ఆడేందుకు ఎవరూ దొరక్కపోతే కొడుకుతోనే.. | Gulabi And Green Gang in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

గులాబీ గ్రీన్‌

Published Fri, Aug 16 2019 8:26 AM | Last Updated on Fri, Aug 16 2019 8:30 AM

Gulabi And Green Gang in Uttar Pradesh - Sakshi

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చెవుల్ని చేతుల్లోకి తీసుకోవచ్చు. చెప్పిన మాట వినకుంటే పిల్లల చెవుల్ని మెలేసినట్లే.. భార్యని వేధించవద్దని, వ్యసనాల జోలికి వెళ్లొద్దని,తాగుడు మానేయమనీ ఎంత చెప్పినా వినని మగాళ్ల చెవి పిండి, చెడు వదిలించేందుకు యూపీలో గ్రామాల్లో కొత్తగా ‘గ్రీన్‌ గ్యాంగ్‌’ అనే మహిళా దళం ఊపిరి పోసుకుంది. పదమూడేళ్ల క్రితం అదే రాష్ట్రంలో ఆవిర్భవించిన ‘గులాబీ గ్యాంగ్‌’కు సిస్టర్‌ గ్యాంగ్‌..ఈ గ్రీన్‌ గ్యాంగ్‌.

ఇంటి పని పూరై్తంది. ఆశాదేవి బట్టలు మార్చుకుని బయటికి వచ్చింది. ఆమె ఇప్పుడు ఆకుపచ్చ రంగు చీరలో ఉంది. ఆ చీర ఆమె ఆయుధం. ఆమెను మాత్రమే కాపాడే ఆయుధం కాదు, ఊళ్లోని ఆడవాళ్లందరికీ రక్షణ! ఆశాదేవి వేరే ఏ బట్టల్లో ఉన్నా ఊళ్లోని మగాళ్లు ఉలిక్కిపడరు. ఆకుపచ్చ చీరలో కనిపించిందంటే ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు. గ్రీన్‌ గ్యాంగ్‌ లీడర్‌ బయటికి వచ్చిందని ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుంటారు. గ్యాంగ్‌ లీడర్‌ బయటికి వచ్చిందంటే నూటాయాభై మంది వరకు ఉన్న ఆ గ్యాంగ్‌ ఊళ్లో ఎక్కడో మగవాళ్లను ‘చక్కబెడుతోందనే’!

ధైర్యం.. ధీమా.. భరోసా!
పవిత్ర పుణ్యభూమి అయిన వారణాసికి దగ్గరలో ఉంది గ్రీన్‌గ్యాంగ్‌ ఉన్న ఊరు. పేరు ఖుషియారీ. ఆడపిల్లలకు, ఆడవాళ్లకు అనువైన ఊరు కాదది! అసలు ఆడపిల్ల తల్లి గర్భంలోంచి భూమ్మీద పడడమే ఆ ఊళ్లో కనాకష్టం. పుట్టాక పెరగడం ఇంకా కష్టం. పెరుగుతుంది కానీ.. ఆమెకో జీవితం ఉండదు. పెళ్లీ అవుతుంది. తన మాటకు విలువ ఉండదు. ఆమె తరఫున అత్తమామలే మాట్లాడతారు. ఆమె ఇష్టాలను, అయిష్టాలను వదిన మరదళ్లే నిర్ణయిస్తారు. అలాంటి ఊళ్లో.. ఇంటి పనయ్యాక పచ్చచీర కట్టుకుని బయటికి వచ్చింది ఆశాదేవి. పొలం పనులు ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకున్న మరో ఇరవై మంది మహిళలు ఆ వెంటనే ఆమెను అనుసరించారు. వాళ్లంతా కూడా ఆకుపచ్చ చీరలో ఉన్నారు. అది వాళ్ల యూనిఫారం. ఊళ్లోని మహిళలకు, పిల్లలకు ధైర్యాన్ని, భరోసాను, నమ్మకాన్ని ఇచ్చే రంగు. తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ఆ రంగును చూస్తే భయం. జూదం ఆడే మగాళ్లకు వణుకు. పేకముక్కలు అక్కడే పడేసి వెనక్కైనా చూడకుండా పారిపోతారు. తల్లి మొత్తుకుంటున్నా పిల్లల్ని స్కూలుకు పంపకుండా పనికి తరిమేసే తండ్రుల భరతం కూడా పడుతుంది గ్రీన్‌ గ్యాంగ్‌.

గ్యాంగ్‌ సభ్యులతో గులాబీ గ్యాంగ్‌ లీడర్‌ సంపత్‌పాల్‌ దేవి
మార్పు కోసం ఒకటయ్యారు
ఖుషియారీ గ్రామంలోని మగాళ్ల ప్రధాన కాలక్షేపం ‘మూడు ముక్కలాట’. దేశంలో జూదం ఆడటం నిషేధం. కానీ ఖుషియారీలో మగాళ్లు చెట్ల కింద, గట్ల మీద కండువాపై ముక్కలు వేసుకుని కూర్చుంటారు! ఆడేందుకు ఎవరూ దొరక్కపోతే కొడుకుతోనే ‘కాయ్‌ రాజా కాయ్‌’ అంటాడు తండ్రి. ఆ గ్రామంలోని షీలాదేవి ఆవేదన కూడా ఇదే. తండ్రి చెడిపోయాడు. కొడుకునూ చెడగొడుతున్నాడు. ఏం చేస్తుంది మరి? గ్రీన్‌ గ్యాంగ్‌లో చేరింది! ఇంట్లో అంతా పని చేస్తే కానీ రోజు గడవదు. షీలాదేవి భర్త çపనికి వెళ్లడు. ఆమె నాలుగు రూపాయలు సంపాదించుకొస్తేనే ఆ రోజుకి ఇంట్లో పొయ్యి వెలిగేది. షీలాదేవికి ఆడపిల్లలూ ఉన్నారు. ఖుషియారీలో ఆడపిల్లలను అచ్చంగా గుండెలపై కుంపటిలానే చూస్తారు. దేశం మారుతున్నా ఖుషియారీ మారడం లేదు. అందుకే ఆ ఊరి ఆడవాళ్లు మారదలచుకున్నారు. అడ్డదిడ్డంగా ఉండి కుటుంబాల్లో కల్లోలం రేపుతున్న మగాళ్లకు ముందుగా చెప్పి చూస్తారు. వినకుంటే ‘గుర్తుండిపోయేలా’ చెప్తారు. ఏ ఇంట్లోనైనా ఒక పురుషుడు అశాంతి సృష్టిస్తుంటే ఆ సమాచారాన్ని గ్రీన్‌ గ్యాంగ్‌ ఇచ్చి పుచ్చుకుంటుంది. అతడిని పంచాయితీకి రమ్మని పిలుస్తారు. ‘మీరు పిలిస్తే వచ్చేదేంటి?’ అని అతడు భీష్మించుకుని కూర్చుంటే వీళ్లే వెళ్తారు. ఊరికే వెళ్లరు. చేతుల్లో కర్రలతో వెళ్తారు. మరీ కర్రలు అవసరం లేని కేస్‌ అయితే బెదిరించి బుద్ధి చెబుతారు. జూదశాలలపై దాడులు చేయడం, గుడుంబా కుండల్ని బద్దలు కొట్టడం.. వీటి కన్నా కూడా.. మారని మగాళ్లను దారిలోకి తెచ్చేందుకే వీళ్లు ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తోంది.

చదువుకున్నవారి సహకారం
గ్రీన్‌ గ్యాంగ్‌లో కొందరు కరాటే తెలిసిన మహిళలు కూడా ఉన్నారు! పరిస్థితి చెయ్యి దాటినప్పుడు వట్టి చేతులతో టాస్క్‌ని ఫినిష్‌ చేసేస్తారు. ఇదేమీ పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు. కానీ ఖుషియారీలో మహిళలు ఇలా సంఘటితం అవడం కష్టమైన సంగతే. కట్టుబాట్లపరంగా స్త్రీల పట్ల వివక్షకు మారు పేరు ఖుషియారీ. గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు గృహహింసకు, గృహ లైంగికహింసకు గురవుతున్నారు. వివాహిత మహిళల్లో మూడింట ఒక వంతు మంది భర్తల చేతుల్లో భౌతిక, లైంగిక హింసను అనుభవిస్తున్నారు. పట్టణాలతో పోల్చి చూస్తే గ్రామాల్లోని మహిళలపైనే ఈ హింస ఎక్కువగా ఉంటోంది. అలాంటి గ్రామాలకు ఒక ముఖచిత్రం ఖుషియారీ. అయితే ఈ నివేదికల్లో చూపించేదాని కన్నా ఎక్కువగానే మహిళలపై హింస జరగుతోందని గ్రీన్‌ గ్యాంగ్‌కు తెలియందేమీ కాదు. ప్రభుత్వం వైపు నుంచి మహిళల రక్షణ, భద్రతలకు జరిగేది జరుగుతున్నా, ఏ గ్రామానికి ఆ గ్రామంలో బాధితుల తరఫున మహిళలూ పూనుకుంటే తప్ప మగాళ్లలో మార్పు రాదని గ్రీన్‌ గ్యాంగ్‌ నిశ్చయించుకుని స్త్రీలను, పిల్లలను కాపాడే ఉద్యమానికి నడుం కట్టింది.

గ్రీన్‌ గ్యాంగ్‌ సభ్యులకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పిస్తున్న వలంటీర్లు
స్వయంగా ఆశాదేవి కూడా ఒక బాధితురాలే. రోజూ తాగొచ్చి భార్యను అదొక అలవాటుగా బాదేవాడు! ఆమె తలను గోడకేసి కొట్టేవాడు. రక్తం కారేది. నొప్పిని ఆలాగే భరిస్తుండేది కానీ ఏనాడూ ఎదురు తిరగలేదు. కానీ ఒకరోజు పిల్లల ముందు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. ఆ చెయ్యిని అక్కడే ఆపేసింది ఆశాదేవి. నిర్ఘాంతపోయాడు. పిల్లల కళ్లల్లో సంతోషం. అమ్మ కూడా ఎదిరించగలదు. అమ్మకూడా ఎదురు తిరగగలదు. అంతే. నాన్నంటే భయం పోయింది. అమ్మంటే గౌరవం పెరిగింది. ఈ విషయం ఆశాదేవి గ్రహించింది. ఊళ్లో తన దొక్కటే కుటుంబం కాదు. తనొక్కతే బాధితురాలు కాదు. పిల్లల్ని తండ్రి ప్రేమగా చూసుకోవచ్చు. కానీ వాళ్ల కళ్లముందే తల్లిని అవమానిస్తే, అగౌరవపరిస్తే వాళ్లూ బాధితులే అవుతారు. ఈ దుస్థితిని తన పిల్లలకు తొలగించిన ఆశాదేవి, తనలాంటి వారే మరికొందరితో కలిసి ఊళ్లోని బాధిత మహిళల కోసం, వారి పిల్లల కోసం ‘గ్రీన్‌ గ్యాంగ్‌’ ఆవిర్భావానికి తోడ్పడింది. ఒక గ్యాంగ్‌ గా ఏర్పడడానికి వీళ్లకు స్ఫూర్తిని ఇచ్చింది మాత్రం కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్లలోని వలంటీర్‌లు ఊళ్లోకి వచ్చి, స్త్రీల హక్కుల గురించి చెప్పి వెళ్లిపోయారు. అరె.. హక్కులుండీ హక్కులు లేనట్లు పడివుండటం ఏంటని అనుకున్నారు ఖుషియారీ మహిళలు. విద్యార్థులలోనే కొందరికి కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలతో పరిచయాలున్నాయి. అలా దివ్వాంశు ఉపాధ్యాయ్‌ అనే సేవా సంఘం నిర్వాహకుడు కొంతమంది యువ వలంటీర్‌ల చేత స్థానిక మహిళలకు చట్టాలపై, సెక్షన్‌లపై అవగాహన కల్పించాడు. ముఖ్యంగా పోలిస్‌ కంప్లయింట్‌ ఎలా ఇవ్వాలో చెప్పించాడు. ఆ తర్వాతి నుంచి ఊళ్లో  మగాళ్లపై కేసులు నమోదవడం మొదలైంది. భర్తపై భార్య పెట్టిన కేసులే వాటిల్లో ఎక్కువ! తర్వాతి స్థానం జూదం ఆడేవారిది, తాగొచ్చి కొట్టేవాళ్లది, గుడుంబా కాసేవాళ్లదీ. ఊళ్లో ఇప్పుడీ పచ్చరంగు చీరల్లోని ఆడవాళ్లు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌గా మహిళల్ని, బాలికల్ని కాపుకాస్తున్నారు. రక్షణ వలయంగా నిలుస్తున్నారు. వీళ్లకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పిస్తున్నది కూడా యవ వలంటీర్‌లే.

శాంతి సౌభాగ్యాలు
గ్రీన్‌ గ్యాంగ్‌ గుడుంబా కుండల్ని బద్దలు కొడుతున్న వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ గ్యాంగ్‌ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. గ్రీన్‌ గ్యాంగ్‌లో ప్రస్తుతం 150 మంది వరకు మహిళలు ఉన్నారు. ప్రతి సాయంత్రం వీళ్లంతా కలుస్తారు. అయితే అందరూ ఒకే చోట కలవరు. బృందాలుగా విడిపోయి, వేర్వేరు చోట్ల సమావేశం అవుతారు. ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని చర్చించుకుంటారు. ఉంటే ఆ బాధిత మహిళను ఎలా గట్టెక్కించాలో ఆలోచిస్తారు. కార్యాచరణ సిద్ధం చేసుకున్నాక బాధితురాలి ఇంటికి వెళ్లి భర్త వైఖరిని మార్చుకొమ్మని సలహాయిస్తారు. సాధారణంగా చెయ్యి చేసుకోరు. చేతిలో కర్రలు మాత్రం ఉంచుకుంటారు. ఏ ఫిర్యాదులూ లేనప్పుడు గ్రామం మంచిచెడ్డల కోసం అధికారులను కలిసే విషయమై మాట్లాడుకుంటారు. ఏబీసీ న్యూస్‌ దక్షిణాసియా కరస్పాండెంట్‌ సియోభన్‌ హెన్యూ ఈ గ్రీన్‌ గ్యాంగ్‌ను.. ‘ఆకుపచ్చ రంగునే మీ యూనిఫారమ్‌కు ఎందుకు ఎంచుకున్నారు అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఆకుపచ్చ సౌభాగ్యానికి, శాంతికి చిహ్నంగా మేము భావిస్తాం. అయితే ఈ మగవాళ్లు మాకు అవి రెండూ లేకుండా చేస్తున్నారు. వాటిని సాధించుకోవడం కోసమే మా పోరాటం’’ అని చెప్పారు.

గులాబీ గ్యాంగ్‌
పన్నెండేళ్ల వయసుకే సంపత్‌ పాల్‌ దేవి ఒక గొర్రెపిల్లలా భర్త వెనకే నడిచి, మెట్టినింట అడుగుపెట్టింది. ఇరవై ఏళ్లకే ఐదుగురు పిల్లల తల్లి అయింది. గొర్రెల కాపరి అయిన ఆమె తండ్రి తన కూతురుని ఎంత త్వరగా ఇంకొకరి కాపలాకి ఇస్తే అంత త్వరగా తన భారం వదులుతుందని భావించాడే తప్ప, తర్వాత పిల్ల భవిష్యత్తు ఏమిటని ఆలోచించలేదు. బడిపిల్లలకు ఐస్‌క్రీమ్‌ అమ్ముతుండే దేవి భర్త కూడా తన భార్యాపిల్లలకు చల్లని జీవితాన్ని ఇవ్వలేకపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక నిరుపేద గ్రామాల్లో మహిళల పరిస్థితి చాలావరకు ఇలాగే ఉంటుంది. బాల్యంలోనే వివాహం అయిపోతుంది. అక్కడితో చదువు ఆగిపోతుంది. అక్కడి నుంచి భర్త వేధింపులు సాధింపులు మొదలవుతాయి. దేవి కూడా అలాంటి సగటు గృహిణే. తను, తన కుటుంబం, తన కష్టాలు... అంతే. గుట్టుగా నెట్టుకొస్తోంది. అయితే ఆమె జీవితంలోని ఓ క్షణం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆమెలోని దృఢత్వాన్ని, నాయకత్వ లక్షణాలను బయటికి తెచ్చింది.  ఆమెపై 2014లో ‘గులాబ్‌ గ్యాంగ్‌’ అనే సినిమా కూడా వచ్చింది! ఆ చిత్రంలో సంపత్‌ పాల్‌ దేవి పాత్రను మాధురీ దీక్షిత్‌ పోషించారు.

గ్రీన్‌ గ్యాంగ్‌ లీడర్‌ ఆశాదేవి
2006లో ఓరోజు సంపత్‌ పాల్‌ దేవి తన ఇంటి బయట, అత్యంత బాధాకరమైన దృశ్యం చూసింది. ఓ భర్త తన భార్యను గొడ్డును కూడా బాదని విధంగా బాదుతున్నాడు. ‘చచ్చిపోతాను, నన్ను కొట్టొద్దు’ అని ఆ భార్య అతడి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతోంది. అయినా ఆమె భర్త కరుణించలేదు. అడ్డుపడిన వాళ్లను సైతం కొట్టబోయాడు. ‘నా భార్య. నా ఇష్టం’ అన్నాడు. ఆ రాత్రి సంపత్‌ పాల్‌ దేవి నిద్రపోలేదు. తెల్లవారుజామునే లేచి కొంతమంది మహిళలను సమీకరించుకుంది. అందరి చేతుల్లో కర్రలు! అంతా కలిసి ఆ భర్త ఇంటి మీదికి వెళ్లారు. అతణ్ని బయటికి రప్పించి, దేహశుద్ధి చేశారు. అదీ ఆరంభం. బుందేల్‌ఖండ్‌ గ్రామంలో గులాబీ రంగుల చీరలు ధరించిన ‘గులాబీ గ్యాంగ్‌’ ఆవిర్భవించింది. 2010 నాటికి రాష్ట్రవ్యాప్తం, దేశవ్యాప్తం అయింది. ఎక్కడైనా, ఏ ఇంట్లోనైనా స్త్రీపై దౌర్జన్యం, గృహహింస జరుగుతోందని తెలిస్తే గులాబీ గ్యాంగ్‌ అక్కడ ప్రత్యక్షమౌతోంది. ప్రలోభాలకు లోను కాకూడదన్న కారణంతో ప్రభుత్వ యంత్రాంగం నుంచీ, స్వచ్ఛంద సేవాసంస్థల నుంచి ఎలాంటి ఆసరా కోరకుండా సంపత్‌ పాల్‌ దేవీ తన సైన్యాన్ని తనే నిర్మించుకుంది.  ‘ప్రతి ఆడపిల్లా చదువుకోవాలి. ప్రతి మహిళా స్వేచ్ఛగా జీవించాలి’. ఇదే సంపత్‌ పాల్‌ దేవి ధ్యేయం. గ్రీన్‌ గ్యాంగ్‌ కూడా సరిగ్గా గులాబీ గ్యాంగ్‌ బాటలోనే పయనిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement