మళ్లీ ఒకసారి...
గాసిప్
బాలనటిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఊర్మిళ మటోంద్కర్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ భాషల్లో కథానాయికగా తన ప్రతిభ చాటుకుంది. ‘రంగీల’ ‘సత్య’ ‘మనీ మనీ’ ‘అనగనగా ఒకరోజు’... ఇలా ఆమె కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.
గ్లామర్ పాత్రలే కాదు నాన్‌గ్లామర్ పాత్రలను పండించడంలో కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. ‘పింజార్’ సినిమాలో హమిదా పాత్రలో ఆమె నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. విక్రమ్ భట్ ‘స్పీడ్’ తరువాత మాత్రం ఆమె కెరీర్ స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. ఫరాఖాన్ ‘ఓమ్ శాంతి ఓం’లో ఒక పాటలో కనిపించింది. ఆ తరువాత ఊర్మిళను ప్రత్యేకంగా గుర్తుంచుకునే సందర్భం, సినిమా ఏదీ రాలేదు.
ఇక ఆమె బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లే అనుకున్నారు చాలామంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, వెండితెరపై ఊర్మిళ మరోసారి తన సత్తా చాటనుందని! ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన విందుకు హాజరైంది ఊర్మిళ. కరణ్ జోహర్, జోయా అక్తర్...మొదలైన వారు కూడా ఈ విందుకు హాజరయ్యారు. అందరూ ఏకకంఠంతో అన్నమాట ఏమిటంటే-‘‘ఊర్మిళలో గ్లామర్ పెరిగిందేగానీ తరగలేదు’’ అని! ఊర్మిళ కోసం కరణ్ జోహర్ మంచి కథ ఒకటి సిద్ధం చేశాడట. అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరిగితే...ఈ రంగీలా పిల్ల మరోసారి వెండితెరపై కనువిందు చేయవచ్చు!