మనషు దోచుకున్నాడు | Gitam University Campus celebrations... | Sakshi
Sakshi News home page

మనషు దోచుకున్నాడు

Published Wed, Oct 22 2014 12:50 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

మనషు దోచుకున్నాడు - Sakshi

మనషు దోచుకున్నాడు

గీతం యూనివర్శిటీ క్యాంపస్ సందడిగా ఉంది. బీటెక్ క్లాసు అప్పుడే అయిపోయింది. విద్యార్థులంతా బయటికొచ్చారు. ఓ కుర్రాడు మాత్రం బస్సెక్కిఅనకాపల్లిలో దిగాడు. తిన్నగా తండ్రి నడుపుతున్న మిఠాయి దుకాణానికెళ్లాడు. తండ్రిని ఇంటికి పంపి వ్యాపారం చూసుకున్నాడు. మర్నాడే విమానంలో అమెరికాకు బయల్దేరాడు. సిలికాన్ వ్యాలీలో స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన బిజినెస్ మీట్‌కు హాజరయ్యాడు. ప్రమాదాల నుంచి అంధుల్ని అప్రమత్తం చేసేందుకు తాను రూపొందించిన షూను పరిచయం చేశాడు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముగిసింది. అంతా నిశ్శబ్దం. అందరి ముఖాల్లో ఆశ్చర్యం. అభినందనల వర్షం. అమెరికాలోని నోబెల్ గ్రహీతలు, 120 ప్రముఖ వ్యాపార సంస్థల సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టుల ప్రశంసలందుకున్న ఆ కుర్రాడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన ఇంకూలు కృష్ణ సాయి. అనకాపల్లిలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన 21 ఏళ్ల ఈ యువ మేధావి అమెరికా వరకూ సాగించిన విజయ ప్రస్థానానికి అక్షర రూపమిది.
 
విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా అంధులకు చేతికర్ర తప్ప మరే సౌకర్యం లేదు. కాళ్లకడ్డంగా కాలసర్పం ఉన్నా తెలుసుకోలేరు. బండరాయి దొర్లుకొస్తున్నా తప్పుకోలేరు. తోడుంటే తప్ప రోడ్డు దాటలేరు. వాళ్ల కోసం ఏదైనా చేయాలి... కానీ ఎలా?... విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) చదువుతున్న కృష్ణ సాయి నిరంతరం మధనపడేవాడు. అప్పుడే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చన్న సిద్ధాంతాన్ని పరిశీలించాడు. దాన్ని అభివృద్ధి చేసి అంధుల కోసం ప్రత్యేకంగా షూ తయారు చేయాలి. అది ధరిస్తే ఎదురుగా ఏదైనా ఉంటే తెలుసుకోగలగాలి... ఇదే లక్ష్యంతో కృష్ణసాయి పరిశోధన ప్రారంభమైంది. అది కార్యరూపం దాల్చేందుకు రెండేళ్లు పట్టింది.
 
అడ్డొస్తే అప్రమత్తం చేసే ‘టపార్చ్’
మార్కెట్లో దొరికే యాక్షన్ షూకి సెన్సర్ అమర్చాడు. షూ అడుగు భాగంలో కాస్త వెడల్పుగా ఉండే సోల్ ఏర్పాటు చేశాడు. దాన్లో చిప్‌ను, అల్యూమినియంతో తయారైన స్టిక్‌ను అమర్చాడు. అంధులు షూ ధరించి నడిచేటప్పుడు ఎదురుగా ఏదైనా వస్తువు ఉంటే వెంటనే సెన్సర్ పసిగడుతుంది. ఆ సమాచారాన్ని షూ అడుగు భాగంలో అమర్చిన చిప్‌కు తెలియజేస్తుంది. చిప్ మోటార్ ద్వారా యాక్టివేట్ అయిన అల్యూమినియం స్టిక్ లోపలి నుంచి కాలిని సున్నితంగా తట్టి అప్రమత్తం చేస్తుంది.

రెండు సెంటీమీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏ వస్తువున్నా హెచ్చరిస్తుంది. షూను డిజైన్ చేసేటప్పుడు అనకాపల్లికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గున్నేశ్వర్ సాయి, విశాఖలోని అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉష దాట్ల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. ఎలక్ట్రానిక్స్, కోడింగ్‌కు గీతం ల్యాబ్ టెక్నీషియన్ స్వరూప్ సహకరించారు. షూ ప్రాజెక్టుకు ‘టపార్చ్’ అని పేరు పెట్టాడు. ఆంగ్లంలో  Tap అంటే తట్టడం... Arch అంటే వంపు. కాలి పాదాన్ని పక్కనుంచి చూస్తే ఒంపులా కనిపిస్తుంది. ఆ భాగంలో తట్టి అప్రమత్తం చేస్తుంది కాబట్టి రెండు పదాలను కలిపి ‘టపార్చ్’ అని నామకరణం చేశాడు.
 
స్టాండింగ్ ఒవేషన్
ఖరగ్‌పూర్ ఐఐటీ జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రోడక్ట్ డిజైనింగ్ పోటీలకు తొలిసారిగా షూ ప్రాజెక్టును పంపించాడు. పోటీలకు దేశవ్యాప్తంగా అందిన 200కు పైగా ప్రాజెక్టుల్లో టాప్ 5 డిజైనర్‌గా కృష్ణ సాయి ఎంపికయ్యాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రొటేసియా అంతర్జాతీయ సదస్సుకు రోటరాక్ట్ సభ్యుడి హోదాలో హాజరయ్యాడు. ‘నేను ప్రదర్శించిన షూ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం మరచిపోలేని అనుభవం’ అన్నాడు కృష్ణసాయి.
 
టాప్ టెన్‌లో ఒకడు
భారత సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఫిక్కీ, ఇండో-అమెరికన్ సైన్స్ టెక్నాలజీ ఫోరం, స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్, ఐసీ-2 ఇనిస్టిట్యూట్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్ (ఐఐజీపీ)ను నిర్వహించారు. దీనికి భారతదేశ వ్యాప్తంగా 2500 ప్రాజెక్టులు అందాయి. వాటిలో అత్యుత్తమంగా నిలిచిన 50 ప్రాజెక్టుల్లో కృష్ణసాయి షూ ప్రాజెక్టు కూడా ఉండటంతో అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ గోవాలో నిర్వహించిన వారం రోజుల శిక్షణకు ఎంపికయ్యాడు.  ఫిక్కీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో టాప్ 10లోనూ స్థానం దక్కించుకున్నాడు. ఈ విజయంతో వాషింగ్టన్‌లోని కాస్మోస్ క్లబ్ సదస్సుకు, కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో సెప్టెంబర్ 8న స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించే బిజినెస్ మీట్‌కు ఆహ్వానం అందుకున్నాడు.
 
యువ మేధావికి నోబెల్ గ్రహీతల అభినందన

ఫిక్కీ ఎంపిక చేసి పంపిన టాప్ టెన్ భారతీయ ప్రతినిధుల బృందంలో 21 ఏళ్ల కృష్ణసాయిని చూసి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ముచ్చటపడ్డారు. అమెరికాలోని నోబెల్ బహుమతి గ్రహీతల ముందు ప్రదర్శించిన షూ ప్రాజెక్టుకు ప్రశంసలు దక్కాయి. ఆఖరుగా సిలికాన్ వ్యాలీలో బిజినెస్ మీట్‌కు హాజరయ్యాడు. అంధుల కోసం షూ తయారు చేయడం అమెరికన్ వ్యాపారవేత్తలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు కృష్ణసాయికికొన్ని వ్యాపార మెళకువలు నేర్పారు. అంధుల షూ తయారీకి కంపెనీ ఏర్పాటు చేస్తే సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
 
నాన్న కల నెరవేరుస్తా

‘‘అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కదా... నీ కల సాకారమైనట్టేనా?’’ అని కృష్ణసాయిని ప్రశ్నిస్తే ‘‘ఇదంతా నా తండ్రి నాగేశ్వరరావు ఘనతే. ఆయన చదివింది ఆరో తరగతి. కానీ నన్ను అష్టకష్టాలు పడుతూ చదివించారు. నన్ను ఉన్నత స్థాయిలో చూడాలన్న ఆయన కల నెరవేరుస్తా. అంధులకు రూ.1500 నుంచి రూ.1800 మధ్యలో షూ తయారు చేసి అందిస్తా. అదే నా లక్ష్యం’’ అన్నాడు. అల్ఫ్రెడ్ లార్డ్ వైట్ హెడ్ చెప్పినట్టు ‘గొప్ప స్వాప్నికుల కలలెప్పుడూ నిజం మాత్రమే కావు. అవి నిజాన్ని అధిగమిస్తాయి’.
 - ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 
‘గీతం’ ప్రోత్సాహకం
‘కృష్ణసాయి లాంటి విద్యార్థి మా విశ్వవిద్యాలయంలో చదువుకోవడం గర్వకారణం. అతని ప్రతిభకు గుర్తింపుగా మా చైర్మన్ ఎం.వి.వి.ఎస్.మూర్తి రూ.1.4 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు’.. అని గీతం విశ్వవిద్యాలయం పీఆర్వో, అసిస్టెంట్ ప్రొఫెసర్ నండూరి నరసింహం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement