దేవుడికి ఐదు నిమిషాలు టైమ్ ఇచ్చాడు!
నమోనాస్తికా!
రాబర్ట్ ఇంగర్‌సాల్ (1833-1899) తెలివిగల లాయర్. అమెరికా అంతర్యుద్ధ యోధుడు. రాజకీయ నాయకుడు. మంచి వక్త. ఆలోచనాపరుడు. ఇవన్నీ అలా ఉంచితే, పరమ నాస్తికుడు. ‘ది గ్రేట్ ఏగ్నాటిస్ట్’ అని ఆయనకు పేరు. ఏగ్నాటిస్ట్ అంటే దేవుడి ఉనికిపై స్పష్టమైన ఒక అభిప్రాయం లేనివాడు. ప్రసంగాల్లో తరచు ఆయన దేవుడికి సవాల్ విసురుతుండేవారు! దైవదూషణ మహాపాపమనీ, అందుకు దేవుడు శిక్ష విధిస్తాడనీ బైబిల్‌లో రాసి ఉన్న వచనాలను శ్రోతలకు గుర్తుచేసి, ఇప్పుడు చూడండి నేను ఏం చేయబోతున్నానో అనేవాడు.
జేబులో ఉన్న బంగారు వాచీని బయటికి తీసి తన ముందున్న బల్ల మీద పెట్టేవాడు. ‘‘నేనిప్పుడు దేవుడిని దూషించబోతున్నాను. దూషించాక, దేవుడికి ఐదు నిమిషాలు టైమిస్తాను. ఆలోపు అతడు నన్ను శిక్షించాలి. అంటే ఇక్కడికిక్కడ నేను చనిపోవాలి’’ అని చెప్పి, అందరూ వినేలా దేవుడిని దూషించేవాడు.
ఒక నిమిషం గడిచేది. రెండు నిమిషాలు గడిచేవి. మూడో నిమిషంలో జనంలో కలకలం బయల్దేరేది. కొందరు మహిళలైతే ఏం చూడబోతామోనని భయంతో స్పృహతప్పి పడిపోయేవారు. నాలుగు నిమిషాలు గడిచేవి. చివరికి ఐదు నిమిషాలూ పూర్తయ్యేవి. రాబర్ట్‌కి ఏమీ అయ్యేది కాదు. ‘‘చూశారా, దేవుడు లేడు. ఉండి ఉంటే ఈ సరికి నేను చనిపోయి ఉండాలి కదా’’అని ప్రశ్నించేవాడు. ఇదీ ఆయన వరస.
ఈ సంగతి లండన్‌లో ఉండే జోసెఫ్ పార్కర్ అనే మతబోధకుడి వరకూ వెళ్లింది. రాబర్ట్ ఇంగర్‌సాల్ అనే వ్యక్తి ఇలా దైవ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని ఎవరో చెప్పగానే ఆయన చిరునవ్వుతో - ‘‘దేవుడు ఐదు నిమిషాల్లోనే సహనం కోల్పోతాడని ఆ అమెరికన్ పెద్దమనిషికి ఎందుకు అనిపించిందో మరి’’ అన్నాడు. ఆ విషయం తెలిసి రాబర్‌ట తన దూకుడు తగ్గించుకున్నాడు.