నా వయసు 56. నేను చాలాకాలంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నాను. మా పిల్లలలోనూ ఇదే సమస్య ఉన్నట్లు తెలిసింది. తగ్గేందుకు మార్గాలు చెప్పండి.
– ఆర్. కళ్యాణి, విశాఖపట్నం
ఇటీవల నగరాలలో థైరాయిడ్ సమస్యలు పెరుగుతోంది. ఈ సమస్య వచ్చేందుకు దోహదపడే అనేక కారణాల్లో... నగరాలలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు థైరాయిడ్ సమస్యలకు ఒక కారణం అని చెప్పవచ్చు. థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే కీలకమైన గ్రంథి. ఇది స్రవించే హార్మోన్‌లు మానసిక ఆలోచనలపై ప్రభావం చూపుతాయి.
ఈ గ్రంథి టీ4, టీ3, టీఎస్‌హెచ్ హార్మోన్లను స్రవిస్తుంది. సున్నిత మనస్తత్వం కలవారు, ప్రతి చిన్న విషయాన్నీ మనసుకి తీసుకునేవారిలో ఈ గ్రంథి స్రవించే హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటుంది. టీహెచ్‌ఎస్ ఎక్కువ అవడం వల్ల అతిగా బరువు పెరగడం, అతి ఆలోచన, బద్దకం, మతిమరపు, అతినిద్ర వచ్చే అవకాశం ఉంది. స్త్రీలలో రుతుస్రావ సమస్యలు, గర్భం రాకుండా ఉండేందుకు వాడే మందులు, పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు వాడే మందుల వల్ల థైరాయిడ్‌పై దుష్ప్రభావాలు పడి, దానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
తల్లిదండ్రులకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలలోనూ ఆ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే థైరాయిడ్ సమస్యలన్నీ ఒకేలా ఉండవు. హార్మోన్ స్రావం పెరిగితే ఒకలా, తగ్గితే మరొకలా, నాడ్యూల్స్ వస్తే ఇంకోలా లక్షణాలు కనిపిస్తాయి. హోమియోలో ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు.
చికిత్స: లక్షణాలను బట్టి ఆర్సినిక్ ఆల్బ్, కాల్కేరియా కార్బ్, ఓపియమ్, నేట్రమ్‌మూర్ వంటి మందులను ఇస్తారు. అయితే వ్యక్తి తాలూకు శారీరక, మానసిక లక్షణాలను బట్టి ఇచ్చే ఈ మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
–డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్