
సౌరశక్తితో మన అవసరాలన్నీ తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకోవడంలో ఇబ్బందులు బోలెడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రట్గర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు బంగారు సాయం తీసుకున్నారు. అదేనండీ,.. నానోస్థాయి బంగారు కణాలను జోడిస్తే నీటి నుంచి ఉదజనిని వేరు చేయడం నాలుగు రెట్లు సమర్థంగా జరిగిపోతుందట. ఉదజనికి – సౌరశక్తికి ఏమిటి సంబంధం అనే డౌట్ వస్తోందా? చాలా సింపుల్. నీటిని విడగొట్టడం ద్వారా ఉదజనిని ఉత్పత్తి చేసేందుకు సౌరశక్తి కావాలి.
దీంట్లో ఉండే అతినీలలోహిత కిరణాలను ఉపయోగించుకుని నేరుగా ఉదజనిని ఉత్పత్తి చేసేందుకు అనువుగా బంగారు నానో కణాలను వాడారు. ఇప్పటివరకూ ఈ పని చేయాలంటే ఇంకో ఉత్ప్రేరకం అవసరం ఉండేది. ఒకసారి ఉత్పత్తి అయిన తరువాత ఉదజనిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చునన్నది తెలిసిందే. సౌరశక్తి విషయంలో ఎప్పుడు ఉత్పత్తి అయితే అప్పుడే వాడుకోవాలి. ఈ కొత్త పద్ధతి ప్రస్తుతం ఉపయోగిస్తున్నదాని కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ సమర్థంగా పనిచేస్తుందని, ఫలితంగా సౌరశక్తిని పరోక్షంగానైనా చౌకగా నిల్వ చేసుకునే వీలు ఏర్పడిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫాబ్రిస్ తెలిపారు.