గార్డియన్ ఏంజెల్ ... ఆ జన్యువు!
మెడిక్షనరీ
ఇక మనం ఒక కొత్త నినాదాన్ని అందుకుందాం. అదే... జీనో రక్షతి రక్షితః. అంటే... అత్యంత ప్రత్యేకమైన ఆ జన్యువును మనం రక్షించుకుంటే క్యాన్సర్ బారి నుంచి అది కాపాడుతుంది. అత్యంత ప్రత్యేకమైన ఆ జన్యువు (జీన్) పేరు రక్షించే దేవత. మానవ దేహంలో ఎన్నో జన్యువులు ఉన్నాయి. మరి ఈ జన్యువుకే ఈ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే... ఇది మన శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిలో క్యాన్సర్ నుంచి ప్రత్యేకమైన రక్షణ ఇస్తుంది. సాధారణంగా పి-53 అని వ్యవహరించే ఈ జన్యువుకు రక్షించే దేవత అని పేరు.
జీనోమ్ గార్డియన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇంత విలువైన జన్యువును మన చేజేతులారా మనమే దెబ్బతీసుకుంటున్నాం. వేళకు సరిగా భోజనం చేయపోవడం, ఆహారంలో తగినన్ని తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోకపోవడం, నిత్యం వ్యాయామం చేయకపోవడం, మద్యం, పొగతాగే అలవాటు లాంటి దురలవాట్లు ఉండటం వంటి అనారోగ్యమైన జీవనశైలితో ఈ విలువైన జన్యువును దెబ్బతీసుకుంటున్నాం. అందుకే ఆరోగ్యమైన జీవనశైలిని అనుసరించి, విలువైన ఈ జన్యువును రక్షించుకోవడం అవసరం.