వీరు వారయ్యారు!
ట్రెండ్
మనకున్న బలమైన అభిప్రాయాల్లో ఒకటి... మహిళలు అద్దం ముందు ఎక్కువ సమయాన్ని గడుపుతారని. అయితే ఈ అభిప్రాయానికి ఇక కాలం చెల్లినట్లే... ఎందుకంటే ఇప్పుడు అద్దం ముందు ఎక్కువ సమయాన్ని ఆడవాళ్ల కంటే మగవాళ్లే గడుపుతున్నారు. యార్క్‌షైర్(ఇంగ్లండ్)కు చెందిన ‘ఎవజ్’ అనే లైఫ్‌స్టయిల్ బ్రాండ్ బ్రిటన్‌లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలిసిన విషయం ఏమిటంటే రోజులో మగవాళ్లు కనీసం 23 సార్లు అద్దం ముందు నిల్చొని తమ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నారని, దీనికి విరుద్దంగా మహిళలు మాత్రం రోజుకు 16 సార్లు అద్దం ముందు నిల్చుంటున్నారని.
మగవాళ్లలో ఎక్కువ మంది అద్దం ముందు నిల్చొని తమ బాడీ పార్ట్స్‌ను చూసుకొని మురిసిపోతున్నారు. 38 శాతం మంది మగవాళ్లు తరచుగా తమ తలకట్టును చూసుకుంటున్నారు. 43 శాతం తమ కళ్లను చూసుకుంటున్నారు. 49 శాతం అద్దంలో తమ చిరునవ్వును చూసుకుంటున్నారు. 76 శాతం మంది తమ కండలను చూసుకుంటున్నారు. కొందరైతే రోజుకు 30 సార్లు అద్దం ముందు నిలుచుంటూనే ‘తప్పు చేస్తున్నానేమో’ అని చిన్నపాటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.