కొలువుదీర్చే కోర్సులకు పేరొందిన సంస్థలు | good institutes for job oppurtunities | Sakshi
Sakshi News home page

కొలువుదీర్చే కోర్సులకు పేరొందిన సంస్థలు

Published Mon, Jan 20 2014 12:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కొలువుదీర్చే కోర్సులకు పేరొందిన సంస్థలు - Sakshi

కొలువుదీర్చే కోర్సులకు పేరొందిన సంస్థలు

 టీఐఎఫ్‌ఆర్, ఎన్‌డీఆర్‌ఐ, ఐఐఎస్‌ఈఆర్, సీఈసీఆర్‌ఐ, సీఎల్‌ఆర్‌ఐ.. వీటి పూర్తిపేర్లు మనకు ఠక్కున గుర్తుకురాకపోవచ్చు. కానీ ఈ ఇన్‌స్టిట్యూట్స్ అందించే అద్భుతమైనజాబ్ ఓరియెంటెడ్ కోర్సులు, సాగిస్తున్న పరిశోధనల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు చుక్కలు చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. స్వల్ప ఖర్చుతోనే అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఐటీ, ప్యూర్ సెన్సైస్, సైన్స్ అనుబంధ కోర్సులు, సోషల్ సెన్సైస్, స్పోర్ట్స్ కోర్సులను పూర్తి చేయొచ్చు. పలు విభాగాల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్న పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్స్ దేశవ్యాప్తంగా 100కు పైగా ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌పై ప్రత్యేక ఫోకస్..
 
 అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్స్
 అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ జీడీపీలో 1 శాతం మేర వ్యవసాయ రంగ పరిశోధనలపై వెచ్చిస్తుంటే.. భారత్ మాత్రం 0.5 శాతం మాత్రమే కేటాయిస్తోంది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ దేశంలో ఎక్కువ మంది జీవనోపాధికి ఆధారం.. వ్యవసాయ, అనుబంధ రంగాలే! వ్యవసాయ దిగుబడులు పెంచడం.. సగటు ఉత్పత్తిని అధికం చేయడం.. అన్ని స్థాయిల్లో సామర్థ్యాల పెంపు అనేది వ్యవసాయ రంగంలో అత్యవసరంగా మారింది. అందుకే పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లు వ్యవసాయోత్పత్తులు పెంచే దిశగా పరిశోధనలు నిరంతరం కొనసాగాల్సి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలకు చీడపీడలు సోకకుండా చూడటం, భూసారం తగ్గితే అందుకు సరిపడ ఎరువుల వాడకం, భూసారం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పంట దిగుబడి పెంచేందుకు అవసరమైన జాగ్రత్తలు.. తదితర అంశాలపై మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పలు వ్యవసాయ పరిశోధన సంస్థలను నెలకొల్పింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్  రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో.. అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ సెన్సైస్, ఫిషరీస్ సంబంధిత ఇన్‌స్టిట్యూట్స్ 99 వరకూ పనిచేస్తున్నాయి. వీటిలో పలు ఇన్‌స్టిట్యూట్స్ దీర్ఘకాలిక అకడెమిక్ కోర్సులను అందిస్తున్నాయి. అగ్రికల్చర్ సంబంధిత పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్(సీఐఎఫ్‌ఈ) అత్యధికంగా 7 మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ఫారెస్ట్రీ కోర్సులను అందించడంలో పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
 
 సోషల్ సెన్సైస్ ఇన్‌స్టిట్యూట్స్
 
 ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ‘సోషల్ సెన్సైస్’లో ఇప్పుడు కొత్త వెలుగు కనిపిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) నిధుల ద్వారా నడుస్తున్న 27 సంస్థలు సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి ఉన్నత సంస్థలు అందించే సోషల్ సెన్సైస్ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా కెరీర్ పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. పరిశోధనల పరంగా ఐసీఎస్‌ఎస్‌ఆర్ సామాజిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సంప్రదాయేతర శక్తి వనరులు, సామాజిక భద్రత, పేదరికం, నిరుద్యోగం, పారిశ్రామికాభివృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి ప్రక్రియ, మేధో సంపత్తి హక్కులు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే మరికొన్ని సోషల్ సెన్సైస్ సంస్థలు.. అభివృద్ధిలో రాజకీయ భాగస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ విధానాలు, గిరిజనుల అభివృద్ధి, గ్రామీణ-వ్యవసాయం, పర్యావరణం వంటి వాటి అధ్యయనానికి ప్రాధాన్యమిస్తున్నాయి.
 
 స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్స్
 
 శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంతోపాటు మంచి భవిష్యత్తును అందించే కెరీర్ ఆప్షన్.. స్పోర్ట్స్. సత్తా ఉంటే పేరుకు పేరు, డబ్బుకు డబ్బును అందించే కెరీర్ ఇది. ఇందులోకి అడుగుపెట్టాలంటే స్పోర్ట్స్ మ్యాన్ లేదా ప్లేయర్‌గా మారేందుకు సిద్ధంగా ఉండాలి. సుదీర్ఘ అనుభవం తర్వాత కూడా ఉన్నత స్థానాలను అందుకునేందుకు అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. కామేంటేటర్‌గా, రిఫరీగా, స్పోర్ట్స్ జర్నలిస్టుగా అవకాశాలు పొందొచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్పోర్ట్స్ కెరీర్‌లో ముందుండాలంటే.. తీవ్రంగా శ్రమించేతత్వం, సహనం చాలా అవసరం. స్పోర్ట్ కెరీర్‌లో అథ్లెట్, అథ్లెటిక్ కోచ్ వంటి విభాగాల్లో స్థిరపడొచ్చు. ప్రస్తుతం కొత్త కొత్త స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటవుతుండటం, వివిధ రూపాల్లో పోటీల(ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్; ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్- ఐబీఎల్ వంటివి) నిర్వహణ ఎక్కువ కావడంలో ఈ రంగంలో యువతకు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం వివిధ సంస్థలు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నత స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. లక్ష్మీబాయ్ నేషనల్ యూనివర్సిటీ (గ్వాలియర్), కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (తిరువనంతపురం).. బీపీఈడీ, ఎంపీఈడీ వంటి పూర్తిస్థాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్, పాటియాలా).. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్. ఈ సంస్థ వివిధ క్రీడల స్పెషలైజేషన్లతో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ అందిస్తోంది. దేశంలో ప్రభుత్వ రంగంలోని క్రీడల సంస్థల్లో ‘పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్’ కోర్సును అందిస్తున్న సంస్థ ఇదొక్కటే. ఇందులో స్పోర్ట్స్ టెక్నిక్స్, స్పోర్ట్స్-గాయాలు వంటి వాటిపై పరిశోధనలు జరుగుతుంటాయి.
 
 సైన్స్ అనుబంధ ఇన్‌స్టిట్యూట్స్
 
 మన దేశం 19వ శతాబ్దంలోనే తయారీ రంగంలో ప్రవేశించింది. అయినా, కొత్త టెక్నాలజీ అభివృద్ధిలో ఇతర దేశాల కంటే పెద్దగా ముందంజ వేయలేదు. అయితే, ఈ పరిస్థితిలో క్రమేణా మార్పు వస్తోంది. ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(డీఎస్‌ఐఆర్) తన వంతు కృషి చేస్తోంది. డీఎస్‌ఐఆర్ ఏర్పాటు చేసిన మొత్తం 44 జాతీయ లేబొరేటరీల్లో 12 చోట్ల అకడెమిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎల్‌ఆర్‌ఐ), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సీఐపీఈటీ) ముఖ్యమైనవి. సీఎల్‌ఆర్‌ఐ మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు నుంచి నాలుగైదేళ్ల పీహెచ్‌డీ కోర్సు వరకూ అందిస్తోంది. మరో ప్రతిష్టాత్మక సంస్థ సీఐపీఈటీ.. సరికొత్త బయోడి గ్రేడబుల్ ప్లాస్టిక్ టెక్నాలజీపై ప్రధానంగా దృష్టిసారిస్తూ.. ప్లాస్టిక్ పరిశ్రమకు అవసరమైన కోర్సులను అందించడంలో ముందుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(ఐఐసీబీ-కోల్‌కతా), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ-హైదరాబాద్).. పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. నేషనల్ కెమికల్ లేబొరేటరీ(ఎన్‌సీఎల్) అప్లయిడ్ కెమికల్ ఇంజనీరింగ్ స్టడీస్‌లో ఉత్తమ కేంద్రంగా పేరుగాంచింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ తదితర సంస్థలూ అటు రీసెర్చ్‌తోపాటు ఇటు అకడెమిక్ ట్రైనింగ్‌పైనా దృష్టిపెడుతున్నాయి. మానవ వనరుల అభివృద్ధిలో ఐఐపీ, ఎన్‌ప్డీటీఐలు విభిన్నమైన శిక్షణను అందించే దిశగా కృషి చేస్తున్నాయి.
 
 
 హెల్త్‌కేర్ అండ్ మెడి సిన్ ఇన్‌స్టిట్యూట్స్
 దేశంలో వైద్య విద్య గురించి ఆలోచించగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది.. ఏఐఐఎమ్‌ఎస్-ఢిల్లీ; పీజీఐ ఎంఈఆర్-చండీగఢ్; జిప్‌మర్- పాండిచ్చేరి. నిజానికి 40కి పైగా ఇన్‌స్టిట్యూట్స్ ఈ హెల్త్‌కేర్ విభాగంలో ఉన్నాయి. మెడికల్ డయాగ్నసిస్, చైల్డ్ డెవలప్‌మెంట్, రిహాబిలిటేషన్, సైకియాట్రీ, ఇమ్యూనాలజీ, మెంటల్ హెల్త్, పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్‌లో పలు కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో అధికశాతం హెల్త్‌కేర్ అండ్ మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్స్.. టీచింగ్‌తోపాటు హెల్త్‌కేర్‌పై ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. చాలా తక్కువ ఇన్‌స్టిట్యూట్‌లు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ వంటివి మాత్రమే పరిశోధనల దిశగా కృషిచేస్తున్నాయి. కేరళలోని శ్రీ చిత్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ మొదట మెడికల్ కాలేజీగా ఏర్పాటై.. ఆ తర్వాత క్రమేణా విస్తరించి ప్రస్తుతం 12 మెడికల్ విభాగాల్లో, 18 పారా మెడికల్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తోంది. మెడికల్ రంగంలో రీసెర్చ్, డెవలప్‌మెంట్‌లో మన దేశం నేటికీ వెనుకబడే ఉందని చెప్పొచ్చు.
 
 ప్యూర్‌సైన్స్ ఇన్‌స్టిట్యూట్స్
 సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయుడు సి.వి. రామన్ మాత్రమే. సమీప భవిష్యత్‌లో సైన్స్ లో భారత్‌కు నోబెల్ బహుమతి రావాలని ఆశించడం అత్యాశే అవుతుందంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి దేశంలో సైన్స్ విభాగంలో పేరెన్నికగన్న పలు పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. బేసిక్ సెన్సైస్‌కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన సంస్థ.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్). టాటా ట్రస్ట్ ఏర్పాటుచేసిన ఈ ఇన్‌స్టిట్యూట్.. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థగా పనిచేస్తోంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో అంతర్జాతీయస్థాయి పరిశోధనలు కొనసాగిస్తూ.. డాక్టోరల్, పోస్ట్‌డాక్టోరల్ కోర్సులను అందిస్తోంది. అదేవిధంగా బేసిక్ సెన్సైస్‌లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంలలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)లను ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు 10+2 విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. అత్యాధునిక లేబొరేటరీలు, సౌకర్యాలు ఉన్న ఐఐఎస్‌ఈఆర్‌లు సెన్సైస్‌లో నాణ్యమైన విద్యను బోధిస్తున్నాయి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లలో ప్రపంచస్థాయి కోర్సులు, పరిశోధనలు సాగించే సంస్థలూ ఉన్నాయి. ఫిజిక్స్‌కు సంబంధించి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం(ఐఐజీ), సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్(ఎస్‌ఐఎన్‌పీ)లు జియోమ్యాగ్నటిజం, న్యూక్లియర్ ఎనర్జీపై ఫోకస్ చేస్తున్నాయి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్(ఐఎమ్‌ఎస్).. కంప్యుటేషనల్ మ్యాథమెటిక్స్, థియొరెటికల్ కంప్యూటర్ సైన్స్‌పై దృష్టి పెడుతోంది. ఈ ఇన్‌స్టిట్యూట్స్ వివిధ అంశాల్లో పరిశోధనలు చేస్తుండటంతో సైన్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులకు స్వర్గధామంగా మారాయి. మనదేశంలో ఇలాంటి కొన్ని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నా.. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు సైన్స్ పరిశోధనల పరంగా మనం ఇంకా ఎంతో వేగంగా పురోగతి సాధించాల్సి ఉంది. భారతరత్న సీఎన్‌ఆర్ రావు మాటల్లో చెప్పాలంటే... ‘‘అకడెమిక్ పరంగా సైన్స్ విభాగంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకునే దిశగా మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది’’

ఉపాధికి ఢోకాలేని కోర్సులు
 
 ఆటోమొబైల్ రంగం విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. కంప్యూటర్ రంగం మరింత పురోగమించనుంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అందించే కోర్సులు పూర్తిచేసిన వారు స్వల్ప వ్యవధిలోనే మంచి అవకాశాలు అందుకుంటున్నారు. సీఐటీడీలో లాంగ్‌టర్మ్ -3, షార్ట్‌టర్మ్ కోర్సులు-4, మిగిలినవి పోస్ట్
 డిప్లొమా కోర్సులు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ టెక్నికల్ అంశాల్లో శిక్షణ విద్యార్థులకు పూర్తి భరోసానిస్తుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వందశాతం విజయావకాశాలున్నాయి. రూ.15వేల నుంచి రూ.25వేల వరకూ ప్రారంభ వేతనం లభిస్తుంది. ప్రభుత్వరంగంలో లభిస్తున్న శిక్షణ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం.
 
 - షుజాయత్‌ఖాన్,
 ప్రిన్సిపల్ డెరైక్టర్ (సీఐటీడీ)
 
 ఆర్థిక మాంద్యం తాకని ఉద్యోగాలు
 ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఐటీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలు ఉద్యోగులను తీసేశాయి. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొలువు గ్యారంటీ అని ధైర్యంగా ఉండగలిగేది మాత్రం ఆరోగ్య, వైద్యరంగాల్లో పనిచేస్తున్నావారే. ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో న్యూట్రిషన్, డైటిటిక్స్ కోర్సులకు క్రేజ్ పెరిగింది. వీటిని ఓర్పు, సహనం గల యువతీ, యువకులకు మంచి కెరీర్‌గా కూడా చెప్పొచ్చు. పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో కేవలం పరిశోధనలు, ప్రయోగాలే కాకుండా స్వల్ప, దీర్ఘకాల కోర్సులను అందిస్తున్నాం. ఆసుపత్రులు, కార్పొరేట్ సెక్టార్‌లోనే కాకుండా ఆహార ఉత్పత్తుల రంగానికి పోషకాహార నిపుణుల అవసరం ఎంతో ఉంది. జాతీయ పోషకాహార సంస్థల్లో స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులే కాకుండా పరిశోధనలు చేసేందుకు అనువైన అవకాశాలున్నాయి. ఆరు నెలల వ్యవధి నుంచి రెండేళ్ల కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది.        - కల్పగం పోలాస,
             డెరైక్టర్, ఎన్‌ఐఎన్, హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement