పోరాడి మరీ సాధించుకున్నారు
పోరాడి మరీ సాధించుకున్నారు
Published Mon, Oct 7 2013 12:00 AM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM
దేశంలో దసరా నవరాత్రులు సందడిగా, ఘనంగా జరిగే ప్రాంతాల్లో కోల్‌కతా కూడా ముఖ్యమైనది. అక్కడ కొలువైన కాళీమాతకు ప్రతియేటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కోల్‌కతాలోని ప్రతివీధిలోనూ మంటపాలు ఏర్పాటు చేసి కాళీమాత ప్రతిమలను పెట్టుకొని పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయంలోని కాళీమాతకు తోడు వీధుల్లోని కాళీ మాత మంటపాలు కోల్‌కతాకు కొత్త కాంతిని తీసుకు వస్తాయి. ఆ మహానగరంలో భిన్నమైన వర్గాల ప్రజలు తమకు చేతనైంత స్థాయిలో, ఇష్టమైనట్టుగా నవరాత్రుల వేడుకలను జరుపుకొంటారు. ఇది ఎన్నో యేళ్లుగా జరుగుతున్న ప్రక్రియే. ఈ మంటపాల విషయంలో ప్రభుత్వం, పోలీసులు కూడా సహకారాన్ని అందిస్తుంటారు. అయితే నవరాత్రి వేడుకల నిర్వహణ విషయంలో అందరికీ సహకారం అందించే పోలీసులు సోనాగంజ్ ప్రాంతంలోని కొంతమంది మహిళలు నవరాత్రి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పెట్టుకున్న విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చారు. అనుమతిని ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీనికి వారు చెప్పిన కారణం ఒక్కటే.. ‘మీరంతా సెక్స్‌వర్కర్లు. అందుకే అనుమతిని ఇవ్వడం లేదు...’ అవును.. సోనాగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న ఆ మహిళలంతా సెక్స్‌వర్కర్లే.
కోల్‌కతాలో ప్రసిద్ధి పొందిన రెడ్‌లైట్ ఏరియా ’సోనాగంజ్’. అక్కడ పడుపువృత్తిలో ఉన్న మహిళలు నవరాత్రి మంటపాన్ని ఏర్పరుచుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై దుర్బర్ మహిళా సమన్యాయ సమితి(డీఎమ్‌ఎస్‌సీ) కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి ఇవ్వకపోవడం గురించి పోలీసు శాఖను ప్రతివాదులుగా చేర్చి వారు న్యాయపోరాటం చేసి మరీ, అనుమతిని సాధించుకొన్నారు. ఈ సందర్భంగా కోర్టు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి వారిలోని అనర్హత ఏమిటో చెప్పాలని పోలీసులను ప్రశ్నించింది. అయితే ఎటువంటి సమాధానం లేదు వారిదగ్గర. దాంతో, తానే చొరవ తీసుకుని, నవరాత్రి మంటపాలు ఏర్పాటు చేయడం గురించి మార్గదర్శకాలను పరిశీలించి సెక్స్ వర్కర్లు ఏర్పాటు చేయదలిచిన మండ పానికి అనుమతి మంజూరు చేసింది. ఈ విధంగా దుర్గమ్మను కొలవడానికి సోనాగంజ్ మహిళలు అనుమతి సాధించుకొన్నారు.
Advertisement
Advertisement