బట్టతలతో చిక్కేమీ ఉండదుగానీ... చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో అన్న బెంగే ఎక్కువ. అందుకే బట్టతలకు చికిత్స అంటే చాలు.. చాలామంది వేలకువేలు పోసి నూనెలు కొంటూంటారు. కష్టమైనా.. నొప్పి ఎక్కువ ఉన్నా... హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కూ సిద్ధమవుతూంటారు. ఇకపై ఈ బాదరబందీలేవీ వద్దంటున్నారు ఇండియానా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు. శరీరంలో... ఏ కణంగానైనా మారగల సామర్థ్యమున్న మూలకణాలతో తాము పరిశోధనశాలలో వెంట్రుకలతో కూడిన ఎలుక చర్మాన్ని సృష్టించగలిగామని వారు ప్రకటించారు.
మూలకణాలతో ఇది సాధ్యమేనని చాలాకాలంగా అనుకుంటున్నప్పటికీ వాస్తవంగా చేసి చూపింది మాత్రం వీరే. ప్రొఫెసర్ కార్ల్ కోహ్లెర్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల లక్ష్యం బధిరత్వానికి చికిత్స కనుక్కోవడం అయినప్పటికీ ఈ క్రమంలో మూలకణాలు చర్మం తాలూకూ కణాలను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించడంతో బట్టతల సమస్యకు పరిష్కారం దొరికింది.
ప్రత్యేకమైన మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన ఒకే ఒక్క చర్మపు మొగ్గ (ఇంగ్లీషులో బడ్ అంటారు) అటు చర్మపు పైపొరతో పాటు లోపలి పొర అయిన డెర్మిస్‌ను కూడా సృష్టించగలదని, ఫలితంగా ఎలుకల శరీరంపై జరిగినట్లే వెంట్రుకలు మొలుస్తున్నట్లు వీరు గుర్తించారు. వేర్వేరు రకాల చర్మ కణ కుదుళ్లు (ఫోలికల్స్) తయారవుతూండటం ఇంకో విశేషం. మొత్తం మీద ఈ పద్ధతి బట్టతలకు మాత్రమే కాకుండా.. సూక్ష్మరూపంలో ఉండే అవయవాలను తయారు చేసేందుకూ ఉపయోగించవచ్చునని కోహ్లెర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment