హ్యాకర్ల ట్రెండు... మారిపోయింది..! | Hackers trend has been changed | Sakshi
Sakshi News home page

హ్యాకర్ల ట్రెండు... మారిపోయింది..!

Published Sat, Sep 7 2013 12:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

హ్యాకర్ల ట్రెండు... మారిపోయింది..!

హ్యాకర్ల ట్రెండు... మారిపోయింది..!

మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారు.. అకస్మాత్తుగా రిమోట్ మొరాయిస్తుంది. చానెళ్లు వాటంతటవే మారిపోతాయి. మీరు ఒక చానెల్ పెడితే... టీవీ తెరపై ఇంకేదో చానెల్ ప్రత్యక్షమవుతుంది. మీ టీవీ ఏకంగా మీ పైనే నిఘా పెట్టేస్తుంది! మీరు రోడ్డుపై కారులో రయ్యిన దూసుకుపోతున్నారు. అకస్మాత్తుగా మీ కారు బ్రేకులు ఫెయిలవుతాయి లేదా స్టీరింగ్ బిగుసుకుపోతుంది. చూస్తుండగానే యాక్సిడెంట్ జరిగిపోతుంది! అంతే కాదు... మీ గుండెకు అమర్చిన పేస్‌మేకర్ పరికరం హఠాత్తుగా పనిచేయడం మానేసి గుండెపోటు తెప్పించొచ్చు కూడా! అవును... ఎందుకంటే హ్యాకర్లు ఇప్పుడు ట్రెండు మార్చారు మరి!
 
 ఇంతవరకూ కంప్యూటర్లు, వెబ్‌సైట్‌లు, ఈ-మెయిళ్లు, క్రెడిట్‌కార్డుల వంటివాటి నుంచి సమాచార తస్కరణకు, ఆర్థికపరమైన దోపిడీకే పరిమితమైన హ్యాకర్లు.. ఇప్పుడు కాదేదీ హ్యాకింగ్‌కనర్హం అంటూ అన్నిరకాల ఆధునిక టెక్నాలజీలపైనా దృష్టిసారిస్తున్నారు. హ్యాకర్లు తెలివి మీరిపోతుండటంతో హ్యాకింగ్ ప్రక్రియ రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోందని ఇటీవల ‘ఐవోయాక్టివ్’ అనే అంతర్జాతీయ భద్రతా సంస్థ నిపుణులు హెచ్చరించారు. ఆటోమేటిక్ వాహనాలు, టీవీలు, వె బ్ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లు, వై-ఫైతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నింటినీ హ్యాకర్లు ఇప్పుడు తమ నియంత్రణలోకి తీసుకోగలుగుతున్నారని వారు వెల్లడించారు. గుండెకు అమర్చే పేస్‌మేకర్‌ను సైతం హ్యాక్ చేసి హత్యలు కూడా చేసేయగల స్థాయికి చేరారంటేనే.. టెక్నాలజీ ఎంత పెరిగినా భద్రత మాత్రం డొల్లగానే మారుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
 
 స్టీరింగ్ చేతిలో ఉన్నా.. కారు మాట వినదు..!


 హైవేపై కారు గంటకు 90 కి.మీ. వేగంతో రయ్యిన దూసుకుపోతుంటుంది. ఒక్కసారిగా స్టీరింగ్ బిగుసుకుపోతుంది. కారు అడ్డం తిరుగుతుంది లేదా బ్రేకులు ఫెయిలవుతాయి లేదా ఉన్నపళంగా నడిరోడ్డు పైనే అడ్డంగా తిరిగి ఆగిపోతుంది. మొత్తానికి అన్నిరకాలుగా డ్రైవరు నియంత్రణ కోల్పోతాడు. కారు అత్యంత వేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇందులో ఏది జరిగినా పెను ప్రమాదం తప్పదు. కేవలం ఒక బటన్‌ను నొక్కి హ్యాకర్లు ఇదంతా చేయగలరన్నది అసలు సంగతి. భవిష్యత్తులో కంప్యూటర్ల సాయంతో నడిచే ఆటోమేటిక్ వాహనాల వాడకం బాగా పెరగనున్నందున హ్యాకర్లు వాటిని అదుపులోకి తీసుకుని నియంత్రించే ప్రమాదముందని ‘ఐవోయాక్టివ్’ కంపెనీ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కంప్యూటరైజ్డ్ ఆటోమేటిక్ కారును ఎలా హ్యాకింగ్ చేయవచ్చో కూడా వారు ఇటీవల లాస్‌వెగాస్‌లో చేసి చూపించారు. ఒక్క క్లిక్‌తోనే వారు ఓ ఆటోమేటిక్ కారును డ్రైవరు నుంచి పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆటోమేటిక్ కార్లలోని ఏదైనా ఒక్క కంప్యూటర్‌ను హ్యాక్ చేసినా... ఇక ఆ కారు, అందులో ఉండేవారి భద్రత గాలిలో కలిసినట్టే. రేడియో, యూఎస్‌బీ పోర్టు, జీపీఎస్ వ్యవస్థ, వై-ఫై వంటి సౌకర్యాలన్నీ హ్యాకర్లకు రాచమార్గాలేనట. అసలు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల కన్నా కార్ల హ్యాకింగే చాలా సులభం అయిపోతుందట. రిమోట్ కంట్రోల్‌తో కార్లను లాక్ చేసేటప్పుడు ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీ స్క్రాంబ్లర్ పరికరంతో సిగ్నళ్లను జామ్ చేసి హ్యాకర్లు లాక్ పడకుండా చేయగలరట. ఇంకేం... కారులో ఉన్న వస్తువులే కాదు... కారును కూడా ఈజీగా మాయం చేసేయొచ్చన్నమాట.  
 
 ఇల్లు... గుల్లే!


 ఇంటి విషయానికి వస్తే... స్మార్ట్ ఫోన్ సాయంతో వై-ఫై, బ్లూటూత్‌తో నడిచే ఎలక్ట్రానిక్ పరికరాలతో ఏర్పాటుచేసే ‘లాకిట్రాన్’ వంటి డోర్ లాక్‌లను తెరవడమూ హ్యాకర్లకు పెద్ద కష్టం కాదట. ఒక్క సుత్తిదెబ్బ పడకుండా.. చడీచప్పుడు లేకుండా... తలుపు తెరవగలిగితే ఇంకేముంది... ఇల్లు గుల్ల అవడం ఖాయం! అలాగే ఇళ్లల్లో మన కంప్యూటర్లకు ఉండే వెబ్ కెమెరాలతో, టీవీలు, బల్బులు, ఇతర వస్తువుల్లో అమర్చే ప్రత్యేక పరికరాలతో కూడా నిరంతరం మనం ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడుకుంటున్నాం? ఎవరితో ఉన్నాం? వంటివీ వారు తెలుసుకోవచ్చట. విద్యుత్ బల్బులు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, ఏసీల వంటి వాటినీ హ్యాకర్లు నియంత్రించగలరట.
 

కత్తులతో కాదు... పేస్‌మేకర్‌తో చంపేస్తారు..!
 
 కొందరు హ్యాకర్లు ఎంతగా తెలివిమీరి పోయారంటే.. హృద్రోగుల గుండె పనితీరు మెరుగుపర్చేందుకు అమర్చే పేస్‌మేకర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తమ నియంత్రణలోకి తీసుకోగలరట. ఇవన్నీ దాదాపుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్లూటూత్ వంటి టెక్నాలజీలతోనే నియంత్రణలో ఉంటాయి. కాబట్టి.. స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేస్తే.. లేదా బ్లూటూత్‌ను నియంత్రిస్తే వీటి పనితీరును మార్చేయవచ్చన్నమాట. అయితే ఇలా శరీరంలో అమర్చే వైద్యపరికరాలను హ్యాకింగ్ చేయవచ్చని, దీనిని ప్రదర్శించి చూపుతానంటూ హ్యాకింగ్‌లో నిపుణుడైన బార్నబీ జాక్ అనే యువకుడు ఇటీవల ముందుకొచ్చారు. ఇందుకు ‘బ్లాక్ హ్యాట్’ అనే కంపెనీ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది కూడా. కానీ ప్రదర్శనకు కొద్ది సమయానికి ముందే జాక్ చనిపోయాడు. అయితే అతడి మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
 
 కొత్త పరిష్కారాలపై దృష్టిపెట్టాలి...

 
 ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నా... వెబ్‌సైట్ల మీద, కంప్యూటర్ల మీద జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతున్నాం. ఇక వాహనాలు, ఇళ్లు, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్, వైద్య పరికరాలపై కూడా హ్యాకర్ల దాడులు ముమ్మరం అయితే ఏం చేయాలో? అంటూ అంతర్జాతీయ భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఏదేమైనా.. హ్యాకర్లను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే కొత్త పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని చెబుతున్నారు. నిపుణుల ఎత్తులకు హ్యాకర్లు ఎప్పటికప్పుడు పైఎత్తులు వేస్తూనే ఉన్నారని... వారి ఆట కట్టించాలంటే నిపుణులు కూడా ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే ఉండాలనీ, వినియోగదారులు తాజా సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
 
 - హన్మిరెడ్డి యెద్దుల
 
 ఇలా కూడా చేస్తారు...
 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రాచుర్యం పొందిన యాంగ్రీబర్డ్స్ వంటి ఆటల ద్వారా రహస్య కోడ్‌ను పంపి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను నియంత్రణలోకి తీసుకుంటారు.
 
 ఐఫోన్ చార్జ్ చేసేందుకు ఉపయోగించే పవర్ అడాప్టర్ ద్వారా కూడా దానిని హ్యాక్ చేస్తారు.
 
 స్మార్ట్‌ఫోన్ ఆప్‌తో పనిచేసే టాయిలెట్లను సైతం నియంత్రణలోకి తీసుకోగలరట. దీనివల్ల టాయిలెట్లో నీళ్లు కిందికి చిమ్మే విధానాన్ని కూడా మార్చేస్తారు.
     
 ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉండే లైటు బల్బులను కూడా ట్యాంపర్ చేసి వెలగకుండా చేస్తారు.
     
 డిజిటల్ ఫ్రిజ్‌ను ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా చేసి ఆ ఇంట్లోవారికి తెలియకుండానే ఆహారాన్ని పాడు చేస్తారు.
     
 ఏసీ యంత్రాలను ఆగిపోయేలా చేసి ఇంట్లోవారికి చెమటలు పట్టించేయగలరు.
     
 రేడియో ట్రాన్సీవర్‌లను ఉపయోగించి తప్పుడు సెన్సర్ సమాచారాన్ని పంపడం ద్వారా వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేసే విద్యుత్ కేంద్రాలను సైతం హ్యాకర్లు పూర్తిగా ఆగిపోయేలా చేయగలరట!
     
 ఇలా... హ్యాకర్లు తలచుకుంటే ఏమైనా చేయగలరు. జాగ్రత్త!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement