సూర్యోదయపు సవ్వడి వినిపించకముందే.. | habit of waking up early’ | Sakshi
Sakshi News home page

సూర్యోదయపు సవ్వడి వినిపించకముందే..

Published Mon, Jan 20 2014 12:33 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

సూర్యోదయపు సవ్వడి వినిపించకముందే.. - Sakshi

సూర్యోదయపు సవ్వడి వినిపించకముందే..

 ప్రేరణ
 వేకువనే లేచి విజయాన్ని ఆహ్వానించు..
 
 అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా, కెమికల్ ఇంజనీర్‌గా గెలుపు రుచిని ఆస్వాదించి, అందరికీ ఆదర్శంగా నిలిచిన జాక్ ఫ్రాన్సిస్ వెల్చ్.. లేబర్ పార్టీ నేతగా, ఆపై బ్రిటన్ ప్రధానిగా ప్రజాభిమానాన్ని పోగేసుకున్న గోర్డాన్ బ్రౌన్.. భారత పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన ఆది గోద్రెజ్.. వీరంతా విజేతలు. వీరు చేపట్టిన వృత్తి ఏదైనా, పయనించే మార్గం మరేదైనా.. వీరి విజయగాథలను తరచిచూస్తే ఒక ఉమ్మడి అంశం కనిపిస్తుంది. అదే "habit of waking up early’. వేకువనే నిద్ర లేవడం!
 తెల్లవారుజామున నిద్ర లేవడం.. విజయానికి తారక మంత్రం. ఆ మంచి అలవాటే మీ జీవితంలో పెను మార్పులకు దోహదం చేస్తుంది. అది ఆఫ్రికాలోని దట్టమైన అటవీ ప్రాంతం. జింక రోజూ ఉదయాన్నే లేచి, పరుగు లంకించుకుంటుంది. సింహం కంటే వేగంగా పరుగెత్తాలి. లేదంటే దానికి ఆహారమైపోవాల్సిందే. ఇలాగే సింహం కూడా నిద్రలేస్తుంది. వేగంగా, మరింత వేగంగా పరుగుపెట్టి జింకను అందుకోవాలని తపనపడుతుంది. జింక చిక్కకుంటే పస్తులు తప్పవు. ఆ పస్తులు ప్రాణం తీయకమానవు. మనం జింకా? లేదంటే సింహమా? అనేది అప్రస్తుతం. గుర్తించాల్సిన విషయం ఏంటంటే సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాలి.. విజయం కోసం పరుగులంకించుకోవాలి. ఆ పరుగే విజయానికి దగ్గర చేస్తుంది!
 
 అదే తొలి అడుగు కావాలి:
 మీ జీవితాన్ని మార్చే గెలుపును అందుకోవాలన్నదే మీ లక్ష్యమైతే.. ఆ లక్ష్యం కోసం మీరు వేసే మొదటి అడుగు ‘తొందరగా నిద్ర లేవడ’మే కావాలి! సూర్యుడి కిరణాలు పుడమిని తాకక ముందే నిద్ర లేచి, రోజును ప్రారంభించాలి. రోజూ మీరు నిద్రలేస్తున్న సమయం కంటే ఓ గంట ముందు లేస్తే, ఏడాదికి 365 అదనపు గంటలు మీ చేతిలో ఉంటాయి. ఈ సమయాన్ని ఓ మంచి పుస్తకాన్ని చదవడానికి, లేదంటే వ్యాయామం చేయడానికి ఇలా.. దేనికైనా కేటాయించండి. ఆ గంట సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి. కొద్ది రోజుల తర్వాత ఆ గంట సమయం.. మీ కెరీర్‌లో లేదా మీ ఆరోగ్యంలో లేదంటే మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో విశ్లేషించుకోండి. దట్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఎర్లీ వేకప్..!
 
 ఆత్మస్థైర్యానికి నాంది:
 తెల్లవారుజామున తొందరగా నిద్ర లేచి, పనులు ప్రారంభిస్తే మీ మెదడుకు ఒక స్పష్టమైన ఆదేశం వెళ్తుంది.. అదేమిటంటే మీరు మీ లక్ష్యాలను సాధించేందుకు, విజయ శిఖరాన్ని అందుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని! తొందరగా నిద్ర లేవడం వల్ల లక్ష్యాలను సాధించగలనన్న ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. మీ ఆశయాలను నెరవేర్చుకునేందుకు శారీరక శక్తితోపాటు మానసిక బలమూ చేకూరుతుంది. ఈ క్రమశిక్షణ మీ జీవితానికి మెరుగులు దిద్దుతుంది. కొందరు వేకువనే నిద్ర లేవాలనుకుంటారు. కానీ బద్ధకం ఆవరిస్తుంది. వీరు విన్నర్స్ కాలేరు. అలారం బెల్ మోగిందంటే ఒక అవకాశం మీ తలుపు తట్టినట్టే లెక్క. బెల్ మోగిందే తడవున నిద్ర లేవాలి.
 
 గెలుపు పిలుపు వినిపించాలంటే:
 మీరు రోజూ ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తారనుకుందాం. ఒక రోజు 5.45కు అలారం పెట్టుకోండి. ఆ అలారంను మీ మంచానికి దూరంగా పెట్టండి. అలారంను ఆపేద్దామనుకున్నా అది దూరంగా ఉంటుంది కాబట్టి బెల్ మోగిన వెంటనే తప్పనిసరిగా మంచం దిగాల్సిందే. ఎలాగూ దిగాం కాబట్టి తక్షణం పనికి ఉపక్రమించాల్సిందే. ఇలా కొద్ది రోజుల తర్వాత ఆలారంను 5.30కి పెట్టుకోండి. ఇలా పావు గంట చొప్పున తగ్గించుకుంటూ, బెల్ మోగిన వెంటనే నిద్ర లేవడాన్ని ప్రాక్టీస్ చేస్తే నెల రోజులు తిరిగేసరికల్లా మీరు 5 గంటలకే నిద్ర లేస్తారు. తర్వాత కొద్ది రోజులకు అలారం అవసరం లేకుండానే 5 గంటలకు నిద్ర లేవడం అలవాటవుతుంది. ఆ అలవాటే మీకు గెలుపు పిలుపు వినిపించేలా చేస్తుంది. ఇంకెందుకాలస్యం.. రేపటి రోజును తొందరగా ప్రారంభించండి...!
 -‘కెరీర్ 360’ సౌజన్యంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement