గుణదల క్షేత్రం | Gunadala of Mary Church | Sakshi
Sakshi News home page

గుణదల క్షేత్రం

Published Tue, Dec 27 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

గుణదల క్షేత్రం

గుణదల క్షేత్రం

విశ్వాస శిఖరం

తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్‌ తర్వాత మేరీ మాత చర్చ్‌ అనగానే విజయవాడలోని గుణదల జ్ఞప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.

దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద క్షేత్రం – గుణదల మేరీమాత చర్చి. ఫ్రాన్సులోని లూర్థు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్‌ను పోలినట్టుగా విజయవాడ శివారులోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్‌ తర్వాత మేరీ మాత చర్చ్‌ అనగానే గుణదలే జ్ఞప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. సాధారణ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న క్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2017 ఉత్సవాలకు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు హాజరవడానికి సిద్ధపడుతున్నారు.

చరిత్ర: అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్‌ జోసఫ్స్‌ ఇనిస్టిట్యూట్‌ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. దానికి రెక్టర్‌గా ఇటలీకి చెందిన ఫాదర్‌ పి. అర్లాటి నియుక్తులయ్యారు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో 1971లో పూర్తిస్థాయి చర్చి నిర్మితం అయ్యింది. గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథబాలలు, క్రైస్తవ మత కన్యలు, కథోలికులు (క్యాథలిక్స్‌) ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ (మేరీ మాత) ఉత్సవాలు నిర్వహించు కునేవారు. 1933లో ఫాదర్‌ అర్లాటి ఆ«ధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కథోలికులు, ఫాదర్‌ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు.

1947 నుంచి తిరనాళ్ళు: 1946లో అప్పటి ఫాదర్‌ బియాంకి, జిప్రిడా, బ్రదర్‌ బెర్తోలి, ఎల్‌క్రిప్పాలు గుణదల కొండపై మరియమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మించతలపెట్టారు ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలిచేందుకు పూనుకున్నారు. అయితే 1947లో ఫాదర్‌ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన  నిర్మాణాలు అప్పుడు కురిసిన భారీవర్షానికి కొట్టుకు పోయాయి. అయినా సరే మిగిలిన ఫాదర్లు నిరుత్సాహపడలేదు. ఫాదర్‌ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తిచేశారు. ఫలితంగా 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా ప్రబలిన కారణాన ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకూ ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి. ఇవాళ గుణదల మాత ఉత్సవాలంటే తెలియనివాళ్ళు లేరు.

ఫిబ్రవరిలోనే ఎందుకు..?
ఫ్రాన్సులోని లూర్థు నగరం దాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్‌ సోబిరస్‌ అనే పధ్నాలుగేళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కనుక గుణదలలో కూడా  ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి జనవరి 31న నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతోంది.

భక్తిశ్రద్ధలతో... శిలువ మార్గం
గుణదల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురుమదురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చిలను నిర్చించి, శిలువ వరకు మెట్లమార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్ష్రేతం రెక్టర్‌ చర్చి నుంచి గుహ వరకు దివ్యసత్‌ ప్రసాద పూజను నిర్వహిస్తారు.

మొక్కులు తీర్చుకునే రోజులు
మేరీ మాత ఉత్సవాలు జరిగే మూడు రోజులూ క్రైస్తవులంతా భక్తిప్రపత్తులతో హాజరై మొక్కులను తీర్చుకుంటారు. నవంబర్‌లో జరిగే ప్రత్యేక ఆరాధనలకు, నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సాగే ప్రత్యేక ప్రార్థనలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు రావడం ఆనవాయితీగా వస్తోంది.

– రత్నబాబు మోత్రపు ‘సాక్షి’, విజయవాడ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement