సిపాయి చిన్నోడు!
‘బోర్డర్‌లోకి వెళ్లి, సోల్జర్స్‌ని చూస్తా’ అన్నాడు. ‘సరే’ అంది అమ్మ. ‘సై’ అన్నాడు నాన్న! ఆర్మీ కూడా పర్మిషన్ ఇచ్చింది! అంతే. ఎడారిలో ఈ చిన్నారి కల పండింది! సరిహద్దు కంచెల దాకా వెళ్లాడు. తుపాకీ పట్టి పహారా కాశాడు. శతఘ్నుల్ని గురి చూశాడు. ‘ఇంత కష్టమా!’ అని ప్రతి సైనికుడికీ సెల్యూట్ కొట్టాడు. ‘త్వరలో నేనూ వస్తా. మన దేశాన్ని కాపాడే డ్యూటీ చేస్తా’ అని... బంగారు వర్ణంలో మెరిసిపోతున్న జైసల్మేర్ ఇసుకను గుప్పెట్లోకి తీసుకుని ముద్దాడాడు.
సరిహద్దు సైన్యం రేయింబవళ్లు మునివేళ్లపై దేశానికి పహారా కాస్తుంటుంది. తొమ్మిదేళ్ల పిల్లవాడు రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇచ్చేంత వ్యవధి సైన్యానికి ఉంటుందా అన్నది సందేహమే. అదికూడా, ‘మీరు అక్కడ ఎలా పనిచేస్తారో చూడాలని ఉంది’ అని వెళ్లిన విజ్ఞప్తి! సాధారణంగా అలాంటి ఉత్తరం డస్టబిన్‌లోకి వెళుతుంది. లేదా, ‘సారీ’ అనే రిప్లయ్ వస్తుంది. అయితే రవికర్‌కు సానుకూలమైన తిరుగు సమాధానం వచ్చింది! హైదరాబాద్‌లో ఐదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి రాసిన లేఖకు సరిహద్దు భద్రతాదళం డైరెక్టర్ జనరల్ కె.కె.శర్మ స్పందించి, అతడిని జైసల్మేర్‌కు ఆహ్వానించారు! రవికర్ కోరిక మేరకు సైనిక విధులను దగ్గరగా చూసే అవకాశం కల్పించారు.
భారత్–పాక్‌ల మధ్య సరిహద్దు పట్టణ ప్రాంతం జైసల్మేర్. సరిహద్దు భద్రతా బలగాలు (బిఎస్‌ఎఫ్) శత్రువు కదలికలను గమనిస్తూ అనుక్షణం అక్కడ నిర్విరామంగా గస్తీ కాస్తుంటాయి.
ఆ గస్తీకి దీటుగా ఎండలూ కాస్తుంటాయి. అంతేకాదు, రాజస్థాన్‌లోని ఈ ఎడారి ప్రాంతపు ఉష్ణోగ్రతలు ఏమాత్రం స్థిరంగా ఉండవు. ఇసుక 25–49 డిగ్రీల మధ్య వేడెక్కి, చల్లబడుతుంటుంది. ఈ మార్పులు మానవదేహానికి ఏమంత హితమైనవి కావు. అకస్మాత్తుగా వడగాలులు వీస్తుంటాయి. ఇసుక తుపానులు రేగుతుంటాయి. అంతటి కఠినమైన పరిస్థితులను తట్టుకుని నిలబడి, దేశానికి రక్షణగా నిలుస్తారు సరిహద్దు సైనికులు.
ఏ సరిహద్దులోనైనా జవానుల విధులు క్లిష్టంగానే ఉంటాయి కానీ, భౌగోళికంగా జైసల్మేర్ సరిహద్దు మరింత ప్రతికూలమైనది. ఈ సంగతిని పేపర్లలో చదివి, టీవీలలో చూసి తెలుసుకున్న రవికర్‌కు సైనికులంటే భక్తిభావం ఏర్పడింది. నిజమైన హీరోలంటే సినిమాల్లో కనిపించేవాళ్లు కాదు, సైనికులేనని అనుకున్నాడు. వాళ్లు ఎలా ఉంటారో? ఏం చేస్తుంటారో దగ్గరగా చూడాలనుకున్నాడు. తల్లిదండ్రుల చొరవతో రవికర్‌కు ఆ అవకాశం వచ్చింది. మార్చి చివరివారంలో రవికర్ ప్రత్యేక ఆహ్వానంపై జైసల్మేర్ వెళ్లి సైనికులతో పాటు తను కూడా కాసేపు సరిహద్దుకు పహారా కాశాడు! రవికర్ ఉత్సాహం చూసి శర్మ ముచ్చట పడ్డారు.
రవికర్ జైసల్మేర్‌లో నాలుగు రోజులు ఉన్నాడు. ఆ సమయంలో నార్త్ సెక్టార్ డి.ఐ.జి. అమిత్ లోధా రవికర్‌తో మాటలు కలిపారు. అవకాశం వస్తే తప్పకుండా సైన్యంలో చేరి, దేశాన్ని రక్షిస్తానని ఆ చిన్నారి చెప్పడం శర్మను సంతోషానికి, ఉద్వేగానికి లోను చేసింది. రవికర్‌కు ధనానా, మురార్, టనాట్, బబ్లియాన్ సరిహద్దు కేంద్రాలను చూపించారు.రవికర్ తల్లిదండ్రుల స్వస్థలం చిత్తూరు చిల్లాలోని మండ్యంవారిపల్లి. తండ్రి నరసింహారెడ్డి, తల్లి ఇందిర. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రవికర్ బాచుపల్లిలోని వికాస్ కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నాడు.
తుపాకీ చేతపట్టి పహారా...
కమెండోతో...