జావా నుంచి హైదరాబాద్‌కి... | Handloom Workers balamani Special Story | Sakshi
Sakshi News home page

చేనేత మంత్రం

Published Wed, Aug 7 2019 9:17 AM | Last Updated on Wed, Aug 7 2019 9:31 AM

Handloom Workers balamani Special Story - Sakshi

రాష్ట్రపతి అవార్డు సాధించిన చీరతో బాలమణి, భర్త నరసింహులు

జీవితంలో ఎన్ని షేడ్స్‌ ఉంటాయో చేనేతలోనూ అన్ని షేడ్స్‌ ఉంటాయి. అయితే వాటిని ఒడిసిపట్టే వేళ్లుండాలి. జీవకళను వడకట్టే నేర్పు ఉండాలి. ఆ పట్టు... ఆ నేర్పు చేనేతకారులందరికీ సహజంగా ఉండేదే. కానీ.. బాలమణి సృజనలో ఏదో మంత్రం ఉందనిపిస్తోంది.అది ఆమె నేతలో ప్రతిఫలిస్తూ ఉంటుంది.

‘‘చేనేతకారుని చేతిలో పని ఉంటుంది. పని మాత్రమే ఉంటే సరిపోదు. సృజనాత్మకత ఉండాలి. సమాజాన్ని అధ్యయనం చేయాలి. తన అవసరం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడ తన సేవలను అందించగలిగిన సునిశితత్వం కూడా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే... చేతికి అలవడిన పనిని యాంత్రికంగా చేసుకుంటూ పోవడం కాదు. సమాజంలో చేనేత కళను బతికించుకోవాలి. అందుకు చేనేతకారులు తమను తాము మార్చుకుంటూ ఎదగాలి’’ అన్నారు కందగట్ల బాలమణి.

ఒకప్పుడు చేనేత వస్త్రాలంటే ముతక వస్త్రాలనే దురభిప్రాయం ఉండేది. అందుకు కారణం అప్పట్లో చేనేత రంగంలో మార్పులు రావాల్సినంత వేగంగా రాకపోవడమే. కొత్త రంగులతో ప్రయోగాలు చేయకుండా సంప్రదాయంగా వస్తున్న కొద్ది రంగులనే వాడడం కూడా. అంతేకాకుండా అది మిల్లులో తయారయ్యే రంగురంగుల వస్త్రాల మీద క్రేజ్‌ ఉన్న కాలం కూడా. సింథటిక్‌ వస్త్రాలు సృష్టించిన సునామీని తట్టుకోలేక చేనేత కుటుంబాలు దాదాపుగా రెండు – మూడు తరాలు గడ్డు కాలాన్ని చూశాయి. అలాంటి కష్టకాలంలో కూడా మగ్గాన్ని వదలకుండా ఉన్న వాళ్లు ఇప్పుడు చేనేతలో అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. ఇప్పుడు నూలులో కూడా ఒక్కో రంగులో ఎన్నో షేడ్‌లు లభిస్తున్నాయి. చేనేత మగ్గం మీద కొత్త కొత్త కలర్‌ కాంబినేషన్‌లను ఆవిష్కరిస్తున్నారు. దాంతో మార్కెట్‌ చక్రం ఇప్పుడు చేనేత చుట్టూ పరిభ్రమిస్తోంది. అందుకు నిదర్శనమే హైదరాబాద్, కార్వాన్‌లోని కందగట్ల బాలమణి విజయప్రస్థానం.

కష్టం లేనిదెక్కడ?
‘‘మా నాన్న పుట్టపాక నుంచి హైదరాబాద్‌కి వచ్చి బొగ్గుతో నడిచే లారీకి డ్రైవర్‌గా పనిచేశారు. చేనేత కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఆయన డ్రైవింగ్‌ని తన ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. మమ్మల్ని పెంచడానికి ఆయన పడిన కష్టం చిన్నది కాదు. మా అత్తగారిల్లు మాత్రం మగ్గాన్ని వదిలిపెట్టలేదు. మా మామగారి నాన్నగారు కందగట్ల సాంబయ్య నిజాం పాలన కాలంలో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కొచ్చి చార్మినార్‌ దగ్గర సుల్తాన్‌ షాహిలో ఉండేవారు. సంప్రదాయ చీరలు, పంచెలకే పరిమితం కాకుండా పోలీసులకు పటకా టర్బన్‌లు నేసేవారాయన. కేడర్‌ను బట్టి తల పాగాలు మారుతుంటాయి. అలాగే పోలీసులు కాళ్లకు మేజోళ్లుగా నూలు వస్త్రాన్ని చుట్టుకునేవాళ్లు. ఆయుధాలను అమర్చుకోవడానికి నడుముకు ఓ వస్త్రాన్ని చుట్టుకునేవారు. మా కుటుంబం వాటిని నేసేది. అప్పటి పోలీస్‌ పటకా నమూనా శిల్పారామం ఆర్ట్‌ గ్యాలరీలో ఉందిప్పుడు.

జావా నుంచి హైదరాబాద్‌కి
అప్పట్లో నిజాంకు వచ్చిన ఓ కొత్త ఆలోచన ఇప్పటికీ హైదరాబాద్‌లో చేనేత రంగానికి పని కల్పిస్తూనే ఉంది. ఇండోనేసియా లోని జావా దీవుల్లో ధరించే లుంగీల మీద హైదరాబాద్‌ ముస్లింలకు క్రేజ్‌ ఉండేది. అక్కడ తయారైన లుంగీలు హైదరాబాద్‌కి దిగుమతి అయ్యి సామాన్యుడికి చేరడానికి చాలా ఖర్చయ్యేది. స్థానిక చేనేతకారుల చేత ఆ లుంగీలను నేయించడం అనే ప్రయోగం విజయవంతమైంది. వాళ్లు ఇష్టపడే రంగులు, డిజైన్‌లను మాకు చేయి తిరిగిన ఇకత్‌లో తెచ్చారు తాతగారు(మామగారి నాన్న). మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లకు నిజాం పాలన  రద్దయింది. అప్పుడు హైదరాబాద్‌లో పోలీస్‌ యూనిఫామ్‌ కూడా మారిపోయింది.

మా కుటుంబానికి కష్టకాలం అది. అప్పటి వరకు పాడి ఆవులాగ ఉపాధినిచ్చిన మగ్గానికి పనులు తగ్గిపోయాయి. అది మా మామగారి తరం. ఆ క్లిష్ట సమయంలో కూడా ఆయన మగ్గాన్ని వదలకపోవడం వల్లనే ఇప్పుడు మా కుటుంబం ఇంతటి గౌరవాలను అందుకోగలుగుతోంది. ఆయన తన జీవితాన్ని మగ్గం మీదనే.. ఏడాదికోసారి రంజాన్‌ మాసంలో కొనుగోలు చేసే జావా లుంగీలను నేయడంలోనే గడిపారు. కష్టకాలంలో మా అత్తగారు కూలి పనులకు వెళ్లి కుటుంబ భారాన్ని పంచుకున్నారు. సవాళ్లు ఒక్క చేనేతలోనే కాదు, అన్ని వృత్తుల్లోనూ ఉంటాయి. మనం ఎంచుకున్న ఏ పనికైనా మనవంతు సేవను పూర్తిగా అందివ్వాల్సిందే.

అందరమూ పనిచేస్తాం
నేను, నా భర్త, ఇద్దరు మరుదులు, ఇద్దరు తోడికోడళ్లు, ఆడపడుచు పని చేస్తాం. రోజుకు ఆరు లుంగీలు తయారవుతాయి. ఒక్కో లుంగీకి మాకు 750 రూపాయలు వస్తాయి. షాపుల వాళ్లు వెయ్యికి అమ్ముకుంటారు. వీటితోపాటు డ్రెస్‌ మెటీరియల్స్‌... కలంకారీ అద్దకం, బ్లాక్‌ ప్రింటింగ్‌ కూడా చేస్తాం.  గ్రాడ్యుయేషన్‌లు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లు చేసి ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తే వాళ్లకంటే మంచిగా సంపాదించుకుంటున్నాం. అయితే ఇంట్లో అందరం సమష్టిగా పనులు చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. మా ఇంట్లో నడుస్తున్న యూనిట్‌తోపాటు నల్గొండలోని ఒలిగొండలో నాలుగు మగ్గాలకు మెటీరియల్, డిజైన్‌లు ఇచ్చి పని తీసుకుంటున్నాం. లంగర్‌హౌస్‌లో మహిళల కోసం ట్రైనింగ్‌ యూనిట్‌ ప్రారంభించాను. పెద్దగా చదువులు లేక, బయటి పనులకు పోలేక ఇంటికే పరిమితమైన మహిళలు ఎనిమిది మంది నా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు.

కులాల గిరిగీతలు వద్దు
చేనేత కళ పద్మశాలి కుటుంబాలకే పరిమితం అన్నట్లు ఉండేది. ఆ కులాల గిరిగీతలను చెరిపేయాలనేది నా ఉద్దేశం. ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోగలగాలి. మా పిల్లలకు చేనేత నేర్పించాం. ఏ చదువులకు, ఉద్యోగాలకు వెళ్లినా సరే ఇంటిపని వచ్చి ఉండాలని చెప్పి మరీ నేర్పించాం. మా అమ్మాయి అమెరికాలో ఎంబిఏ చేస్తోంది. తోడికోడళ్ల పిల్లల్లో ఒకరు మెడిసిన్, ఒకరు ఇంజనీరింగ్‌ చేయాలనుకుంటున్నారు. వాళ్లకు పని నేర్పించగలిగాం కానీ వాళ్లను మగ్గానికి కట్టేయలేం కదా! అలాంటప్పుడు ఈ కళ అంతరించి పోకుండా ముందు తరాలకు చేరాలంటే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించాలనే ఆలోచనతోనే ‘వన విజారద హ్యాండ్‌లూమ్‌ యూనిట్‌’ పేరుతో ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాను. వన విజారద అంటే ప్రకృతి సిద్ధమైన అందమైన అల్లిక అని అర్థం.

కూతురికి నేర్పించరక్కడ
ఇకత్‌లో మనది ఒక శైలి. పోచంపల్లి చేనేతకారులు చేసే చేనేత అది. చీర రెండు వైపులా ఒకటే నునుపుదనం ఉంటుంది. ఉల్టా పల్టా అర్థం కానంత నైపుణ్యంగా ఉంటుంది. ఒరిస్సాలోని సంబల్‌పూర్‌ది ఒక శైలి. చీర వెనుకవైపు డిజైన్‌లో ఉపయోగించిన దారాల చివర్లు కనిపిస్తుంటాయి. గుజరాత్‌ పటోలా చేనేత కూడా ఇకత్‌లో ఒక వైవిధ్యమైన శైలి. గుజరాత్‌ ఇకత్‌ పటోలా పట్టు చీర నేయడానికి రెండేళ్లు పడుతుంది. ధర రెండు లక్షల వరకు ఉంటుంది. సంపన్న కుటుంబాల వాళ్లకు కూతురికి పదేళ్లు ఉండగానే చీర ఆర్డర్‌ చేస్తారు. అంత గిరాకీ ఉంటుంది. అక్కడ మనం ఊహించని మరో సంగతి ఏమిటంటే.. ఆ చేనేత కుటుంబాల్లో కూతురికి డిజైన్‌లో మెళకువలు నేర్పించరు. ప్రతి కుటుంబమూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ తమకంటూ కొన్ని వైవిధ్యమైన డిజైన్‌లను రూపొందించుకుంటుంది. ఆ డిజైన్‌లను ఆ కుటుంబపు ఆస్తిగా భావిస్తారు. కూతురికి నేర్పిస్తే ఆ డిజైన్‌ ఇల్లు దాటి బయటకు వెళ్లిపోతుందని కూతురికి నేర్పించరు. తమ ఇంటికి వచ్చిన కోడళ్లకు మాత్రమే నేర్పిస్తారు. ఆడపిల్లను పుట్టింట్లో పరాయి మనిషిగా చూడడమనే ఆలోచనే మనకు బాధ కలిగిస్తుంది. వాళ్లకది అలవాటైపోయింది.

అవార్డు చీరను అమ్మను
నేర్చుకోవాలనే సంకల్పం బలంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. పదో తరగతి పూర్తవుతూనే పెళ్లి చేశారు నాకు. అత్తగారింటికి వచ్చిన తర్వాత నా భర్త, మామగారు నేత పని నేర్పించారు. 35 ఏళ్ల కిందట సాదా లుంగీ నా తొలి నేత. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు స్టడీ టూర్‌కు వచ్చే స్కూలు పిల్లలకు చేనేత పాఠాలు చెప్తున్నాను. చేనేతలో ఎన్నో ప్రయోగాలు చేశాను. ‘డబుల్‌ ఇకత్‌ డబుల్‌ డోరియా కోటా చీర’ను నేసి రాష్ట్రపతి అవార్డు అందుకోగలిగాను. ఆ చీర నా ప్రయోగాల్లో అత్యున్నతమైన ప్రయోగం. దానిని అమ్మే ఉద్దేశం లేదు. చీర నేతలో ప్రతి దశనూ నోట్స్‌ రాసి పెట్టాను. ఆ చీరను, నోట్స్‌నీ మా పిల్లలకు వారసత్వ ఆస్తిగా ఇస్తాను. నేను అక్టోబర్‌ రెండున పుట్టాను. గాంధీ పుట్టిన రోజు పుట్టడం వల్లనే చేనేతకు ఇంతగా అంకితమైపోతున్నావంటారు మా పిల్లలు సరదాగా.– కందగట్ల బాలమణి,రాష్ట్రపతి అవార్డు గ్రహీత

ఇప్పటి సవాల్‌ నకిలీలతోనే
ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మగ్గాన్ని ప్రేమిస్తూ... చేనేతను కాపాడుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు నకిలీల బెడద పెద్ద సవాల్‌ అవుతోంది. నార్మల్‌ డిజైన్‌తో ఒక చీర నేయడానికి మూడు నెలలు పడుతుంది. ప్రయోగాత్మకంగా కొత్త డిజైన్‌ను రూపొందించడానికి ఆరు నెలలు పడుతుంది. ఆరు నెలలు కష్టపడి కొత్త డిజైన్‌ను బయటకు తెచ్చిన వారం రోజుల్లో అదే డిజైన్‌ను స్క్రీన్‌ ప్రింటింగ్‌ చేస్తున్నారు. అవి తక్కువ ధరకు దొరుకుతాయి. టెక్నాలజీ మాకు ఒక రకంగా చేయూత అవుతోంటే మరో రకంగా సమస్య అవుతోంది. ఇకత్‌ డిజైన్‌కి పేటెంట్‌ రైట్స్‌ వచ్చాయి, కానీ వాటి మీద విజిలెన్స్‌ సరిగా ఉండడం లేదు. నిఘా పెంచాలి, ఇకత్‌ ప్రింట్‌ చేసిన వస్త్రాల మీద ‘ఇది ఇకత్‌ ప్రింట్‌’ అని ముద్రించే నిబంధన అయినా రావాలి. అలా చేయకపోతే ఒకటే ఎగ్జిబిషన్‌లో అసలైన చేనేత స్టాల్‌ ఉంటుంది, ఆ పక్కనే ప్రింట్‌ల స్టాల్‌ ఉంటుంది. ‘ఏది నేతో, ఏది ప్రింటో తెలియని వాళ్లు మేము ఎక్కువ ధర పెట్టాం’ అనుకుంటూ మా స్టాల్‌ దాటి వెళ్లి పోతారు. కొత్త డిజైన్‌ల రూపకల్పనతో మమ్మల్ని మేము నిరూపించుకుంటూ మన గలుగుతున్నాం. ఈ నకిలీ దాడి నుంచి చేనేత బతికి బట్టకట్టాలంటే నిబంధనలు ఇంకా పటిష్టంగా ఉండాలి’’.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -ఫొటోలు – మోర్ల అనిల్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement