తాను మగాడినని ఊరుకోలేడు. భర్త అనే భేషజాన్ని భుజం మీద నుంచి తీసి పక్కన పెట్టి బిడ్డను భుజానికెత్తుకుంటాడు. ‘వీడు డయాపర్ వేయనివ్వకుండా కాళ్లు ఒకటే ఆడిస్తున్నాడు చూడు’ అంటూ భార్యకు కంప్లయింట్ చేస్తూ నాలుగు నెలల కొడుకు చేయిస్తున్న విన్యాసాలన్నీ చేస్తుంటాడా భర్త. మరో ఇంట్లో... భార్య బిడ్డకు పాలిస్తుంటే, భర్త వంట చేస్తున్నాడు. భార్య వంట చేసి ఆఫీస్‌కి రెడీ అవుతుంటే తాను బాక్సులు సర్దుతున్నాడు. ఇది ట్వంటీ ట్వంటీకి చేరువవుతున్న ఈ తరం విద్యావంతుల కుటుంబ ముఖచిత్రం.
నలిగిన బంధం
భార్య– భర్త బంధం కొన్ని తరాల పాటు ఆధిపత్యానికి– అణిగిమణిగి ఉండడానికి మధ్య నలిగిపోయింది. సున్నితత్వం మేళవించిన పెంపకం, న్యూక్లియర్ కుటుంబాలతో వర్క్‌షేరింగ్ అలవడింది. భర్తలో సున్నితత్వం బయటికొచ్చింది. భార్య పట్ల రెస్పెక్ట్ పెరుగుతోంది. భార్య హోదా తనకంటే పెద్దదైనప్పుడు ఇంటి నాలుగ్గోడల మధ్య ఆమెను మానసికంగా వేధించిన ఒకప్పటి కురచ మనసులు కనుమరుగవుతున్నాయి. మార్పు మొదలైంది. ఈ మార్పు ఉమెన్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది కానీ, నిజానికిది హ్యూమన్ ఫ్రెండ్లీ సమాజ నిర్మాణానికి దారి తీస్తున్న మార్పు.
– వాకా మంజులారెడ్డి
అలాంటి పెళ్లి వద్దన్నాను
నరేన్ (సుప్రియ భర్త) నాకు ఇంటి పనుల్లో షేర్ చేసుకోవడం, పిల్లలను కేర్‌టేకింగ్‌తోపాటు అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తాడు. ప్రతిదీ ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. ‘పెళ్లి అంటే... భర్త అంటే బాస్‌లా ఉంటాడు, భార్య తన అభిప్రాయాలను భర్త నిర్ణయాలకు అనుగుణంగా మార్చుకుంటూ జీవించాలనేదే అయితే... ఆ పెళ్లి నాకు వద్దు’ అని పెళ్లికి ముందే చెప్పాను. మా పెళ్లి 2007లో జరిగింది. మేమిద్దరం ఉద్యోగం చేస్తాం. మాకు ఇద్దరు పాపలు. నా జాబ్ టైమింగ్స్‌ని బట్టి తను, తన వర్క్ షెడ్యూల్స్‌ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాం. భర్త ఎక్కడా అడ్జస్ట్ కాకూడదు, అడ్జస్ట్ కావాల్సింది భార్యే అనే ధోరణి మా ఇంట్లో ఉండదు. భార్యాభర్త అంటే మంచి ఫ్రెండ్స్. మా నుంచి మా పిల్లలూ అదే నేర్చుకుంటారు కదా!
– సుప్రియ, ఫిజికల్ థెరపిస్ట్,
వర్జీనియా, అమెరికా
Comments
Please login to add a commentAdd a comment