గోల్డ్ అండ్ గ్లామరస్ మనీష్ మల్హోత్రా @ 50
మనీష్ మల్హోత్రా అనేవాడు ఇప్పటికిప్పుడు రిటైర్ అయితే బాలీవుడ్‌లో సగం మంది ఇళ్ల నుంచి బయటకు రారు. సగం మంది సినిమాలు ఒప్పుకోరు. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్న దాని కంటే అంద విహీనంగా కనిపించి, అసలు రంగు బయటపెట్టేసుకుంటారు. అవును. మనీష్ మల్హోత్రా రెండు విధాలుగా బాలీవుడ్‌ను ప్రభావితం చేస్తున్నాడు. ఒకటి: ఫ్యాషన్ డిజైనర్‌గా, రెండు: కాస్ట్యూమ్ డిజైనర్‌గా. హిందీ సినిమాలను ‘రంగీలా’కు ముందు ‘రంగీలా’కు తర్వాత అని విభజిస్తారు కాస్ట్యూమ్ రంగంలో. ఎందుకంటే ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళా మాతోండ్కర్ కాస్ట్యూమ్స్‌ను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశాడు.
ఆ కాస్ట్యూమ్స్ అన్నీ బాలీవుడ్‌ని చాలా ఆకర్షించాయి. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు మనీష్ కాస్ట్యూమ్స్‌తో కొత్త అందాలను సంతరించుకున్నారు. ‘దిల్ తో పాగల్ హై’లో మాధురీ దీక్షిత్, ‘కుఛ్ కుఛ్ హోతాహై’లో కాజోల్, ‘కహో నా ప్యార్ హై’లో అమీషా పటేల్ వీళ్లంతా హిట్స్ సాధించారు. అయితే కరణ్ జోహార్ భారీ కాస్ట్యూమ్ డ్రామా ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాతో మనీష్ పేరు మార్మోగింది. ఆ తర్వాత అప్పటి నుంచి మొన్నటి ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ వరకూ మనీష్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకే కాస్ట్యూమ్స్ సిద్ధం చేసే మనీష్ ‘మొహబ్బతే’ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు.
‘చిన్నప్పటి నుంచి నాకు రంగుల మంచి చెడ్డలు తెలుసు. మా అమ్మ ఏదైనా నప్పని చీర కట్టుకుంటే ‘అమ్మా... ఈ చీర కాకుండా వేరే చీర కట్టుకోవచ్చుగా’ అని ప్రాణం తీసేసేవాణ్ణి’ అంటాడు మనీష్. ‘చెట్టు, పుట్ట, ఆకులు, మనుషులు, ప్రకృతి - అన్నీ నన్ను బట్టల రూపకల్పనలో ప్రభావితం చేస్తాయి. ఎవరైనా కష్టపడాల్సిందే. నేనే ఇవాళ ఎంత కష్టపడి ఎంత మంచి డిజైన్‌ను తయారు చేశానా అనేదే చూస్తూ ఉంటాను’ అంటాడతను.
ఫ్యాషన్ డిజైనర్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌కు పని తీరులో మార్పు ఏముంటుంది? అని అడిగితే ‘ఫ్యాషన్ డిజైనర్‌గా నా ఊహకు హద్దులు ఉండవు. ఆ స్త్రీ ఏ బట్టల్లో ఎంత అందంగా గొప్పగా ఉంటుందో ఆలోచిస్తాను. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌కు పరిధి ఉంటుంది. ఫలానా సినిమాలో ఫలానా పాత్రకు తగినట్టుగా ఆ హీరోయిన్‌ని అందంగా చూపించాలి. ‘చమేలీ’ సినిమాలో కరీనా కపూర్ వేశ్య పాత్ర పోషించింది. ఆ పాత్రకు తగినట్టుగా, అంటే ఒక వేశ్యకు తగినట్టుగా ఆమె దుస్తులను సిద్ధం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఫలించి మంచి పేరు వచ్చింది’ అంటాడు మనీష్.
ఈ తపన ఉండటం వల్లే మనీష్‌ను బాలీవుడ్‌లో అందరూ ఇష్టపడతారు. డిసెంబర్ 6న జరిగిన బర్త్‌డే పార్టీకి మహామహులు అందుకే తరలి వచ్చారు. షారుఖ్ ఖాన్, సయీఫ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, విరాట్ కోహ్లి, అనుష్కా శర్మ... ఇలా రానివాళ్లంటూ లేరు. ఆ రాత్రి ముంబాయి రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతూ మురిసిపోతూ ఉండిపోయింది.