హజ్ విధానం ఇలా ఉంటుంది
హజ్‌అనే అరబ్బీ పదానికి ‘యాత్ర’ అని అర్థం. హజ్æ కోసం వెళ్లే ముస్లింల కోసం దివ్య ఖురాన్‌లో అల్లా ఇలా సెలవిచ్చాడు– ‘ప్రప్రథమంగా మానవుల కోసం నిర్మించబడిన ఆరాధన గృహం మక్కా నగరంలో ఉంది. దాన్ని దర్శించుకునే వారికి సకల శుభాలు ప్రసాదించబడతాయి’. అందుకే స్తోమత గల వారు జీవితంలో కనీసం ఒకసారి హజ్ చేయడం తప్పనిసరి.
పవిత్రహజ్‌ను నిర్వర్తించడానికి వెళ్లేవారు ఈ లోకంతో సంబంధంలేని వారుగా... ఒక లుంగీ... ఒక దుప్పటి... ఒక జత పాదరక్షలు మాత్రమే తీసుకొని వెళుతారు. తలకు నూనె, శరీరానికి సుగంధ ద్రవ్యాలు వాడరు. క్షవరం కూడా చేసుకోరు. అన్ని ర కాల అలంకరణలను, సుఖాలను త్యజిస్తారు. వాంఛలను ప్రేరేపించే విషయాలకు దూరంగా ఉంటారు. ఈ నియమ నిబంధనల వల్ల వారి హృదయం దైవారాధనకు సంపూర్తిగా సిద్ధమవుతుంది. హాజీలు కాబా గృహానికి చేరుకొని కాబాను సందర్శిస్తారు. గృహప్రదక్షిణలు చేస్తారు. ‘ముఖామే ఇబ్రహీం’ వద్ద రెండు రకాతులు నమాజులు చేస్తారు. సఫా, మర్వా పర్వతాల మధ్య పరుగెత్తుతారు. మీనా, అరఫాత్, ముజ్దాలిఫాలో బస చేస్తారు. గులకరాళ్లతో షైతాన్‌ను కొడుతారు. ఖుర్బానీ చేస్తారు. ఇలా విధిని పూర్తిచేసి దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయతిస్తారు.
దైవ ప్రసన్నత కోసం....
హజ్ వెళ్లాలని సంకల్పించుకున్న వారు దానికి అన్ని విధాలుగా సంసిద్ధులు కావాలి. దైవం తన దాసుని నుంచి కోరిన దాన్ని నెరవేర్చాలి. హజ్æ సమయంలో ప్రవక్త తెలిపిన దువాలను పఠించాలి.
హజ్ ఎప్పుడు..?
హజ్‌ఇస్లామియా కేలండర్‌లోని చివరి మాసమైన జిల్ హజ్జా నెలలోని 8, 9, 10, 11, 12వ తేదీల్లో నిర్వహిస్తారు. ఈ ఐదురోజుల పాటు ప్రత్యేక ఆరాధనలుంటాయి. హజ్ ఆరాధనలోని మొదటిరోజు ఇహ్రామ్ దుస్తులను ధరించి హజ్ ఆరాధనల సంకల్పం చేసుకొని తల్బియా పలుకుతూ రెండు రకాతుల నఫీల్ నమాజులు చేయాలి. తల్బియా మూడుసార్లు పలికి మక్కానుంచి మినా బయలుదేరాలి. అక్కడ జొహార్, అసర్, మగ్రీబ్æ, ఇషా నమాజులు చేయాలి. రాత్రి మినా మైదానంలో బస చేయాలి.
జిల్ హజ్జా తొమ్మిదవ రోజు
హజ్ రెండవరోజు (9న) ఫజర్ నమాజ్ మినాలో చేసి అరఫాత్ బయలుదేరాలి. మినా నుంచి అరఫాత్ వెళ్లే దారిలో తల్బియా పలకాలి. అర ఫాత్‌లో విడిది చేయడమే అసలు హజ్. జొహర్ ఆసర్ నమాజులు చేయాలి. ఈ రెండు నమాజ్‌లు సాముహికంగా నిర్వహిస్తారు. మగ్రీబ్ నమాజు చేయకుండా ముజ్దలిఫా వైపు బయలుదేరాలి. ఇషా సమయంలో ఒక ఆజాన్ రెండు ఇఖామత్‌లతో మగ్రీబ్, ఇషానమాజ్‌లు ముజ్దలిఫాలో చేయాలి. రాత్రి ముజ్దలిఫాలో గడపాలి. ఇక్కడ 70 కంకర రాళ్లను షైతాన్‌పై విర సడానికి పోగు చేసుకొని పెట్టుకోవాలి.
జిల్ హజ్జా పదవ రోజు
మూడోరోజు (10న) ముజ్దలిఫాలో ఫజర్ నమాజ్ తరువాత దైవ నామస్మరణ ఎక్కువ చేయాలి. పాప కార్యాలను క్షమించమని పశ్చాత్తాప పడాలి. అనంతరం మినా వైపుకు వెళ్లాలి. సూర్యుడు ఉదయించక ముందు పెద్ద షైతాన్ పై ఏడు కంకర రాళ్లతో కొట్టాలి. అనంతరం ఖుర్బానీ చేయాలి. తలవెంట్రుకలను తొలగించుకోవాలి. హజ్ ఆరాధనల కోసం ధరించిన ఇహ్రామ్ దుస్తులను తీసివేయాలి. స్నానం చేసి సాధారణ దుస్తులను ధరించాలి. మక్కా వెళ్లి తవాఫే జియార త్ చేసుకొని తిరిగి మినా మైదానానికి చేరకోవాలి. రాత్రి మినాలో గడపాలి.
హిల్ హజ్జా పదకొండవ రోజు
నాలుగోరోజు (11న) సూర్యోదయం తరువాత ముగ్గురు షైతాన్‌లను కంకరరాళ్లతో కొట్టాలి. ముందుగా బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చిన్నషైతాన్‌పై ఏడు రాళ్లు, మధ్య షైతాన్‌పై ఏడు రాళ్లు, పెద్ద షైతాన్ పై ఏడురాళ్లను కొట్టాలి. మూడోరోజు చేసినట్లే తవాఫే జియార త్ (కాబా గృహ ప్రదక్షణలు) చేయాలి. మినాకు బయలుదేరి రాత్రి అక్కడే బస చేయాలి.
జిల్ హజ్జా 12వ రోజు
ఐదో రోజు (12న) నాలుగోరోజు చేసినట్లే ముగ్గురు షైతాన్‌లపై ఏడు కంకర రాళ్లతో కొట్టాలి. సూర్యాస్తమయం కాకముందే మినా నుంచి బయలుదేరాలి. ఒకవేళ తవాఫే సియారత్ చేయాలనుకుంటేæసూర్యాస్తమయానికి ముందే∙చేసుకోవాలి. ఇంతటితో హజ్ ఆరాధనలు పూర్తవుతాయి. తిరిగి వచ్చేటప్పుడు తవాఫే జియారత్ చేయాలి.
– మహమ్మద్ మంజూర్